ఎంసీహెచ్‌లో పసికందు మృతి
- ఆస్పత్రి ఎదుట బంధువుల ఆందోళన
- వైద్యుల నిర్లక్ష్యమే కారణమని బాధితుల ఆరోపణ
- తమ తప్పేమీ లేదని వైద్యుల వాదన
సిద్దిపేట జోన్: సిద్దిపేట మాతా శిశు సంక్షేమ కేంద్రంలో ఒక పసికందు సోమవారం మృతి చెందిన సంఘటన ఆందోళనకు దారితీసింది. వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ బంధువులు ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు. వైద్య చికిత్సలో ఎలాంటి జాప్యం జరగలేదని వైద్యులు వాదనకు దిగారు. మరోవైపు వైద్యులు, పోలీసుల వివరణతో అందోళన సద్దుమనిగింది. వివరాల్లోకి వెళ్తే .. రామాయంపేట మండలం దొంగల ధర్మారం గ్రామానికి చెందిన రాకేష్, శిల్పలకు యేడాది క్రితం వివాహమైంది. తొలి ప్రసవ నిమిత్తం శిల్ప బంధువులు ఆదివారం ఉదయం స్థానిక ఎంసీహెచ్ ఆస్పత్రికి తీసుకువచ్చారు. ప్రసవ వేదనతో వచ్చిన శిల్పను పరీక్షించిన వైద్యులు నార్మల్ డెలివరీ కోసం పరిశీలనలో ఉంచారు. ఒక దశలో ప్రసవం నొప్పులు అధికం కావడంతో బంధువులు ఆదివారం సాయంత్రం శస్త్ర చికిత్స చేయాలని వైద్యులను కోరినప్పటికీ నార్మల్ డెలవరీ కోసం సోమవారం వరకు ఎదురు చూశారు.
ఈ క్రమంలో సోమవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో గర్భంలోని పసికందు హార్ట్‌బీట్‌లో కొంత సమస్య ఉత్పన్నమైందని వైద్యులు శిశు సంరక్షణ కేంద్రానికి గర్భిణీ శిల్పను షిఫ్ట్ చేసి శస్త్ర చికిత్స నిర్వహించారు. అనంతరం పాప మృతదేహాన్ని బయటకు తీయాల్సి వచ్చిందని, హార్ట్‌బీట్ సమస్యతోనే పాప మృతి చెందిందని వైద్యం విషయంలో నిర్లక్ష్యం జరగలేదని హైరిస్క్ ఇన్‌చార్జి కాశీనాథ్, ఎంసీహెచ్ సూపరింటెండెంట్ రఘరాంరెడ్డిలు వివరణ ఇచ్చారు. పాప మృతి చెందిన విషయం తెలుసుకున్న బంధువులు ఆస్పత్రి ముందు బైఠాయించి ఆందోళన నిర్వహించారు. విషయం తెలుసుకున్న పోలీసులు, వైద్యులు, అక్కడికి చేరుకొని బంధువులకు వివరంగా విషయం తెలియజెప్పడంతో గొడవ సద్దుమనిగింది.
వైద్యుల నిర్లక్ష్యమే కారణం
సకాలంలో శస్త్ర చికి త్స చేసి ఉంటే పాప మరణించేది కాదని శిల్ప భర్త రాకేష్, బంధువులు ఆరోపించారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే పసికందు గర్భంలోనే మృతి చెందిందని వైద్యుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రసవం కోసం నొప్పులతో వచ్చిన తాము వెంటనే శస్త్ర చికిత్స చేయాలని ఆదివారం మధ్యాహ్నం నుంచి వైద్యులను కోరినప్పటికీ నిర్లక్ష్యం చేసి సోమవారం ఉదయం వరకు ఆలస్యం చే శారన్నారు. తీరా పరిస్థితి విషమించిదని సోమవారం శస్త్ర చికిత్స చేయడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు.