అనాథలే లక్ష్యం.. అకృత్యాలే సర్వం | - | Sakshi
Sakshi News home page

అనాథలే లక్ష్యం.. అకృత్యాలే సర్వం

Published Sat, Sep 21 2024 12:48 AM | Last Updated on Sat, Sep 21 2024 1:50 PM

అనాథల

అనాథలే లక్ష్యం.. అకృత్యాలే సర్వం

వసతి మాటున వంచన

విలాసాలు పరిచయం చేస్తూ లొంగదీసుకునే ప్రయత్నం

ఏలూరు ఆశ్రమంలో లైంగిక వేధింపుల్లో మరో కోణం

ఆశ్రమంలో సీసీ టీవీ ఫుటేజ్‌ పరిశీలించి దర్యాప్తు చేశారా?

బాలికలతో పూర్తిగా మాట్లాడని ఏలూరు పోలీసులు

బాపట్లకు తీసుకెళ్లింది ఎంత మందిని ?

హాస్టల్‌ అనుమతులపై విచారణ ఏదీ ?

జిల్లాలో ఇలాంటి హాస్టళ్లు ఎన్ని ఉన్నాయో ?

సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఏలూరు అమీనాపేటలోని శ్రీ స్వామి దయానంద సరస్వతి ఆశ్రమం ఆధ్వర్యంలో నడుస్తున్న బాలికల వసతి గృహంలో మానవ మృగం రెచ్చిపోయింది. అభం శుభం తెలియని పసిమొగ్గలను తుంచివేస్తూ.. పైశాచికానందం పొందిన నిందితుడి అసలు రూపం బట్టబయలైంది. పేదరికంతో తల్లిదండ్రులు లేని వారు, తండ్రి లేని బాలికల చదువుకోవాలనే ఆశలపై నీళ్లు చల్లుతూ.. శశికుమార్‌ రూపంలో బయటకు వచ్చా డు మృగాడు. ఇప్పుడు బాలికల వసతి గృహం మూతపడటంతో ఇళ్లకు వెళ్లిన బాలికల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఓ వైపు నిందలు మోయాల్సిన దారుణమైన స్థితి, మరోవైపు తమకు జరిగిన అవమానాన్ని జీర్ణించుకోలేని దైన్యస్థితిలో బాలికలు తీవ్ర మనోవేదనతో ఉన్నారు. అయినా ఈ కేసులో పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేశారా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. శుక్రవారం నిందితుడిని, మరో ఇద్దరిని అరెస్టు చేసి ఒక బాలికే ఫిర్యాదు చేసిందని పోలీసులు ప్రకటించి వివాదానికి ముగింపు పలికేలా మాట్లాడారు.

విలాసాలకు అలవాటు చేస్తూ..
ఆశ్రమంలోని బాలికలను విలాసాలకు అలవాటు చేయటం అతని స్టైల్‌. ఫొటో షూట్‌ పేరుతో కాటు వేయటం అతనికి వెన్నతో పెట్టిన విద్య. ఇదే తరహాలో ఏలూరు నగరంలో 15 ఏళ్లుగా పలువురు అమాయక బాలికలను ఫొటోలు తీయటం నేర్పుతానంటూ మచ్చిక చేసుకుంటూ తన కామానికి బలి చేస్తూ వచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇదే తరహాలో అమీనాపేట స్వామి దయానంద సరస్వతి ఆశ్రమం ఆధ్వర్యంలో నడుస్తున్న బాలికల హాస్టల్‌ను తనకు అనువైన స్థలంగా మార్చుకున్నాడు. పక్కా స్కెచ్‌తో హాస్టల్‌లోకి తన భార్య ఫణిశ్రీ, మేనకోడలు లావణ్యలను చేర్పించాడు. గ్రామీణ ప్రాంతాల్లోని బాలికలకు విలాసంగా ఉండేలా అలవాటు చేస్తూ.. తల్లిదండ్రులు లేనివారు, తండ్రి లేని పిల్లలను టార్గెట్‌గా చేసుకుంటూ వారితో చనువుగా ఉండటం ప్రారంభించాడు. ఫొటో షూట్‌ పేరుతో బాపట్ల, ఇతర ప్రాంతాలకు తీసుకువెళ్లేవాడు. ఒప్పుకొంటే సరేసరి.. లేకుంటే కాళ్లూ చేతులూ కట్టేసి మరీ తన కామవాంఛ తీర్చు కుంటూ చిన్నారుల భవిష్యత్తును నాశనం చేశాడు.

పూర్తిస్థాయిలో విచారణపై అనుమానాలు
ఏలూరు స్వామి దయానంద సరస్వతి ఆశ్రమంలోని ఒక్క బాలికపైనే నిందితుడు శశికుమార్‌ అత్యాచారానికి పాల్పడినట్టు పోలీసులు చెబుతున్నారు. ఇంతకీ హాస్టల్‌లోని సీసీ టీవీ ఫుటేజ్‌ అయినా వారు పరిశీలించారా? అనేది సందేహంగా మారింది. ఒకపక్క బాలికా సంరక్షణ అధికారి రెండు పదుల సంఖ్యలో బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడినట్టు చెప్పారు. ముగ్గురు బాలికలు ఫిర్యాదు చేశారని ఏలూరు డీఎస్పీ శ్రావణ్‌కుమార్‌ మీడియాకు వెల్లడించారు. ఈ సంఘటన వెలుగులోకి వచ్చిన మరుసటి రోజే పిల్లలను వారి ఇళ్లకు పంపేశారు. ఈ నేపథ్యంలో బాలికల బాధలను పూర్తిస్థాయిలో పోలీసులు విచారణ చేశారా? లేదా అనేది సందేహంగా మారింది. బాలికలు మీడియాకు సైతం బాహా టంగా తమ బాధను చెప్పుకున్నా.. ఆ స్థాయిలో విచారణ జరగలేదనే అనుమానం పలువురి వ్యక్తమవుతోంది.

హాస్టల్‌కు అనుమతులు ఉన్నాయా?
ఏలూరులోని శ్రీస్వామి దయానంద సరస్వతి ఆశ్రమం ట్రస్టీ ద్వారా రాష్ట్రంలో 10 వరకు వసతి గృహాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఏలూరులోని బాలికల హాస్టల్‌ను 2018లో ప్రారంభించగా కరోనా స మయంలో రెండేళ్లపాటు నిలిపివేసినట్లు చెబుతున్నారు. ఏలూరులోని హాస్టల్‌కు అసలు అనుమతు లు లేకుండా ఏ విధంగా నిర్వహిస్తున్నారనేది తెలియాల్సి ఉంది. జిల్లాస్థాయి అధికారులు నిద్రపోతున్నారా అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హాస్టల్‌ నిర్వహణపై బాలల సంరక్షణ అధికారులకు కనీస సమాచారం కూడా లేకపోవటం గమనార్హం. కానీ వారిపై ఎలాంటి చర్యలూ లేకపోవటంపై విమర్శలు వస్తున్నాయి.

ఇలాంటి హాస్టళ్లు జిల్లాలో మరెన్నో..
ఏలూరులో జరిగిన ఘోరంపై జిల్లా ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. జిల్లా కేంద్రంలోని ఏలూరులోనే కనీసం పర్యవేక్షణ లేకపోతే ఇక జిల్లావ్యాప్తంగా అనుమతులు లేని హాస్టళ్లు ఎన్ని ఉన్నాయనేది సందేహంగా మారింది. చదువుకోవాలనే తపనతో హాస్టళ్లలో చేరుతున్న బాలికల జీవితాలను చిధ్రం చేసేలా శశికుమార్‌ లాంటి మానవ మృగాలు చిదిమేయటంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు పర్యవేక్షణ, నిఘా, తనిఖీలు లేకపోవటంతో ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. విచారణ సైతం తూతూమంత్రంగానే చేపట్టి ఒకరో ఇద్దరినో అరెస్టులు చేసేస్తే సమస్య పరిష్కారం కాదంటున్నారు.

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
అనాథలే లక్ష్యం.. అకృత్యాలే సర్వం 1
1/1

అనాథలే లక్ష్యం.. అకృత్యాలే సర్వం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement