New Twist In Anantapur Ex Treasury Employee Manoj Case - Sakshi
Sakshi News home page

మనోజ్‌ కేసులో కొత్త ట్విస్ట్‌.. మధ్యవర్తిగా ‘పెద్ద మనిషి’.. బెడిసి కొట్టిన వ్యూహం..  

Published Wed, Nov 2 2022 7:07 AM | Last Updated on Wed, Nov 2 2022 8:33 AM

New Twist In Anantapur Ex Treasury Employee Manoj Case - Sakshi

అనంతపురం శ్రీకంఠం సర్కిల్‌: ట్రెజరీ మాజీ ఉద్యోగి మనోజ్‌ అక్రమాల కేసు సరికొత్త మలుపు తిరిగింది. పోలీసుల విచారణలో ఫిర్యాదుదారులు కూడా సహ నిందితులని తేలింది. రియల్‌ ఎస్టేట్‌ వ్యవహారంలో డబ్బు రాబట్టుకునేందుకు ‘ఫిర్యాదు’ డ్రామాకు తెరలేపారని నిర్ధారించారు. ‘ఫిర్యాదు’ ప్లాన్‌కు రూపకల్పన చేసిన వారిలో ఓ పోలీస్‌ అధికారి కూడా ఉన్నట్లు తెలిసింది. టీడీపీ బడా నేతల అండదండలు కలిగిన అనంతపురానికి చెందిన రాయల్‌ శ్రీనివాసులు, దండు వెంకటనాయుడు అలియాస్‌ డీవీ నాయుడు ట్రెజరీ మాజీ ఉద్యోగి మనోజ్‌తో జతకట్టారు. అతని సహకారంతో నకిలీ ఎన్‌ఓసీలు సృష్టించడం, డాక్యుమెంట్లు లేకపోయినా రిజిస్ట్రేషన్లు చేయించడం తదితర అక్రమ మార్గాల ద్వారా అనతికాలంలోనే రూ.కోట్లకు పడగలెత్తారు.
చదవండి: వచ్చే రెండు రోజులు వర్షాలు 

ఆర్థిక వ్యవహారాల్లో విభేదాలు.. 
కూడేరు మండలం కమ్మూరు గ్రామ సర్వేనంబర్‌ 513లోని భూమికి సంబంధించి నిరభ్యంతర పత్రం (ఎన్‌ఓసీ) కోసం రూ.కోట్లు చేతులు మారాయి. చెప్పిన విధంగా ఎన్‌ఓసీ చేయించకపోవడంతో భూమి యజమాని తానిచ్చిన డబ్బు వెనక్కు ఇవ్వాలని ఒత్తిడి తెచ్చాడు. మనోజ్‌ మాత్రం గడువు మీద గడువు కోరుతూ వచ్చాడు. ఇరువైపులా కమీషన్‌ తీసుకున్న రాయల్‌ శ్రీనివాసులుకు ఇది ఇబ్బందికరంగా మారింది. ఇరకాటంలో పెట్టయినా సరే మనోజ్‌ నుంచి డబ్బు రాబట్టాలని డీవీ నాయుడుతో కలసి ప్లాన్‌ వేశారు.

రంగంలోకి ‘పెద్ద మనిషి’.. 
అనుకున్నదే తడవుగా పోలీసు శాఖకు అనుబంధంగా పనిచేసే ఓ ‘పెద్ద మనిషి’ని రాయల్‌ శ్రీనివాసులు, డీవీ నాయుడు ఆశ్రయించారు. ఎలాగైనా మనోజ్‌పై ఒత్తిడి పెంచి డబ్బు రాబట్టాలని, మీరు కూడా కావలసినంత దండుకోవచ్చని సలహా ఇచ్చారు. మనోజ్‌ను భయపెట్టడానికి   అవసరమైతే అతని అక్రమాలకు సంబంధించిన ఆధారాలు కూడా ఇస్తామని చెప్పారు. దీనికి ‘పెద్ద మనిషి’ సరేనన్నాడు. ఈ పని చేసిపెట్టడానికి ఓ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ను సంప్రదించి.. అనంతపురంలోని పోలీసు అతిథిగృహానికి పిలిపించాడు. మనోజ్‌ను భయపెట్టి, మనకు కావలసినంత డబ్బు రాబట్టుకోవడానికి ఏదైనా మంచి ప్లాన్‌ ఇవ్వాలని శ్రీనివాసులు, డీవీ నాయుడు కోరారు.

ఎన్‌ఓసీ విషయంలో మనోజ్‌ మోసం చేశాడని ‘పోలీస్‌ స్పందన’లో ఎస్పీకి ఫిర్యాదు చేస్తే.. ఆ ఫిర్యాదు నేరుగా తన వద్దకే వస్తుందని, అప్పుడు మన పని సులభమవుతుందంటూ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ పక్కా ప్లాన్‌ రచించారు. ఇందుకు గాను శ్రీనివాసులు, నాయుడుతో డీల్‌ కుదుర్చుకున్నారు. వీరికి అనుసంధానకర్తగా ఉన్న ‘పెద్ద మనిషి’కి కూడా రూ.లక్షల్లో ముట్టజెప్పారు. 

బెడిసి కొట్టిన వ్యూహం.. 
సీఐ ప్లాన్‌ మేరకు గత నెలలో రాయల్‌ శ్రీనివాసులు, డీవీ నాయుడు ‘స్పందన’లో ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. మనోజ్‌ తమను మోసం చేశాడని, న్యాయం చేయాలని కోరారు. అయితే ఈ ఫిర్యాదును ఎస్పీ ఫక్కీరప్ప సీరియస్‌గా తీసుకున్నారు. స్పెషల్‌ ఆపరేషన్‌ గ్రూప్‌ (ఎస్‌ఓజీ)ను రంగంలోకి దింపారు. మనోజ్‌ను ఎస్‌ఓజీ తన ఆదీనంలో ఉంచుకుంది. తెలుగు తమ్ముళ్లలో ఒకరైన రాయల్‌ శ్రీనివాసులును సైతం విచారణ కోసం అదుపులోకి తీసుకుంది. దీంతో మరొక తెలుగు తమ్ముడు డీవీ నాయుడు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఊహించని విధంగా వ్యూహం బెడిసికొట్టడంతో సదరు సీఐ కంగుతిన్నారు. నిందితులను ఎస్పీ నేరుగా విచారణ చేస్తే తన బండారం బయటపడుతుందని భయపడుతున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో నిత్యం నిందితుల వద్దే ఉంటున్నట్లు సమాచారం.    

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement