mch
-
కేసీఆర్ కిట్ ఇక.. ఎంసీహెచ్ కిట్
నల్లగొండ టౌన్: గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన కేసీఆర్ కిట్లపై ఉన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫొటోలపై ఇప్పుడు తెల్లని స్టిక్కర్లను అతికించి బాలింతలకు పంపిణీ చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే బాలింతలకు అందజేస్తున్న కేసీఆర్ కిట్ పేరును మార్చుతూ ఉత్తర్వులు జారీ చేసింది. కేసీఆర్ కిట్‌కు బదులు ఎంసీహెచ్ (మదర్ అండ్ చైల్డ్ హెల్త్) కిట్‌గా పేరు మారుస్తూ వైద్య, ఆరోగ్యశాఖ సర్క్యులర్ జారీ చేసింది. ప్రస్తుతం జిల్లాల్లో అందుబాటులో ఉన్న కేసీఆర్ కిట్లపై ఉన్న కేసీఆర్ ఫొటోపై తెల్లని స్టిక్కర్ అతికించి దానిపై ఎంసీహెచ్ కిట్ అని పేరు రాసి బాలింతలకు పంపిణీ చేస్తున్నారు. దాంతో పాటుగా గర్భిణులకు అందజేస్తున్న న్యూట్రీషియన్ కిట్‌లోని వస్తువులపై ఉన్న కేసీఆర్ ఫొటోలపై కూడా తెల్లని స్టిక్కర్ అతికించి ఇస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పంపిణీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం కిట్లు పంపిణీ చేస్తున్నాం. ఎంసీహెచ్ పేరుతో ముద్రించిన కిట్లు వచ్చే వరకు.. ఇప్పటికే జిల్లాలో ఉన్న కిట్ల స్టాక్‌పై ఉన్న కేసీఆర్ పేరు, ఫొటోపై స్టిక్కర్లు అతికించి ఎంసీహెచ్ కిట్ల పేరు రాసి పంపిణీ చేస్తున్నాం. అలాగే న్యూట్రిషియన్ కిట్లలోని వస్తువులపై ఉన్న కేసీఆర్ ఫొటోలపై కూడా తెల్లని స్టిక్కర్ వేస్తున్నాం. – డాక్టర్ కొండల్రావు, డీఎంహెచ్ఓ, నల్లగొండ -
బాన్సువాడ దవాఖాన సరికొత్త రికార్డు.. ఒకే నెలలో 504 ప్రసవాలు
కామారెడ్డి: బాన్సువాడ మాతాశిశు సంరక్షణ ఆస్పత్రిలో అగస్టులో 504 ప్రసవాలు జరిగాయని ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస్‌ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని శనివారం ఆస్పత్రిలో కేక్ కట్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆస్పత్రి ప్రారంభించి రెండేళ్లవుతోందన్నారు. గత నెలలో రికార్డు స్థాయిలో 504 ప్రసవాలు జరిగాయన్నారు. వైద్యులు, సిబ్బందికి అభినందనలు తెలిపారు. వైద్యులు సుధ, సిబ్బంది ఉన్నారు. -
కమీషన్ల కోసం ఎంసీహెచ్‌ను ముంచారు!
మంచిర్యాలటౌన్: స్థానిక నడిపెల్లి ఎమ్మెల్యే దివాకర్‌రావు కమీషన్లకు కక్కుర్తిపడి మాతా శిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్)ను గోదావరి ఒడ్డున వరద నీటిలో మునిగే చోట నిర్మించారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. హాథ్‌సే హాథ్ జోడో యాత్ర కొనసాగింపులో భాగంగా చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర 31వ రోజు ఆదివారం మంచిర్యాల పట్టణంలో నిర్వహించారు. మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు, డీసీసీ అధ్యక్షురాలు సురేఖ నివాసం నుంచి ప్రారంభమై ఐబీ చౌరస్తాలో ప్రభుత్వ ఆస్పత్రికి ఎదురుగా ఉన్న ఐబీ ఆవరణలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులను పరిశీలించి మాట్లాడారు. మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ఐబీ ఆవరణలో నిర్మించి ఉంటే ప్రభుత్వ ఆసుపత్రికి సమీపంలో ఉండి, ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావు ఎన్నిసార్లు చెప్పినా స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వం పెడచెవిన పెట్టిందన్నారు. గోదావరి ఒడ్డున నిర్మించడం వల్ల ప్రజలకు దూరభారం కావడంతోపాటు, ప్రభుత్వాసుపత్రికి దూరంగా ఉంటుందని, గోదావరికి వరదలు వస్తే మునిగి పోయే ప్రమాదం ఉందని చెప్పినా వినలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. కమీషన్ల కోసమే ఎంసీహెచ్‌ను గోదావరిలో ముంచారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల జిల్లాలో పంటలతోపాటు ఎంసీహెచ్ కూడా మునిగిందన్నారు. నిధులు ఖర్చు చేయాల్సింది ప్రజల సంక్షేమం కోసమే కానీ, ఎమ్మెల్యేల కమీషన్ల కోసం కాదని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలకు విద్య, వైద్యం కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని తెలిపారు. -
కాకినాడ జీజీహెచ్‌లో ఎంసీహెచ్ భవనం
సాక్షి, అమరావతి: కాకినాడ జీజీహెచ్‌లో రూ.42 కోట్లతో మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్ (ఎంసీహెచ్) బ్లాక్ నిర్మించడంతో పాటు వైద్యపరికరాల్ని ఏర్పాటు చేసేందుకు రంగరాయ వైద్యకళాశాల అల్యుమ్ని ఆఫ్ నార్త్ అమెరికా (ఆర్–ఎమ్‌కానా) ప్రతినిధులు ముందుకొచ్చారు. మంగళగిరిలోని వైద్యశాఖ ప్రధాన కార్యాలయంలో గురువారం ఆ శాఖ ముఖ్యకార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు సమక్షంలో డీఎంఈ డాక్టర్ వినోద్‌కుమార్, ఆర్–ఎమ్‌కానా ప్రతినిధులు ఒప్పందపత్రాలపై సంతకాలు చేశారు. నాడు–నేడు కార్యక్రమం ద్వారా వైద్యరంగంలో సీఎం జగన్ ఆస్పత్రుల బలోపేతం, కొత్త వైద్యకళాశాలలు నిర్మాణం, ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తున్న తీరుకు స్ఫూర్తిగా తాము ఎంసీహెచ్ బ్లాక్ నిర్మాణానికి ముందుకొచ్చామని ఆర్–ఎంకానా ప్రతినిధులు తెలిపారు. ఇప్పటికే రూ.20 కోట్లతో కాకినాడ జీజీహెచ్‌లో ఎంసీహెచ్ భవనం గ్రౌండ్, మొదటి ఫ్లోర్లను నిర్మించామని, మిగిలిన భవన నిర్మాణం పూర్తిచేయడంతో పాటు అన్ని వసతులతో 18 నెలల్లో ఎంసీహెచ్ బ్లాక్‌ను ప్రభుత్వానికి అందజేస్తామని చెప్పారు. అధునాతన సౌకర్యాలతో కూడిన మాతాశిశు సంరక్షణ సేవలు, నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఈ బ్లాక్‌లో అందుబాటులోకి వస్తాయన్నారు. గ్రౌండ్‌ఫ్లోర్‌లో 12 లేబర్ టేబుళ్లు , 40 పడకల యాంటీనేటల్ వార్డు, రెండు ఎమర్జెన్సీ ఆపరేషన్ థియేటర్లు, మొదటి ఫ్లోర్లో 75 పడకల పోస్ట్‌నేటల్ వార్డు, రెండో ఫ్లోర్లో రెండు అధునాతన ఎలక్టివ్ ఆపరేషన్ థియేటర్లు, మూడు, నాలుగు ఫ్లోర్లలో నియోనేటల్ వార్డు, వెంటిలేటర్, ఫొటోథెరపీ వంటి సౌకర్యాలు సమకూరతాయని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్–ఎంకానా వ్యవస్థాపకులు, రంగరాయ వైద్యకళాశాల రెండోబ్యాచ్‌కు చెందిన డాక్టర్ నిమ్మగడ్డ ఉపేంద్రనాథ్, డాక్టర్ పాలడుగు రాంబాబు, డాక్టర్ ఎస్.వి.లక్ష్మీనారాయణ, కాకినాడ జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ హేమలత పాల్గొన్నారు. ఎంసీహెచ్ బ్లాక్ నిర్మాణానికి ముందుకొచ్చిన ఆర్–ఎంకానా ప్రతినిధులకు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని, కృష్ణ బాబు కృతజ్ఞతలు తెలిపారు. -
ఖమ్మం: తల్లీబిడ్డలు చల్లగా ఉండాలంటే..
ఖమ్మం: వేసవి కాలం వచ్చేసింది. నానాటికీ ఉక్కపోత పెరుగుతోంది. ఇళ్లలో అయితే ఎలాగోలా ఇక్కట్లు అధిగమిస్తాం. కానీ ఖమ్మం జిల్లా ప్రధాన ఆస్పత్రిలోని మాతాశిశు కేంద్రం(ఎంసీహెచ్)లోని బాలింతల ఇబ్బందులు చెప్పనలవి కాకుండా ఉన్నాయి. ఎంసీహెచ్ రెండో అంతస్తులో ఉండగా.. వేడి ఎక్కువగా, ఫ్యాన్లు తక్కువగా ఉండడంతో బాలింతలు ఉక్కపోతతో అవస్థ పడుతున్నారు. దీంతో గర్భిణులను ప్రసవానికి తీసుకొచ్చేటప్పుడు వారి కుటుంబ సభ్యులు టేబుల్ ఫ్యాన్ కూడా వెంట తీసుకొస్తున్నారు. ఫలితంగా ప్రతీ బాలింత బెడ్ వద్ద టేబుల్ ఫ్యాన్లు కనిపిస్తున్నాయి. -
బాన్సువాడ ఎంసీహెచ్‌కు జాతీయ గుర్తింపు
సాక్షి, హైదరాబాద్: కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని మాతా శిశు సంరక్షణ కేంద్రానికి (ఎంసీహెచ్) జాతీయ గుర్తింపు దక్కింది. ‘బ్రెస్ట్ ఫీడింగ్ ఫ్రెండ్లీ హాస్పిటల్ ఇనిషియేటివ్ (బీఎఫ్‌హెచ్‌ఐ)‘అందించే ‘బ్రెస్ట్ ఫీడింగ్ ఫ్రెండ్లీ అక్రెడిటేషన్ (గ్రేడ్ –1)‘లభించింది. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం బాన్సువాడ ఎంసీహెచ్‌ను పలుమార్లు సందర్శించింది. అన్ని ప్రమాణాలు పాటిస్తున్నట్టు నిర్ధా రించుకొని అక్రెడిటేషన్ మంజూరు చేసింది. దేశంలో ప్రభుత్వ, ప్రైవేట్ కలిపి నాలుగు ఆసుపత్రులకే బీఎఫ్‌హెచ్‌ఐ అక్రెడిటేషన్ ఉంది. దీంతో భారత దేశ స్థాయిలో ఘనత సాధించిన ప్రభుత్వ దవాఖానగా బాన్సువాడ ఎంసీహెచ్ రికార్డ్ సాధించింది. ఈ సర్టిఫికెట్ మూడేళ్ల పాటు అమల్లో ఉంటుంది. సీఎం ఆదేశాలతో .. సీఎం కేసీఆర్ ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం బ్రెస్ట్ ఫీడింగ్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. వైద్య సిబ్బంది, ఆశాల ద్వారా గర్భిణులకు, బాలింతలకు విస్తృతంగా అవగాహన కల్పిస్తోంది. బ్రెస్ట్ ఫీడింగ్ ప్రమోషన్ నెట్వర్క్ ఆఫ్ ఇండియా సహకారంతో 35 మంది మాస్టర్ ట్రైనీలకు శిక్షణ ఇచ్చింది. ప్రత్యేకంగా దేశంలోనే మొదటిసారిగా ‘వాలంటరీ లాక్టేషన్ వర్కర్స్‘ను నియమించింది. వీరు హాస్పిటల్లో గర్భిణులకు, బాలింతలకు తల్లిపాలపై అవగాహన కల్పించడంతోపాటు ప్రసవమైన అరగంటలోనే పిల్లలకు ముర్రుపాలు పట్టిస్తున్నారు. ప్రస్తుతం బాన్సువాడ ఎంసీహెచ్‌లో ముగ్గురు వాలంటీర్లు ఉన్నారు. వైద్య సిబ్బందికి అభినందనలు: హరీశ్‌రావు బాన్సువాడ ఎంసీహెచ్‌కు బీఎఫ్‌హెచ్‌ఐ అక్రెడిటే షన్ రావడం హర్షణీయమని హరీశ్‌రావు పేర్కొ న్నారు. హాస్పిటల్ వైద్య సిబ్బందికి అభినందనలు తెలిపారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుతున్నాయన్నారు. -
సిగరెట్ అట్టముక్కే మందుల చీటీ.. డాక్టర్లపై మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం
జనగామ: సిగరెట్ డబ్బా అట్టముక్కలపై మందులు రాసి బయట తెచ్చుకోమంటున్నారని మంత్రి హరీశ్‌రావుకు జనగామ చంపక్‌హిల్స్ మాతా శిశుసంరక్షణ ఆరోగ్య కేంద్రం (ఎంసీహెచ్)లోని బాలింతలు, రోగుల బంధువులు ఫిర్యాదు చేశారు. పేరుకే ఉచితమని.. సూదులు, సిరప్లు కూడా బయటే కొంటున్నామని మంత్రి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. నకిరేకల్ నుంచి సిద్దిపేటకు వెళ్లే క్రమంలో మార్గమధ్యలో ఉన్న చంపక్‌హిల్స్ ఎంసీహెచ్‌ను మంత్రి శనివారం తనిఖీ చేశారు. నేరుగా జనరల్ వార్డులోని బాలింతల వద్దకు వెళ్లి ఆత్మీయంగా పలకరించారు. వారికి అందుతున్న వైద్య సేవలు, ఇతర సదుపాయాల గురించి తెలుసుకున్నారు. అక్కడే ఉన్న లింగాల ఘణపురానికి చెందిన మహేశ్‌ను మంత్రి పలకరించగా.. ‘సిగరెట్ డబ్బాల అట్టముక్కలపై మందుగోలీలు బయటకు రాస్తున్నారు. చూడండి సారూ’అంటూ తన వద్ద ఉన్న ప్రిస్క్రిప్షన్‌ను మంత్రికి చూపించారు. ‘ఉచితం పేరుకే. నొప్పుల సూది.. సిరప్లు కూడా బయటనే కొంటున్నాం’అంటూ జనగామ మండ లం గోపిరాజుపల్లికి చెందిన భాగ్యలక్ష్మి తన గోడు వెళ్లబోసుకున్నారు. ఆస్పత్రి నివేదికివ్వాలని వైద్యారోగ్య శాఖ కమిషనర్‌కు ఆదేశం ప్రభుత్వం నుంచి కొరత లేకుండా మందు లు పంపిస్తుంటే ప్రైవేటు మెడికల్ దుకాణాలకు ఎం దుకు రిఫర్ చేస్తున్నారని డాక్టర్లు, సిబ్బందిపై మం త్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంసీహెచ్ ఎదుట ఉన్న మెడికల్ దుకాణాలను వెంటనే సీజ్ చేయిం చాలని ఆదేశించా రు. ఒక్కో పేషెంట్ వద్దకు వెళ్లి వారు చెప్పిన ప్రతి విషయాన్ని వింటూ పక్కనే ఉన్న ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సుగుణాకర్‌రాజును వివరణ కోరారు. ప్రైవేటు స్కా నింగ్ సెంటర్లను ప్రోత్సహించకుండా ఎంసీహెచ్‌లోనే గర్భిణులకు ఈ సేవలను ఉచితంగా అందించాలన్నారు. ఆస్పత్రిలోని లోపాలను గుర్తించి అక్కడి నుంచే వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి కరుణతో ఫోన్లో మాట్లాడారు. జనగామ ఎంసీహెచ్‌కు సంబంధించిన సమగ్ర నివేదికను అందించాలని ఆదేశించారు. -
మాతృవేదన.. శిశు రోదన
పురిటి నొప్పులు పంటి బిగువున దిగమింగుకుని పుట్టిన శిశువును తనివితీరా ముద్దాడాలన్నదే మాతృమూర్తి ఆకాంక్ష. అయితే జిల్లాలో గర్భిణులకు ఆ కోరిక తీరడం లేదు. ఎంసీహెచ్ కార్డుల లేమి.. అందని నిధులు, వైద్యం, పౌష్టికాహారం వెరసి తల్లీబిడ్డలకు సంరక్షణ కరువైంది. ఫలితం మాతృవేదన.. శిశు రోదన తప్పడం లేదు. సాక్షి, తిరుపతి: తల్లీబిడ్డలకు సంరక్షణ కరువైంది. గ్రామీణ ప్రాంతాల్లోని మా తా శిశుసంరక్షణ కోసం కేటాయించే నిధులు వారికి అందడం లేదు. దీంతో గర్భి ణులు, బాలింతలు ఇక్కట్లు పడుతున్నా రు. జిల్లాలో ప్రతి వెయ్యి మంది కి ఒకరు గర్భిణులు ఉన్నారు. వీరికి ప్రభుత్వం ఎంసీహెచ్ కార్డు సరఫరా చేయకపోవడంతో గర్భిణులకు అందా ల్సిన నిధులు, పౌష్టికాహారం ఆగిపోయింది. జిల్లాలో 102 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 644 ఉప కేంద్రాలున్నాయి. కార్పొరేషన్, మున్సిపాలిటీ పరిధిలో మరో 10 కేంద్రాలున్నాయి. ప్రతి ఉపకేంద్రం పరిధిలో 10 నుంచి 15 మంది వరకు గర్భిణులు ఉన్నారు. ఈ లెక్కన జిల్లా వ్యాప్తంగా సుమారు 6,540 మందికిపైగా గర్భిణులు ఉన్నారు. తప్పని తిప్పలు గ్రామాల్లోని గర్భిణులను గుర్తించిన అనంతరం వారికి మాతా శిశు సంరక్షణ (ఎంసీహెచ్) కార్డులు తప్పనిసరిగా ఇవ్వాలి. ఈ కార్డును పరీక్షల కోసం ఆస్పత్రికి వెళ్లిన సమయంలో చూపిం చాల్సి ఉంది. అయితే జిల్లాలో ఏడాదిగా ఎంసీహెచ్ కార్డుల పంపిణీ చేయటం లేదు. ఈ విషయమై ఏఎన్ఎంలు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం కనిపించటం లేదు. ఆస్పత్రికి వచ్చే గర్భిణులకు ఆన్లైన్లో ఉన్న ఎంసీహెచ్ కార్డులను జిరాక్స్ చేసి, వారి పేరు నమోదు చేసి ఇవ్వమని ఉచిత సలహా ఇస్తున్నారు. అందని వందనం పథకం నిధులు గ్రామీణ ప్రాంతాల్లోని గర్బిణుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి వందనం పథకం ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా ప్రతి ఒక్కరికి రూ.6 వేలు డిపాజిట్ చేస్తుంది. అయితే జిల్లాలో ఎంసీహెచ్ కార్డుల కొరత ఉండడంతో ప్రధానమంత్రి వందన పథకం ద్వారా మంజూరయ్యే నిధులు గర్భిణులకు అందడం లేదని పీహెచ్సీ వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే కార్డులు లేక అంగన్వాడీ కేంద్రాల నుంచి పౌష్టికాహారం కూడా తీసుకోలేని పరిస్థితి నెలకొంది. అభివృద్ధి నిధులు వెనక్కేనా? జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నిర్వహణకు ప్రభుత్వం కేటాయించిన నిధులను అధికారులు ఖర్చు చేయలేదు. 2017–18 ఆర్థిక సంవత్సరానికి గాను జిల్లాకు రూ.5.46 కోట్లు మంజూరు చేశారు. ఇందులో కేవలం రూ.46 లక్షలు మాత్రమే ఖర్చు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. మిగిలిన రూ.5 కోట్లు ఈనెల 31లోపు ఖర్చుచేయకపోతే వెనక్కి వెళ్లే అవకాశం ఉందని ఖజనా శాఖ అధికారులు హెచ్చరించారు. ఆగని మాతా శిశు మరణాలు మహిళ గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవం వరకు అన్ని వివరాలను ఎంసీహెచ్ కార్డులో నమోదు చేయాల్సి ఉంది. ఈ కార్డులు లేకపోవడంతో గర్భిణులు, బాలింతలకు ప్రధానమంత్రి మాతృత్వ వందనం పథకం నిధులు అందడం లేదు. అలాగే వారు పౌష్టికాహారం తీసుకోలేని పరిస్థితి నెలకొంది. తల్లీబిడ్డలకు వైద్యం కరువైంది. ఫలితంగా మాతా శిశుమరణాలు ఆగడం లేదు. -
ఎంఎన్‌పీ సమస్యలకు ట్రాయ్ చెక్
న్యూఢిల్లీ: నంబర్ పోర్టబిలిటీ అభ్యర్థనలు తిరస్కరణకు గురవుతున్న ఉదంతాలను నియంత్రించే దిశగా టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఎంఎన్‌పీ క్లియరింగ్ హౌస్ (ఎంసీహెచ్) ఏర్పాటు ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. నంబర్ పోర్టబిలిటీ ప్రక్రియకు సంబంధించిన వివరాలన్నీ ఎంసీహెచ్‌లో అందుబాటులో ఉండేలా చూడాలని ప్రతిపాదించింది. ప్రస్తుత విధానం ప్రకారం నెట్వర్క్ మారదల్చుకున్న వారి గత బిల్లింగ్ బకాయిల వివరాలు, అందుకున్న నోటీసులు, విశిష్ట పోర్టింగ్ కోడ్ (యూపీసీ) ఆఖరు తేదీ మొదలైనవి కొత్త ఆపరేటరు (ఆర్వో)కి అందుబాటులో ఉండటం లేదు. దీంతో ఆయా అంశాలను ధ్రువీకరించు కోలేక పలు నంబర్ పోర్టబిలిటీ అభ్యర్థనలను ఆపరేటర్లు తిరస్కరించాల్సి వస్తోంది. తిరస్కరణకు గురైన కేసుల్లో దాదాపు 40 శాతం అభ్యర్ధనలు యూపీసీ సరిపోలకపోవడం, యూపీసీ గడువు ముగిసిపోవడం వంటి అంశాల కోవకి చెందినవే ఉంటున్నాయి. ఇది గుర్తించిన ట్రాయ్.. ప్రస్తుత పోర్టబిలిటీ ప్రక్రియలో ఎంసీహెచ్‌ని కూడా చేర్చాలని భావించింది. దీనిపై ఆగస్టు 31 దాకా సంబంధిత వర్గాలు తమ అభిప్రాయాలను ట్రాయ్‌కి తెలియచేయొచ్చు. -
‘మహా’ మాస్టర్ ప్లాన్ రెడీ
13 ప్రత్యేక జోన్లుగా విభజన, 7 జిల్లాల్లో విస్తరణ ఎంసీహెచ్, హెచ్ఎండీఏ, హడా, సీడీఏ అంతటా ఒకే ప్రణాళిక సర్వే నంబర్లవారీగా జీఐఎస్‌తో అనుసంధానం త్వరలో ప్రభుత్వానికి నివేదిక... నెలాఖరులో ప్రజల ముందుకు సాక్షి, హైదరాబాద్ హైదరాబాద్ మహానగర అభివృద్ధి నూతన ప్రణాళిక ఏడు జిల్లాలకు విస్తరిస్తూ త్వరలో ప్రజల ముందుకు రానుంది. గతంలో ఉన్న హైదరాబాద్, సైబరాబాద్, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ, ఔటర్ రింగ్‌రోడ్డు గ్రోత్ కారిడార్లతో పాటు భువనగిరి, సంగారెడ్డి మున్సిపాలిటీల మాస్టర్ ప్లాన్లన్నింటినీ కలుపుకుని అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన మాస్టర్ ప్లాన్‌లో మొత్తం 13 జోన్లను పొందుపరిచారు. గతంలో ఉన్న 24 జోన్లను కుదించి రెసిడెన్షియల్, కమర్షియల్, పెరీ అర్బన్, మల్టిపుల్ యూజ్, రిక్రియేషన్, ఫారెస్ట్, కన్జర్వేషన్, ట్రాఫిక్ అండ్ ట్రాన్సపోర్ట్ తదితర అంశాలకు మాస్టర్ ప్లాన్‌లో ప్రాధాన్యం ఇచ్చారు. అయితే గతంలో ఉన్న గ్రామాల మ్యాపుల ప్రకారం చాలా రహదారులు, చెరువులు తాజా ప్రణాళికలో మాయంకాగా కొత్తగా రహదారులు, చెరువులను గుర్తించి అందుకోసం రిజర్వు చేశారు. గతంలో రూపొందించిన ఆయా మాస్టర్ ప్లాన్లతో పోలిస్తే తాజా సర్వేలో చెరువుల సంఖ్య భారీగా పెరిగినట్లు సమాచారం. గ్రామం, సర్వే నంబర్‌వారీగా... తాజా మాస్టర్ ప్లాన్‌లో గ్రామం లేదా పట్టణం, మున్సిపల్ డివిజన్‌వారీగా, సర్వే నంబర్‌వారీగా ఆయా జోన్లను ప్రకటించనున్నారు. మాస్టర్ ప్లాన్ అమల్లోకి వచ్చాక రూపొందించే ప్రత్యేక యాప్‌లో సర్వే నంబర్‌వారీగా జోన్ల వివరాలను క్షణాల్లో ఆన్లైన్లోనే తెలుసుకునే అవకాశం ఉంటుంది. గతంలో రూపొందించిన ఎంసీహెచ్, హడా మాస్టర్ప్లాన్లు ఆటోకార్డ్ సాఫ్ట్‌వేర్‌లో, హెచ్ఎండీఏ ఆటోక్యాడ్‌లో ఉండగా తాజాగా రూపొందించిన మాస్టర్ ప్లాన్‌ను గ్లోబల్ ఇన్ఫర్మేషన్ సిస్టం (జీఐఎస్)తో అనుసంధానమయ్యేలా రూపొందించారు. త్వరలో ముఖ్యమంత్రి, పురపాలక మంత్రి దృష్టికి తీసుకువెళ్లి వారి ఆమోదం పొందాక ముసారుుదా ప్రణాళికను గ్రామాలవారీగా ప్రదర్శించి ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకోనున్నారు. ఇదీ హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్ పరిధి... హెచ్ఎండీఏ కొత్త మాస్టర్ ప్లాన్ హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, యాదాద్రి-భువనగిరి, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో విస్తరించనుంది. ఇందులో హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల్లో పూర్తి ప్రాంతాలతోపాటు రంగారెడ్డి జిల్లాలో మంచాల, కొందుర్గు, ఆమనగల్లు, కేశంపేట, చౌదరిగూడ, యాచారం, తలకొండపల్లి, మాడ్గుల మినహా అన్ని ప్రాంతాలు, యాదాద్రి-భువనగిరిలో భువనగిరి, పోచంపల్లి, చౌటుప్పల్, బీబీనగర్, బొమ్మల రామారం మండలాలు, సంగారెడ్డిలో సంగారెడ్డి, ఆర్సీ పురం, పటాన్చెరువు, హత్నూర, జిన్నారం, మెదక్ జిల్లాలో నర్సాపూర్, శివ్వంపేట, సిద్దిపేట జిల్లాలో వర్గల్, ములుగు, మర్కుక్ మండలాలు హెచ్ఎండీఏ పరిధిలోకి వస్తాయి. అభివృద్ధి నమూనాగా నిలిచేనా... హైదరాబాద్ చుట్టూరా ఉన్న రంగారెడ్డి, మేడ్చల్, యాదాద్రి, సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లాల అభివృద్ధికి నమూనాగా హెచ్ఎండీఏ రూపొందించిన మాస్టర్‌ప్లాన్‌పై అనేక అంచనాలున్నాయి. లీ అసోసియేట్ ఆధ్వర్యంలో రూపొందించిన మాస్టర్ ప్లాన్ హైదరాబాద్ చుట్టూరా విస్తరించి ఉన్న ఏడు జిల్లాలను సమగ్ర అభివృద్ధి దిశగా నడిపించే దిశగా ఉంటుందన్న నమ్మకం ఆయా ప్రాంతవాసుల్లో నెలకొంది. గతంలో హైదరాబాద్ పశ్చిమానే అభివృద్ధి కేంద్రీకృతం కావటంతో వరంగల్, కరీంనగర్, మెదక్, విజయవాడ, మహబూబ్‌నగర్ రహదారుల వైపు అభివృద్ధి నిలిచిపోయింది. సీఎంగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టాక హైదరాబాద్ చుట్టూరా సమాన అభివృద్ధి కేంద్రాలు విలసిల్లేలా చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో తాజా మాస్టర్ ప్లాన్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. -
తల్లడిల్లుతున్న తల్లులు
* గుంటూరు జీజీహెచ్‌లో ఇదీ పరిస్థితి * ఎంసీహెచ్‌కు సీఎం శంకుస్థాపన రాయి వేసి ఏడాది * పునాదులు కూడా తీయని వైనం * అష్టకష్టాలు పడుతున్న బాలింతలు ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే..’ చందాన ఉంది గుంటూరు జీజీహెచ్‌లోని ఎంసీహెచ్ వార్డు పరిస్థితి. సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాతా, శిశు ఆరోగ్య సంరక్షణ వార్డు (ఎంసీహెచ్) నిర్మాణానికి శిలాఫలకం వేసి ఆదివారంతో ఏడాది పూర్తయింది. సంవత్సరంలోగా భవన నిర్మాణం పూర్తిచేసి మెరుగైన వైద్యసేవలను అందించాలని ఆరోజు ముఖ్యమంత్రి వైద్యాధికారులు, ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. అయినా నేటికి పునాదులు కూడా తీయలేదు. గుంటూరు మెడికల్: గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రికి వచ్చే గర్భిణీలు, చిన్నారులకు సరిపడా పడకలు లేక ప్రతిరోజూ వారు పడుతున్న కష్టాలు నిత్యం కనిపిస్తూనే ఉన్నాయి. వారి కష్టాలను తీర్చి సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వం ఎంసీహెచ్ వార్డు నిర్మాణం కోసం రూ. 20 కోట్లు 2014లో విడుదల చేసింది. తల్లి, బిడ్డకు స్పెషాలిటీ వైద్యసేవలు.. జీజీహెచ్‌లో గర్భిణీలు, చిన్నారులు వైద్యం పొందేందుకు సరిపడా మంచాలు లేకపోవడంతో ఒకే పడకపై ఇద్దరు లేదా ముగ్గురు వైద్యం పొందాల్సిన దుస్థితి ప్రస్తుతం నెలకొంది. సాధారణ కాన్పు, ఆపరేషన్ అనంతరం పడకలు లేక కొన్నిసార్లు కటిక నేలపైనే బాలింతలు ఉండాల్సి వస్తోంది. చిన్నపిల్లలది కూడా అదే పరిస్థితి. ఈ దీనావస్థపై ‘సాక్షి’లో కథనాలు కూడా ప్రచురితమయ్యాయి. ఎట్టకేలకు ప్రభుత్వం స్పందించి 200 పడకలతో తల్లి, బిడ్డలకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రత్యేక వార్డు నిర్మించేందుకు నిధులను విడుదల చేస్తూ జీవో విడుదల చేసింది. ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్న కుటుంబ నియంత్రణ విభాగం, గైనకాలజీ వైద్య విభాగం తొలగించి ఆ ప్రదేశంలో ఎంసీహెచ్ వార్డు నిర్మించాలని నిర్ణయించారు. పోస్టు ఆపరేటివ్ వార్డు, ప్రీ ఆపరేటివ్ వార్డు, ఆపరేషన్ థియేటర్, ఎన్ఐసీయూ, ల్యాబ్, డిస్పెన్సరీ, డెలివరీ సూట్స్, తల్లులు వేచి ఉండే గది అన్నీ కూడా ఒకే భవనంలో నిర్మాణం పూర్తయితే అందుబాటులోకి వస్తాయి. ఒకేచోట అన్ని వైద్యసౌకర్యాలు ఉండడం ద్వారా తల్లికి, బిడ్డకు మెరుగైన వైద్యసేవలు అందుతాయి. భవన తొలగింపునకే ఏడాది.. ఆస్పత్రిలో ఎంసీహెచ్ వార్డును నిర్మించేందుకు ప్రస్తుతం ఉన్న పాత భవనాలను తొలగించేందుకు ఆస్పత్రి అధికారులు, ఇంజినీరింగ్ అధికారులకు ఏడాది సమయం పట్టింది. నిధులు విడుదల చేసి మూడేళ్లవుతున్నా సంబంధిత అధికారులు సకాలంలో భవన నిర్మాణం చేసేందుకు ఎందుకు శ్రద్ధ చూపించడం లేదో అర్ధంకావడం లేదు. మరోవైపు రెండేళ్లుగా ఆస్పత్రికి కాన్పుల కోసం వస్తున్నవారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. నెలకు వెయ్యి వరకు డెలివరీలు జరుగుతుండడంతో ఒక్కో పడకపై ఇద్దరు లేదా ముగ్గురు బాలింతలను ఉంచుతున్నారు. ఒకవైపు ఆపరేషన్ కాన్పు నొప్పులు, మరోవైపు కనీసం మంచం కూడా సరిపడక అవస్థలు పడుతున్నారు. సంబంధిత అధికారులు ఇప్పటికైనా స్పందించి సకాలంలో ఎంసీహెచ్ వార్డు భవన నిర్మాణం పూర్తయ్యేలా చూడాలని పలువురు కోరుతున్నారు. -
ఎంసీహెచ్‌లో పసికందు మృతి
ఆస్పత్రి ఎదుట బంధువుల ఆందోళన వైద్యుల నిర్లక్ష్యమే కారణమని బాధితుల ఆరోపణ తమ తప్పేమీ లేదని వైద్యుల వాదన సిద్దిపేట జోన్: సిద్దిపేట మాతా శిశు సంక్షేమ కేంద్రంలో ఒక పసికందు సోమవారం మృతి చెందిన సంఘటన ఆందోళనకు దారితీసింది. వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ బంధువులు ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు. వైద్య చికిత్సలో ఎలాంటి జాప్యం జరగలేదని వైద్యులు వాదనకు దిగారు. మరోవైపు వైద్యులు, పోలీసుల వివరణతో అందోళన సద్దుమనిగింది. వివరాల్లోకి వెళ్తే .. రామాయంపేట మండలం దొంగల ధర్మారం గ్రామానికి చెందిన రాకేష్, శిల్పలకు యేడాది క్రితం వివాహమైంది. తొలి ప్రసవ నిమిత్తం శిల్ప బంధువులు ఆదివారం ఉదయం స్థానిక ఎంసీహెచ్ ఆస్పత్రికి తీసుకువచ్చారు. ప్రసవ వేదనతో వచ్చిన శిల్పను పరీక్షించిన వైద్యులు నార్మల్ డెలివరీ కోసం పరిశీలనలో ఉంచారు. ఒక దశలో ప్రసవం నొప్పులు అధికం కావడంతో బంధువులు ఆదివారం సాయంత్రం శస్త్ర చికిత్స చేయాలని వైద్యులను కోరినప్పటికీ నార్మల్ డెలవరీ కోసం సోమవారం వరకు ఎదురు చూశారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో గర్భంలోని పసికందు హార్ట్‌బీట్‌లో కొంత సమస్య ఉత్పన్నమైందని వైద్యులు శిశు సంరక్షణ కేంద్రానికి గర్భిణీ శిల్పను షిఫ్ట్ చేసి శస్త్ర చికిత్స నిర్వహించారు. అనంతరం పాప మృతదేహాన్ని బయటకు తీయాల్సి వచ్చిందని, హార్ట్‌బీట్ సమస్యతోనే పాప మృతి చెందిందని వైద్యం విషయంలో నిర్లక్ష్యం జరగలేదని హైరిస్క్ ఇన్చార్జి కాశీనాథ్, ఎంసీహెచ్ సూపరింటెండెంట్ రఘరాంరెడ్డిలు వివరణ ఇచ్చారు. పాప మృతి చెందిన విషయం తెలుసుకున్న బంధువులు ఆస్పత్రి ముందు బైఠాయించి ఆందోళన నిర్వహించారు. విషయం తెలుసుకున్న పోలీసులు, వైద్యులు, అక్కడికి చేరుకొని బంధువులకు వివరంగా విషయం తెలియజెప్పడంతో గొడవ సద్దుమనిగింది. వైద్యుల నిర్లక్ష్యమే కారణం సకాలంలో శస్త్ర చికి త్స చేసి ఉంటే పాప మరణించేది కాదని శిల్ప భర్త రాకేష్, బంధువులు ఆరోపించారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే పసికందు గర్భంలోనే మృతి చెందిందని వైద్యుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రసవం కోసం నొప్పులతో వచ్చిన తాము వెంటనే శస్త్ర చికిత్స చేయాలని ఆదివారం మధ్యాహ్నం నుంచి వైద్యులను కోరినప్పటికీ నిర్లక్ష్యం చేసి సోమవారం ఉదయం వరకు ఆలస్యం చే శారన్నారు. తీరా పరిస్థితి విషమించిదని సోమవారం శస్త్ర చికిత్స చేయడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు. -
దందా చేస్తే.. దండనే
►సిద్దిపేట ఎంసీహెచ్‌లో హరీష్ ఆకస్మిక తనిఖీ ►సిబ్బంది మామూళ్ల వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం ►పనితీరు మార్చుకోవాలని హితవు ►త్వరలో తనిఖీకి వస్తా.. పద్ధతి మారకపోతే వేటు తప్పదని హెచ్చరిక సిద్దిపేట జోన్ : ‘కోట్లు వెచ్చించి సామాన్యులకు మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నాం. అయితే కొందరి వల్ల ఆస్పత్రికి చెడ్డ పేరు వ స్తోంది. ప్రసవం కోసం వచ్చే వారి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదులు వస్తున్నాయి. ఇటీవల నేను మంచి మాటతో చెప్పి వెళ్లా.. అయినా తీరు మారలేదు. ఇప్పుడు మరోసారి చెబుతున్నా. ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తే ఉపేక్షించను. పది రోజుల్లో మళ్లీ తనిఖీకి వస్తా.. డబ్బులు డిమాండ్ చేసినట్లుగా తేలితే అక్కడికక్కడే సస్పెండ్ చేయిస్తా’నని నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు సిద్దిపేట ఎంసీహెచ్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆయన, సిద్దిపేట మాతా శిశు సంక్షేమ కేంద్రం (ఎంసీహెచ్)ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రి ఆవరణ ఉన్న పలువురు రోగులను అడిగి వైద్య సేవలపై ఆరా తీశారు. ఆస్పత్రి సిబ్బంది ఎవరైనా డబ్బులివ్వాలని వేధిస్తున్నారా అని ఆస్పత్రికి వచ్చిన వారిని ఆరా తీశారు. దీంతో కొందరు ప్రసవం చేయించుకునే ందుకు వచ్చే వారిని డబ్బుకోసం సిబ్బంది తీవ్ర ఇబ్బంది పెడుతున్నారంటూ మంత్రికి ఫిర్యాదు చేశారు. దీంతో హరీష్‌రావు తీవ్రంగా స్పందించారు. అక్కడే ఉన్న స్టాఫ్ నర్సులను, వార్డుబాయ్‌లను ఉద్దేశించి మాట్లాడుతూ, సిద్దిపేట ఏరియా, మాతా శిశు సంక్షేమ ఆస్పత్రిలో ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసే సంస్కృతిని మానుకోవాలన్నారు. సర్కార్ వైద్యంపై నమ్మకంతో వచ్చే ప్రజలకు వైద్యులు, సిబ్బంది సేవా భావంతో పని చేయాలన్నారు. ఆస్పత్రిలోని వసూళ్ల దందాపై తనపై కొందరు ఫిర్యాదు చేశారని, దాన్ని కట్టడి చేసేందుకే ఫిర్యాదుల బాక్స్ ఏర్పాటు చేశానన్నారు. వారంరోజులకొకసారి సిద్దిపేట ఆర్డీఓ నేతృత్వంలో బాక్స్‌లోని ఫిర్యాదులపై నివేదిక రూపకల్పన జరుగుతుందన్నారు. అందులో ఎవరైనా తప్పు చేసినట్లుగా తేలితే.. ఉపేక్షించేది లేదని.. సస్పెండ్ చేసేందుకైనా వెనకాడబోమన్నారు. వైద్యుల ప్రమేయంపై కూడా ప్రత్యేక దృష్టి సారించామన్నారు. వైద్యులు కూడా దోషులుగా తేలితే ఇంక్రిమెంట్లలో కోత విధించడం ఖాయమన్నారు. ఆస్పత్రి అభివృద్ధికి సర్కార్ పెద్ద ఎత్తున నిధులు వెచ్చిస్తుంటే, ప్రజల నుంచి డబ్బులు వసూలు చేయడం సరైన పద్ధతి కాదన్నారు. మంత్రి హోదాలో తాను కఠిన నిర్ణయాలు తీసుకుంటే తర్వాత బాధపడాల్సి వస్తుందని, తాను యూనియన్ల నిరసనకు కూడా భయపడనని హెచ్చరించారు. పారదర్శకంగా వైద్య సేవలు అందించే లక్ష్యంతో ముందుకు సాగాలని హితవు పలికారు. ఆదివారం పిల్లలకు వైద్య సేవలు వద్దా..? సిద్దిపేట ఎంసీహెచ్, హైరిస్క్ కేంద్రాన్ని సందర్శించిన మంత్రి హరీష్‌రావు అక్కడే ఉన్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారి జగన్నాధ్రెడ్డితో పలు సమస్యలపై చర్చించారు. ఈ సమయంలోనే సిద్దిపేట ఎంసీహెచ్‌లో ప్రతి ఆదివారం పిల్లల వైద్యులకు సెలవు నిర్ణయిస్తూ ఆదేశాలు జారీ చేశారా అని ప్రశ్నించారు. దానికి అలాంటి ఏమి లేదని ఉన్నతాధికారి బదులివ్వగా, ఇటీవల ఆదివారం తాను ఆస్పత్రిలో తనిఖీలు నిర్వహించనప్పుడు పిల్లల వైద్యులు లేరని కొందరు ఫిర్యాదు చేశారన్నారు. ఇది మంచి పద్ధతి కాదని, ఆదివారం కూడా ఆస్పత్రిలో పిల్లల వైద్యులు ఉండాల్సిందేనని మంత్రి స్పష్టం చేశారు. అవసరమైతే మరో నలుగురు పిల్లల వైద్యులను సిద్దిపేట ఎంసీహెచ్‌కు కేటాయించాలని జగన్నాధ్రెడ్డికి సూచించారు. మంత్రి హరీష్‌రావు వెంట ఆర్డీఓ ముత్యంరెడ్డి, తహశీల్దార్ ఎన్వై గిరి, మంత్రి ఓఎస్డీ బాల్‌రాజు, మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు, నాయకులు చిన్న, మచ్చవేణుగోపాల్‌రెడ్డి, కాముని నగేష్, గుండు రవితేజ, వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
పీజీ మెడికల్ ప్రాక్టికల్స్‌లో ఆడియో రికార్డింగ్
విజయవాడ, న్యూస్‌లైన్: వచ్చే విద్యా సంవత్సరం నుంచి పీజీ(ఎండీ/ఎంఎస్) మెడికల్ కోర్సుల్లో నిర్వహించే ప్రాక్టికల్స్(ఓరల్) పరీక్షల్లో ఆడియో రికార్డింగ్ చేయాలని నిర్ణయించారు. ఈమేరకు ఉన్నతాధికారులకు సిఫార్సు చేయాలని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో శుక్రవారం నిర్వహించిన పీజీ మెడికల్, సూపర్‌స్పెషాలిటీ(డీఎం/ఎంసీహెచ్) బోర్డ్ ఆఫ్ స్టడీస్ సమావేశంలో నిర్ణయించారు. పీజీ మెడికల్ పరీక్షల ఫలితాల్లో గ్రేస్ మార్కులు ఇవ్వకుండా ప్రశ్న పత్రాలను పునర్నిర్మాణం చేయాలని నిర్ణయించారు. గతంలో 10 మార్కులు చొప్పున 10 ప్రశ్నలు ఉండేవి. అలా కాకుండా 15 మార్కుల చొప్పున 5 ప్రశ్నలు, 5 మార్కులు చొప్పున 5 ప్రశ్నలు మొత్తం 100 మార్కులకు పరీక్ష పత్రాలను ఇవ్వాలని ప్రతిపాదించారు. పీజీలో థీసిస్ సమర్పణకు చేయడానికి ఆరు నెలలు గడువుగా నిర్ణయించారు. పరిశోధనా అంశాన్ని మార్పు చేసుకోవాలనుకునేవారికి మరో ఆరు నెలలు గడువిస్తారు. ఒక్క సంవత్సరంలో మొత్తం పరిశోధన (డిజర్జటేషన్ మెయిన్ టాపిక్ ) అంశం ఆమోదం పొందాలి. అప్పటికీ నిర్దేశించిన సంవత్సర కాలంలోగా పరిశోధనాంశం ఆమోదం పొందకపోతే రూ.10వేల జరిమానా విధిస్తారు. నిర్దేశించిన కాలంలో పరీక్షలకు అనుమతించకుండా ఎంతకాలం ఆలస్యం చేస్తే.. అంత కాలం కోర్సును పొడిగిస్తారు. అలాగే సంబంధిత విద్యార్థి గైడ్‌ను కూడా సంవత్సరం పాటు బ్లాక్ లిస్టులో ఉంచుతారు. ప్రతి విద్యార్థి నాణ్యమైన వైద్య విద్యనభ్యసించేలా వైద్య విద్య ప్రొగ్రామ్స్ నిర్వహించడం, పాల్గొనడం, అలాగే ఎన్టీఆర్ హెల్ ్తయూనివర్సిటీ మెడ్‌నెట్ ద్వారా పంపే జర్నల్స్‌ను, అన్ని కళాశాలల్లో విద్యార్థులు, అధ్యాపకులు తప్పనిసరిగా వినియోగించుకొనేలా చర్యలకు సిఫార్సు చేయనున్నారు. సూపర్ స్పెషాలిటీ(డీఎం/ఎంసీహెచ్) కోర్సుల్లో సెమిస్టర్ విధానాన్ని ప్రవేశపెట్టి ఆరు మాసాలకొకసారి యూనివర్సిటీ పరీక్షలు నిర్వహిస్తుంది. తద్వారా ప్రొఫెసర్ల ఆధ్వర్యంలో లోటుపాట్లు సరిచేయాలని నిర్ణయించారు. విద్యార్థులకు లాగ్ బుక్ ఏర్పాటు చేయడం, డిజర్జటేషన్లో రెండు పేపర్లు ప్రచురితం కావడంతోపాటు 75 శాతం అటెండెన్స్ ఉంటేనే సంబంధిత విభాగాధిపతి ధ్రువీకరణతో హాల్‌టికెట్టు ఇవ్వాలని నిర్ణయించారు. హెల్త్ వర్సిటీ వీసీ డాక్టర్ ఐవీ రావు అధ్యక్షతన బోర్డ్ ఆఫ్ స్టడీస్‌లో ఆయా మెడికల్ కళాశాలల ప్రిన్సిపాల్స్ పాల్గొన్నారు.