అనంతపురం శ్రీకంఠం సర్కిల్: గుర్తు తెలియని అగంతకుడి చేతిలో ఏఎన్‌ఎం, వలంటీరు ఇద్దరూ మోసపోయారు. ఉన్నతాధికారులు ఫోన్ చేశారని భావించి అగంతకుడికి వివరాలు అందజేసి, వారి బ్యాంక్ ఖాతాలోని నగదు అపహరణకు కారకులయ్యారనే అపవాదును మూటగట్టుకున్నారు. ఘటనకు సంబంధించి ఇరువర్గాలు అనంతపురం నాల్గో పట్టణ పోలీసులను ఆశ్రయించాయి. ఇరువర్గాలను విచారించిన అనంతరం ఇది సైబర్ నేరస్తుడి పనిగా సీఐ జాకీర్ హుస్సేన్ నిర్ధారించారు. గురువారం వివరాలను విలేకరులకు ఆయన వెల్లడించారు.
రుద్రంపేటలోని సచివాలయం–2 పనిచేస్తున్న ఏఎన్‌ఎం ఎర్రమ్మ, వలంటీర్ మమతకు ఇటీవల గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి కలెక్టర్ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నానని చెప్పాడు. కోవిడ్‌తో మృతి చెందిన బాధిత కుటుంబసభ్యులకు అందించే పరిహారం విషయంలో ఫోన్ చేశానని, వారి వివరాలు, ఫోన్ నంబర్లు ఇవ్వాలని కోరాడు. ఇది నిజమని భావించిన ఏఎన్‌ఎం, వలంటీర్ వెంటనే అగంతకుడు అడిగిన సమాచారాన్ని అందజేశారు. ఇదే విషయాన్ని బాధిత కుటుంబసభ్యులకు తెలిపి, కలెక్టర్ కార్యాలయం నుంచి ఫోన్ కాల్ వస్తే వారు అడిగిన వివరాలు అందజేయాలని సూచించారు.
సచివాలయం సిబ్బంది చెప్పిన ప్రకారమే పామిడి ఓబుళమ్మ మనవరాలు భారతి తనకు వచ్చిన ఫోన్ కాల్ అందుకుని అవతలి వ్యక్తి అడిగిన వివరాలు అందించింది. కాసేపటికి ఆమె బ్యాంక్ ఖాతాలోని రూ.58 వేలు మాయమయ్యాయి. అలాగే కరోనాతో మృతి చెందిన లక్ష్మీనరసమ్మ కుమారుడు మాధవ ఖాతాలో నుంచి రూ.46 వేల కాజేశాడు. ఇరువురి ఖాతాలోనూ నగదు మాయం కావడంతో వారు ఏఎన్‌ఎం, వలంటీర్‌ను నిలదీశారు. తమ బ్యాంక్ ఖాతాలోని నగదు కాజేసింది మీరేనంటూ వాగ్వాదానికి దిగారు. దీంతో మోసపోయామని భావించిన బాధితులు, సచివాలయ సిబ్బంది ఉమ్మడిగా నాల్గో పట్టణ పోలీసులను ఆశ్రయించారు.
Comments
Please login to add a commentAdd a comment