ఘటనా స్థలంలో వివరాలు తెలుసుకుంటున్న ఎస్పీ రవిప్రకాష్ (ఫైల్)
సాక్షి, భీమవరం: భీమవరంలో పట్టపగలు జరిగిన రౌడీషీటర్ హత్యా ఘటనను ఎస్పీ యు.రవిప్రకాష్ సీరియస్‌గా తీసుకున్నట్లు తెలిసింది. టుటౌన్ పోలీసుస్టేషన్‌కు కూతవేటు దూరంలోనే ఘటన చోటు చేసుకోవడంతో ఘటనను ముందే పసిగట్టడంలో విఫలమైన టూటౌన్ పోలీసులపై చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది. భీమవరం జిల్లా కేంద్రంగా ఏర్పడిన నాటి నుంచి పోలీసులు నిఘా పెంచి పేకాట, గంజాయి విక్రయాలు వంటి వాటిపై ఉక్కుపాదం మోపారు. ఎస్పీ రవిప్రకాష్ నిత్యం పర్యవేక్షణలో పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉంటున్నప్పటికీ టుటౌన్ ప్రాంతంలో మసాజ్ సెంటర్ల పేరుతో అసాంఘిక కార్యకలాపాలు, పేకాట శిబిరాలు, గంజాయి అమ్మకాలు, కళాశాలల వద్ద విద్యార్థుల గొడవలు వంటివి సాగుతూనే ఉన్నాయి.
ఈ నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన పోలీసు సిబ్బంది ఉదాసీన వైఖరి కారణంగానే ఈ నెల 17న హత్యా ఘటన చోటుచేసుకుందనే ప్రచారం సాగుతోంది. గత ఏడాది పట్టణానికి చెందిన రౌతుల ఏసు హత్య కేసులో నిందితుడైన పట్టణంలోని బలుసుమూడి గాంభీర్‌దొడ్డికి చెందిన బెవర విజయబాబు (23) హత్యకు గురయ్యాడు. ఆదివారం టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో రౌడీషీటర్లకు కౌన్సెలింగ్‌కు విజయబాబు, అతని సోదరుడు గోవిందరావు హాజరయ్యారు. ఈ సమయంలోనే వీరిని హత్య చేయాలనే పథకంతో హంతకులు స్టేషన్ బయట కాపుకాచి ఉన్నట్లు తెలుస్తోంది.
విజయబాబు ఎప్పుడు బయటకు వస్తాడోనని కారు, మోటారు సైకిళ్లపై ఉన్న నిందితులను పోలీసులు పసిగట్టలేకపోయారు. కౌన్సెలింగ్ అనంతరం విజయబాబు సోదరుడు గోవిందరావుతో కలసి మోటారు సైకిల్‌పై వెళుతుండగా వెంబడించిన దుండగులు స్టేషన్‌కు కూతవేటు దూరంలోనే కారుతో ఢీకొట్టి వారు కిందపడిపోగానే కత్తులతో దాడి చేసి హత్యచేశారు. గోవిందరావు ఆపదను గ్రహించి వెంటనే పక్కనే ఉన్న పంటకాలువలోకి దూకి స్టేషన్‌కు చేరడంతో బతికి బయటపడ్డట్లు చెబుతున్నారు.
అప్పటికే తేరుకున్న ఎస్సై అప్పారావు, ఇతర సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ఒకరిని అదుపులోనికి తీసుకున్నా మిగిలినవారు పరారయ్యారు. ఎస్పీ రవిప్రకాష్ దీనిని తీవ్రంగా పరిగణించి సిబ్బందిపై వేటువేయడానికి రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది. అయితే సిబ్బందిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారోననే చర్చ పోలీసు వర్గాల్లో జోరుగా సాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment