వరంగల్: అదనపు కట్నం వేధింపులకు ఓ బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్ బలయ్యారు. ఆమె భర్త, అత్తమామలు, ఆడబిడ్డలు అదనపు కట్నం కోసం వేధించడంతో మండలంలోని సూర్యతండాకు చెందిన వాంకుడోతు జ్యోతి(31) అసిస్టెంట్ బ్యాంకు మేనేజర్ పురుగుల మందు తాగి మృతి చెందింది. గీసుకొండ ఇన్‌స్పెక్టర్ సట్ట రాజు కథనం ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం సుజాతనగర్ మండలంలోని లక్ష్మీదేవిపల్లికి చెందిన జ్యోతికి గీసుకొండ మండలం సూర్యతండాకు చెందిన వాంకుడోతు స్వామితో 2017లో వివాహం జరిగింది. జ్యోతి తల్లిదండ్రులు స్వామికి రూ.15 లక్షల కట్నంతో పాటు ఇతర లాంఛనాలతో పెళ్లి జరిపించారు.
వీరికి ఇద్దరు కుమారులున్నారు. స్వామి రైల్వేలో కమర్షియల్ ఇన్‌స్పెక్టర్‌గా, జ్యోతి వరంగల్ నగరంలోని కాశిబుగ్గ ఇండియన్ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం వీరు నగరంలోని శంభునిపేటలో సొంత ఇల్లు కట్టుకుని కాపురం ఉంటున్నారు. ఇటీవల ఇద్దరు కుమారులను తీసుకుని సెలవులు, పండుగ కోసం సూర్యతండాకు వచ్చిపోతున్నారు. జ్యోతి సూర్యతండాకు వచ్చిన ప్రతీసారి ఆమె అత్తామామలు అంబాలి, రాములు, ఆడబిడ్డలు శారద, జ్యోతి, విజ్జి, సునిత అదనపు కట్నం కోసం వేధించేవారు. ఈనెల 2ను స్వామి, జ్యోతి తమ కుమారులను తీసుకుని సూర్యతండాకు రాగా.. జ్యోతిని ఆమె భర్త అత్తమామలు, ఆడబిడ్డలు, అదనపు కట్నం కోసం వేధించడంతో ఆమె గడ్డిమందు తాగింది.
ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆమెను వరంగల్ నగరంలోని ఓప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఓప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ ఆమె బుధవారం మృతి చెందింది. మృతురాలి తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు స్థానిక తహసీల్దార్ విశ్వనారాయణ శవ పంచనామా జరిపించగా మృతురాలి భర్త, అత్త, మామ, ఆడబిడ్డలపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఇన్‌స్పెక్టర్ సట్ల రాజు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment