బాలుడితో అసిస్టెంట్ కలెక్టర్, వైద్యులు, తల్లిదండ్రులు
కాకినాడ క్రైం: బ్లాక్‌ఫంగస్‌ను జయించిన పిన్న వయస్కుడిగా పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన 17 నెలల బాలుడు ఘనత సాధించాడు. కాకినాడ జీజీహెచ్ నుంచి మంగళవారం డిశ్చార్జ్ అయిన నేపథ్యంలో అసిస్టెంట్ కలెక్టర్ సూర్య ప్రవీణ్‌చంద్, సూపరింటెండెంట్ డాక్టర్ ఆర్.మహాలక్ష్మి ఆస్పత్రిలో మీడియాతో మాట్లాడారు. బాలుడు జానకినందన్ దేశంలోనే అత్యంత పిన్న వయస్కుడైన బ్లాక్ ఫంగస్ బాధితుడని అసిస్టెంట్ కలెక్టర్ తెలిపారు. కాకినాడ జీజీహెచ్ వైద్యులు బాలుడికి పునర్జన్మ ప్రసాదించారని కొని యాడారు. ఇదే చికిత్సకు కార్పొరేట్ ఆస్పత్రుల్లో కనీసం రూ.70 లక్షలు ఖర్చవుతుందని తెలిపారు. కోవిడ్ పీడియాట్రిక్స్ నోడల్ అధికారి, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. 20 రోజుల క్రితం బాలుడు అత్యంత ప్రమాదకర స్థితిలో జీజీహెచ్‌లో చేరాడన్నారు. చంటిపిల్లల వైద్య విభాగాధిపతి డాక్టర్ ఎంఎస్ రాజు, ఈఎన్‌టి హెచ్‌వోడి డాక్టర్ కృష్ణకిషోర్ పర్యవేక్షణలో సూపరిం టెండెంట్ డాక్టర్ మహాలక్ష్మి ఆధ్వర్యంలో వైద్య సేవలందించామన్నారు.
జూన్ 3న సైనస్ ద్వారా డాక్టర్ కృష్ణకిషోర్, డాక్టర్ సుధీర్ పర్యవేక్షణలో శస్త్రచికిత్స నిర్వహించి, ఫంగస్‌ను తొలగించామన్నారు. శస్త్రచికిత్స తరువాత తిరిగి పీడియాట్రిక్ ఐసీయూలో ఉంచి డాక్టర్ ఎంఎస్ రాజు ఆధ్వర్యం లో వైద్య సేవలు కొనసాగాయని వెంకటేశ్వర్లు చెప్పారు. 12 రోజుల పూర్తి పర్యవేక్షణ అనంతరం మంగళవారం డిశ్చార్జి చేసినట్లు తెలిపారు. బాలుడిని ప్రతి 10 రోజులకు ఒకసారి పరీక్షిస్తామని, కొన్ని నెలలపాటు ఈ పర్యవేక్షణ కొనసాగుతుందని తెలిపారు. డాక్టర్ మహాలక్ష్మి మాట్లాడుతూ.. అత్యుత్తమ వైద్య సేవలు, నిష్ణాతులైన వైద్య బృందాలు కాకినాడ జీజీహెచ్‌లో అందుబాటులో ఉన్నాయన్నారు. కార్పొరేట్ ఆసుపత్రుల్లో చేరి ఆర్థిక ఇబ్బందులు కొనితెచ్చుకోవద్దని కోరారు. బాలుడి తల్లిదండ్రులు పద్మ, కిరణ్ మాట్లాడుతూ.. ఆసుపత్రి వైద్యులు తమ బిడ్డ ప్రాణాలు కాపాడిన దేవుళ్లంటూ భావోద్వేగానికి గురయ్యారు. సమావేశంలో సీఎస్‌ఆర్‌ఎంఓ డాక్టర్ అనితతో పాటు ఆర్‌ఎంఓ డాక్టర్ దీప్తి వివిధ విభాగాల హెచ్‌ఓడీలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment