ఎంసీహెచ్ భవనానికి శంకుస్థాపన చేస్తున్న సీఎం చంద్రబాబు (ఫైల్)
తల్లడిల్లుతున్న తల్లులు
Published Sun, Oct 2 2016 7:47 PM | Last Updated on Mon, Sep 4 2017 3:55 PM
* గుంటూరు జీజీహెచ్‌లో ఇదీ పరిస్థితి
* ఎంసీహెచ్‌కు సీఎం శంకుస్థాపన రాయి వేసి ఏడాది
* పునాదులు కూడా తీయని వైనం
* అష్టకష్టాలు పడుతున్న బాలింతలు
‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే..’ చందాన ఉంది గుంటూరు జీజీహెచ్‌లోని ఎంసీహెచ్ వార్డు పరిస్థితి. సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాతా, శిశు ఆరోగ్య సంరక్షణ వార్డు (ఎంసీహెచ్) నిర్మాణానికి శిలాఫలకం వేసి ఆదివారంతో ఏడాది పూర్తయింది. సంవత్సరంలోగా భవన నిర్మాణం పూర్తిచేసి మెరుగైన వైద్యసేవలను అందించాలని ఆరోజు ముఖ్యమంత్రి వైద్యాధికారులు, ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. అయినా నేటికి పునాదులు కూడా తీయలేదు.
గుంటూరు మెడికల్: గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రికి వచ్చే గర్భిణీలు, చిన్నారులకు సరిపడా పడకలు లేక ప్రతిరోజూ వారు పడుతున్న కష్టాలు నిత్యం కనిపిస్తూనే ఉన్నాయి. వారి కష్టాలను తీర్చి సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వం ఎంసీహెచ్ వార్డు నిర్మాణం కోసం రూ. 20 కోట్లు 2014లో విడుదల చేసింది.
తల్లి, బిడ్డకు స్పెషాలిటీ వైద్యసేవలు..
జీజీహెచ్‌లో గర్భిణీలు, చిన్నారులు వైద్యం పొందేందుకు సరిపడా మంచాలు లేకపోవడంతో ఒకే పడకపై ఇద్దరు లేదా ముగ్గురు వైద్యం పొందాల్సిన దుస్థితి ప్రస్తుతం నెలకొంది. సాధారణ కాన్పు, ఆపరేషన్ అనంతరం పడకలు లేక కొన్నిసార్లు కటిక నేలపైనే బాలింతలు ఉండాల్సి వస్తోంది. చిన్నపిల్లలది కూడా అదే పరిస్థితి. ఈ దీనావస్థపై ‘సాక్షి’లో కథనాలు కూడా ప్రచురితమయ్యాయి. ఎట్టకేలకు ప్రభుత్వం స్పందించి 200 పడకలతో తల్లి, బిడ్డలకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రత్యేక వార్డు నిర్మించేందుకు నిధులను విడుదల చేస్తూ జీవో విడుదల చేసింది. ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్న కుటుంబ నియంత్రణ విభాగం, గైనకాలజీ వైద్య విభాగం తొలగించి ఆ ప్రదేశంలో ఎంసీహెచ్ వార్డు నిర్మించాలని నిర్ణయించారు. పోస్టు ఆపరేటివ్ వార్డు, ప్రీ ఆపరేటివ్ వార్డు, ఆపరేషన్ థియేటర్, ఎన్‌ఐసీయూ, ల్యాబ్, డిస్పెన్సరీ, డెలివరీ సూట్స్, తల్లులు వేచి ఉండే గది అన్నీ కూడా ఒకే భవనంలో నిర్మాణం పూర్తయితే అందుబాటులోకి వస్తాయి. ఒకేచోట అన్ని వైద్యసౌకర్యాలు ఉండడం ద్వారా తల్లికి, బిడ్డకు మెరుగైన వైద్యసేవలు అందుతాయి.
భవన తొలగింపునకే ఏడాది..
ఆస్పత్రిలో ఎంసీహెచ్ వార్డును నిర్మించేందుకు ప్రస్తుతం ఉన్న పాత భవనాలను తొలగించేందుకు ఆస్పత్రి అధికారులు, ఇంజినీరింగ్ అధికారులకు ఏడాది సమయం పట్టింది. నిధులు విడుదల చేసి మూడేళ్లవుతున్నా సంబంధిత అధికారులు సకాలంలో భవన నిర్మాణం చేసేందుకు ఎందుకు శ్రద్ధ చూపించడం లేదో అర్ధంకావడం లేదు. మరోవైపు రెండేళ్లుగా ఆస్పత్రికి కాన్పుల కోసం వస్తున్నవారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. నెలకు వెయ్యి వరకు డెలివరీలు జరుగుతుండడంతో ఒక్కో పడకపై ఇద్దరు లేదా ముగ్గురు బాలింతలను ఉంచుతున్నారు. ఒకవైపు ఆపరేషన్ కాన్పు నొప్పులు, మరోవైపు కనీసం మంచం కూడా సరిపడక అవస్థలు పడుతున్నారు. సంబంధిత అధికారులు ఇప్పటికైనా స్పందించి సకాలంలో ఎంసీహెచ్ వార్డు భవన నిర్మాణం పూర్తయ్యేలా చూడాలని పలువురు కోరుతున్నారు.
Advertisement
Advertisement