దందా చేస్తే.. దండనే
►సిద్దిపేట ఎంసీహెచ్‌లో హరీష్ ఆకస్మిక తనిఖీ
►సిబ్బంది మామూళ్ల వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం
►పనితీరు మార్చుకోవాలని హితవు
►త్వరలో తనిఖీకి వస్తా..
పద్ధతి మారకపోతే వేటు తప్పదని హెచ్చరిక
సిద్దిపేట జోన్ : ‘కోట్లు వెచ్చించి సామాన్యులకు మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నాం. అయితే కొందరి వల్ల ఆస్పత్రికి చెడ్డ పేరు వ స్తోంది. ప్రసవం కోసం వచ్చే వారి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదులు వస్తున్నాయి. ఇటీవల నేను మంచి మాటతో చెప్పి వెళ్లా.. అయినా తీరు మారలేదు. ఇప్పుడు మరోసారి చెబుతున్నా. ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తే ఉపేక్షించను. పది రోజుల్లో మళ్లీ తనిఖీకి వస్తా.. డబ్బులు డిమాండ్ చేసినట్లుగా తేలితే అక్కడికక్కడే సస్పెండ్ చేయిస్తా’నని నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు సిద్దిపేట ఎంసీహెచ్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
గురువారం ఆయన, సిద్దిపేట మాతా శిశు సంక్షేమ కేంద్రం (ఎంసీహెచ్)ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రి ఆవరణ ఉన్న పలువురు రోగులను అడిగి వైద్య సేవలపై ఆరా తీశారు. ఆస్పత్రి సిబ్బంది ఎవరైనా డబ్బులివ్వాలని వేధిస్తున్నారా అని ఆస్పత్రికి వచ్చిన వారిని ఆరా తీశారు. దీంతో కొందరు ప్రసవం చేయించుకునే ందుకు వచ్చే వారిని డబ్బుకోసం సిబ్బంది తీవ్ర ఇబ్బంది పెడుతున్నారంటూ మంత్రికి ఫిర్యాదు చేశారు.
దీంతో హరీష్‌రావు తీవ్రంగా స్పందించారు. అక్కడే ఉన్న స్టాఫ్ నర్సులను, వార్డుబాయ్‌లను ఉద్దేశించి మాట్లాడుతూ, సిద్దిపేట ఏరియా, మాతా శిశు సంక్షేమ ఆస్పత్రిలో ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసే సంస్కృతిని మానుకోవాలన్నారు. సర్కార్ వైద్యంపై నమ్మకంతో వచ్చే ప్రజలకు వైద్యులు, సిబ్బంది సేవా భావంతో పని చేయాలన్నారు. ఆస్పత్రిలోని వసూళ్ల దందాపై తనపై కొందరు ఫిర్యాదు చేశారని, దాన్ని కట్టడి చేసేందుకే ఫిర్యాదుల బాక్స్ ఏర్పాటు చేశానన్నారు. వారంరోజులకొకసారి సిద్దిపేట ఆర్డీఓ నేతృత్వంలో బాక్స్‌లోని ఫిర్యాదులపై నివేదిక రూపకల్పన జరుగుతుందన్నారు.
అందులో ఎవరైనా తప్పు చేసినట్లుగా తేలితే.. ఉపేక్షించేది లేదని.. సస్పెండ్ చేసేందుకైనా వెనకాడబోమన్నారు. వైద్యుల ప్రమేయంపై కూడా ప్రత్యేక దృష్టి సారించామన్నారు. వైద్యులు కూడా దోషులుగా తేలితే ఇంక్రిమెంట్లలో కోత విధించడం ఖాయమన్నారు. ఆస్పత్రి అభివృద్ధికి సర్కార్ పెద్ద ఎత్తున నిధులు వెచ్చిస్తుంటే, ప్రజల నుంచి డబ్బులు వసూలు చేయడం సరైన పద్ధతి కాదన్నారు. మంత్రి హోదాలో తాను కఠిన నిర్ణయాలు తీసుకుంటే తర్వాత బాధపడాల్సి వస్తుందని, తాను యూనియన్‌ల నిరసనకు కూడా భయపడనని హెచ్చరించారు. పారదర్శకంగా వైద్య సేవలు అందించే లక్ష్యంతో ముందుకు సాగాలని హితవు పలికారు.
ఆదివారం పిల్లలకు వైద్య సేవలు వద్దా..?
సిద్దిపేట ఎంసీహెచ్, హైరిస్క్ కేంద్రాన్ని సందర్శించిన మంత్రి హరీష్‌రావు అక్కడే ఉన్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారి జగన్నాధ్‌రెడ్డితో పలు సమస్యలపై చర్చించారు. ఈ సమయంలోనే సిద్దిపేట ఎంసీహెచ్‌లో ప్రతి ఆదివారం పిల్లల వైద్యులకు సెలవు నిర్ణయిస్తూ ఆదేశాలు జారీ చేశారా అని ప్రశ్నించారు. దానికి అలాంటి ఏమి లేదని ఉన్నతాధికారి బదులివ్వగా, ఇటీవల ఆదివారం తాను ఆస్పత్రిలో తనిఖీలు నిర్వహించనప్పుడు పిల్లల వైద్యులు లేరని కొందరు ఫిర్యాదు చేశారన్నారు. ఇది మంచి పద్ధతి కాదని, ఆదివారం కూడా ఆస్పత్రిలో పిల్లల వైద్యులు ఉండాల్సిందేనని మంత్రి స్పష్టం చేశారు.
అవసరమైతే మరో నలుగురు పిల్లల వైద్యులను సిద్దిపేట ఎంసీహెచ్‌కు కేటాయించాలని జగన్నాధ్‌రెడ్డికి సూచించారు. మంత్రి హరీష్‌రావు వెంట ఆర్డీఓ ముత్యంరెడ్డి, తహశీల్దార్ ఎన్‌వై గిరి, మంత్రి ఓఎస్‌డీ బాల్‌రాజు, మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు, నాయకులు చిన్న, మచ్చవేణుగోపాల్‌రెడ్డి, కాముని నగేష్, గుండు రవితేజ, వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.