మంచిర్యాలటౌన్: స్థానిక నడిపెల్లి ఎమ్మెల్యే దివాకర్‌రావు కమీషన్లకు కక్కుర్తిపడి మాతా శిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్)ను గోదావరి ఒడ్డున వరద నీటిలో మునిగే చోట నిర్మించారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. హాథ్‌సే హాథ్ జోడో యాత్ర కొనసాగింపులో భాగంగా చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర 31వ రోజు ఆదివారం మంచిర్యాల పట్టణంలో నిర్వహించారు.
మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు, డీసీసీ అధ్యక్షురాలు సురేఖ నివాసం నుంచి ప్రారంభమై ఐబీ చౌరస్తాలో ప్రభుత్వ ఆస్పత్రికి ఎదురుగా ఉన్న ఐబీ ఆవరణలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులను పరిశీలించి మాట్లాడారు. మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ఐబీ ఆవరణలో నిర్మించి ఉంటే ప్రభుత్వ ఆసుపత్రికి సమీపంలో ఉండి, ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావు ఎన్నిసార్లు చెప్పినా స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వం పెడచెవిన పెట్టిందన్నారు.
గోదావరి ఒడ్డున నిర్మించడం వల్ల ప్రజలకు దూరభారం కావడంతోపాటు, ప్రభుత్వాసుపత్రికి దూరంగా ఉంటుందని, గోదావరికి వరదలు వస్తే మునిగి పోయే ప్రమాదం ఉందని చెప్పినా వినలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. కమీషన్ల కోసమే ఎంసీహెచ్‌ను గోదావరిలో ముంచారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల జిల్లాలో పంటలతోపాటు ఎంసీహెచ్ కూడా మునిగిందన్నారు. నిధులు ఖర్చు చేయాల్సింది ప్రజల సంక్షేమం కోసమే కానీ, ఎమ్మెల్యేల కమీషన్ల కోసం కాదని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలకు విద్య, వైద్యం కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment