కర్నూలు: గుర్తు తెలియని దుండగుల చేతిలో వలంటీర్ దారుణహత్యకు గురైన ఘటన పట్టణంలో బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. మండిగిరి గ్రామ పంచాయతీ పరిధిలోని రాజీవ్‌గాంధీనగర్‌కు చెందిన ఈరమ్మ కుమారుడు హరిబాబు(23) భరత్ నగర్ వలంటీర్‌గా పని చేస్తున్నాడు. బుధవారం రాత్రి 11 గంటల వరకు వినాయక విగ్రహ మండపాల వద్ద ఉన్న హరిబాబు ఆ తర్వాత ఇంటికెళ్లి నిద్రకు ఉపక్రమించాడు.
మధ్యరాత్రి 12 గంటల సమయంలో ఫోన్ రావడంతో బయటకు వెళ్లి ఎంతకూ తిరిగి రాలేదు. తెల్లవారుజామున ఈరమ్మ నిద్రలేచి చూడగా కుమారుడు కనిపించకపోవడంతో ఇరుగుపొరుగు వారిని విచారించి బంధువులకు సమాచారం ఇచ్చింది. అందరూ కలిసి వెతుకుతుండగా సమీపంలోని మారెమ్మవ్వ గుడి పక్కన రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉన్నాడని తెలిసి అక్కడకు చేరుకుని తల్లి గుండెలు బాదుకుంది.
విషయం తెలుసుకున్న డీఎస్పీ శివనారాయణస్వామి, సీఐలు విక్రమసింహా, శ్రీనివాసనాయక్ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. తలపై మారుణాయుధాలతో దాడి చేయడంతో అక్కడికక్కడే మృతిచెందినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఘటనా స్థలంలో మృతుడి సెల్ ఫోన్, ఆనవాళ్లను సేకరించి, కర్నూలు నుంచి డాగ్ స్క్వాడ్‌ను రప్పించి ఆధారాలు సేకరించారు. తల్లి, బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టామని, త్వరలోనే హంతకులను పట్టుకుంటామని డీఎస్పీ తెలిపారు.
నేనెట్టా బతికేది నాయనా..
హత్యకు గురైన కుమారుడు హరిబాబు మృతదేహంపై పడి తల్లి ఈరమ్మ రోదించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. భర్త పదేళ్ల క్రితమే అనారోగ్యంతో మృతిచెందడంతో కొడుకే లోకంగా బతికేది. వలంటీర్‌గా సేవలందిస్తూ ప్రజల మన్ననలు పొందుతుండటం చూసి పొంగిపోయేది. హఠాత్తుగా హత్యకు గురికావడంతో ‘నేనెట్టా బతకాలి నాయనా’ అంటూ గుండెలు బాదుకుంది.
Comments
Please login to add a commentAdd a comment