పాలకొల్లు సెంట్రల్: భర్త కొట్టడంతో మనస్తాపం చెందిన గర్భవతి అయిన రావూరి దేవి (23) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బంధువులు తెలిపిన వివరాలు ప్రకారం పాలకొల్లు మండలంలోని అరట్లకట్టకు చెందిన ఇళ్ల వెంకటేశ్వరరావు, లక్ష్మీ దంపతుల కుమార్తె దేవి బీఈడి చదివేందుకు తణుకు వెళ్లింది. అక్కడ రావూరి జనార్ధన్‌తో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. దేవి ఇంట్లో ఈ విషయం తెలియగా జనార్ధన్‌కు 2021లో ఆచంట గ్రామానికి చెందిన ఓ యువతితో వివాహమైందని.. భార్య వదిలేసి వెళ్లిపోయిందని తెలిసింది. రెండో పెళ్లి వాడు వద్దని తల్లిదండ్రులు ఎంత చెప్పినా దేవి వినిపించుకోలేదు.
ఇద్దరూ తణుకులో పెళ్లి చేసుకున్నారు. పోలీస్‌స్టేషన్‌లో దేవి తల్లిదండ్రులు కేసు పెట్టగా ఇద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చారు. దేవికి ఏ సమస్య వచ్చినా భర్తదే బాధ్యత అంటూ జనార్ధన్‌తో కాగితాలు రాయించుకున్నట్లు దేవి బందువులు తెలిపారు. గత ఎనిమిది నెలలుగా దేవి ఎంతో నరకం అనుభవించిందని ఆమె బంధువులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. దేవి పక్కింటి వారితో మాట్లాడినా, తల్లిదండ్రులతో మాట్లాడినా వేధించేవాడని వాపోతున్నారు. శుక్రవారం సాయంత్రం జనార్ధన్ దేవిని కొట్టి కేకలు వేసుకుంటూ ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు.
అనంతరం దేవి గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుంది. అత్తగారు ఎంత పిలిచినా పలకకపోవడంతో స్థానికులు తలుపు పగులగొట్టగా ఉరివేసుకుని ఉన్నట్లు గుర్తించారు. పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. విషయం తెలియడంతో దేవి బంధువులు ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. దేవి మెడ మీద, దవడపై దెబ్బలు ఉన్నాయని భర్తే కొట్టి చంపేశాడని ఆవేదన వ్యక్తంచేశారు. మార్చురీలో ఉన్న దేవి మృతదేహాన్ని తహసీల్దార్ వై.దుర్గాప్రసాద్, సీఐ కె. రజనీకుమార్‌లు పరిశీలించారు. మృతురాలి తండ్రి వెంకటేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ కె. రజనీకుమార్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment