పశ్చిమ గోదావరి: పెనుగొండ శివారు అడ్డపుంత బోదే వద్ద వివాహిత హత్యకు గురైంది. హత్యచేసి పంటబోదేలో పాడేసి హంతుకులు పరారయ్యారు. వివరాల్లోకి వెళితే మంగళవారం ఉదయం అడ్డపుంతలో గుత్తుల చిన సత్యనారాయణ కౌలు చేస్తున్న పంట బోదేలో ఓ మహిళ మృతదేహం ఉందని గమనించిన రైతులు పోలీసులకు సమాచారం అందించారు. 25 ఏళ్లు వయస్సు ఉంటుందని భావించిన మహిళ శవం బోర్లా పడి పంటబోదేలో తేలుతూ ఉండడంతో సంచలనంగా మారింది.
మహిళ వీపుపైనా, ఎడమ భుజంపైనా, చాతిపైన పదునైన ఆయుధంతో పొడిచిన గాయాలు ఉన్నాయి. సంఘటనా స్థలాన్ని డీఎస్పీ కె.రవిమనోహరచారి, సీఐ జీవీవీ నాగేశ్వరరావు, ఎస్సై ఎస్‌ఎన్‌వీవీ రమేష్ పరిశీలించి, వీఆర్వో ప్రసాద్ ఫిర్యాదు మేరకు గుర్తు తెలియని మహిళ మృతదేహంగా కేసు నమోదు చేశారు. ఎస్పీ యు.రవిప్రకాష్ హుటాహుటిన పెనుగొండ చేరుకుని సంఘటన ప్రాంతాన్ని సందర్శించి వివరాలు సేకరించారు.
అయితే సాయంత్రానికి మృతురాలు చివటం నందినిగా గుర్తించారు. పోలీసుల అదుపులో ఆమె భర్త చివటం రాంప్రసాద్ ఉన్నట్లుగా విశ్వసనీయ సమాచారం. దొంగరావిపాలెంకు చెందిన పితాని నందినిను చివటం రాంప్రసాద్ 2019లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. భార్యపై అనుమానంతోనే హత్య చేసి ఉండొచ్చు అని అనుమానిస్తున్నారు. వీరికి 18 నెలలు కుమారుడు సైతం ఉన్నాడు. చివటం రాంప్రసాద్ హత్య చేసి ఉండవచ్చని భావిస్తున్నారు. పోలీసులు కేసు విచారణ జరుపుతున్నామని, త్వరలోనే వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment