తన బిడ్డ కావాలని కోరుతున్న కన్నతల్లి
పశ్చిమ గోదావరి: మూడో కాన్పులో కూడా ఆడపిల్లే పుట్టడంతో ఏం చేయాలో తెలియక ఆడ శిశువును వేరొకరికి మధ్యవర్తి ద్వారా విక్రయించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. దీనికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.. ఏలూరు జిల్లా నూజివీడు మండలం ఓగిరాల తండాకు చెందిన వడిత్యా మూర్తి, వసుంధర దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. మూర్తి ప్రైవేటు ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. గతేడాది నవంబరులో వసుంధరకు మూడో కాన్పులో కూడా స్థానిక ఏరియా ఆసుపత్రిలో ఆడపిల్ల జన్మించింది.
మూడు రోజుల అనంతరం మధ్యవర్తి ద్వారా తణుకు సమీపంలోని దువ్వకు చెందిన పిల్లలు లేని దంపతులకు ఆడపిల్లను తండ్రి మూర్తి ఇచ్చేశాడు. ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చిన దగ్గర నుంచి తన కుమార్తె కోసం తల్లి వసుంధర మనోవ్యధకు గురై భర్తను మన కూతురును తీసుకురమ్మంటూ రోజూ అడుగుతోంది. ఈ క్రమంలో ఈ విషయం ఆనోటా ఈనోటా పడి చైల్డ్‌లైన్ వారి దృష్టికి చేరింది. దీంతో వారు ఐసీడీఎస్ అధికారులకు ఈ నెల 17న సమాచారమిచ్చి విచారించమని చెప్పగా, నూజివీడు సీడీపీఓ ఎస్‌వై నూరాణి విచారించి నివేదికను చైల్డ్‌లైన్ నిర్వాహకులకు ఈ నెల 18న పంపారు.
ఈ విషయంపై అదేరోజు రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. చైల్డ్‌లైన్ వారు ఏలూరులోని చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి తెలపగా, వారు శిశువుకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను, పెంచుకుంటున్న తల్లిదండ్రులను పిలిపించి విచారించారు. అనంతరం శిశువును నాలుగు రోజుల క్రితమే స్వాధీనం చేసుకొని శిశుగృహంలో ఉంచారు. పూర్తిస్థాయిలో విచారించిన తరువాత శిశువును ఎవరికి ఇవ్వాలి, లేదా ప్రభుత్వ సంరక్షణలో ఉంచాలా అనే విషయాన్ని నిర్ణయించనున్నారు. ఇటు పోలీసుల విచారణలో గాని, అటు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ నిర్వహించిన విచారణలో గాని తాము బిడ్డను విక్రయించలేదని, పిల్లలు లేరని పెంచుకుంటామంటే ఇచ్చామని చెబుతున్నారు.
అమ్మినవారిపైన, కొన్నవారిపైన చర్యలు తీసుకుంటాం
శిశువులను అమ్మడం, కొనడం చట్టప్రకారం నేరం. ఈ కేసును సమగ్రంగా విచారిస్తున్నాం. విచారణలో తేలిన అంశాలను బట్టి అమ్మినవారిపైన, కొన్నవారిపైన చర్యలు తీసుకుంటాం.
– ఈడే అశోక్‌కుమార్ గౌడ్, డీఎస్పీ, నూజివీడు
Comments
Please login to add a commentAdd a comment