భర్త పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పలేదని.. భార్య బలవన్మరణం | - | Sakshi
Sakshi News home page

భర్త పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పలేదని.. భార్య బలవన్మరణం

Published Wed, Jan 3 2024 4:20 AM | Last Updated on Wed, Jan 3 2024 1:12 PM

- - Sakshi

నూజివీడు: భర్త తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పలేదనే మనస్తాపంతో ఓ మహిళ ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నూజివీడు మండలం రామన్నగూడేనికి చెందిన పామర్తి మన్మథరావు, పట్టణంలోని నెహ్రూపేటకు చెందిన ఉషా కిరణ్మయి 15 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు.

మన్మథరావు బస్టాండు దగ్గరలో లైవ్‌ ఫిష్‌ దుకాణం నడుపుకుంటున్నాడు. వీరి కుటుంబం ఏడు మెట్ల బావి సెంటర్‌లో అద్దె ఇంట్లో నివాసం ఉంటోంది. ఇదిలా ఉండగా, ఈ నెల ఒకటో తేదీన ఉషాకిరణ్మయి తన ఇద్దరు పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లి తిరిగి అదే రోజు రాత్రి 10.30 గంటలకు ఇంటికి వచ్చింది. రెండో తేదీన ఆమె పుట్టినరోజు కాగా అర్ధరాత్రి 12 గంటల సమయంలో తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పలేదంటూ భర్తను ప్రశ్నించింది. ఈ విషయమై వారిమధ్య వాదన పెరిగి తీవ్ర వాగ్వివాదానికి దారితీసింది. ఈ క్రమంలో ఉషా కిరణ్మయి కోపంతో పక్క గదిలోకి వెళ్లి లోపల గడియపెట్టి చున్నీతో ఫ్యాన్‌కు ఉరివేసుకుంది.

ఊహించని ఘటనతో ఆందోళనకు గురైన భర్త మన్మథరావు వెంటనే ఈ విషయాన్ని అత్తమామలకు ఫోన్‌ చేసి చెప్పాడు. వారు వచ్చి చూసేసరికి ఆమె చనిపోయి ఉంది. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందడంతో వారు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై మృతిరాలి తండ్రి ఫిర్యాదు మేరకు పట్టణ ఎస్‌ఐ–1 ఎస్‌.శంకర్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement