సాక్షి, హైదరాబాద్: పల్లె, పట్టణ ప్రగతి పథకాల పేరుతో ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడమే తప్ప, వాటికి నిధులే ఇ వ్వడం లేదని కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. చేసిన పనులకు బిల్లులు ఇవ్వకపోవడంతో గ్రామ సర్పంచ్‌లు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి ఉందని, దీనికి ప్రభుత్వం జవాబు చెప్పాలన్నారు.
పల్లె, పట్టణ ప్రగతిపై శాసనసభలో శనివారం జరిగిన స్వల్ప వ్యవధి చర్చలో భట్టి ప్రభుత్వ వైఖరిని తూర్పారబట్టారు. ట్రాక్టర్లకు ఈఎంఐలు కట్టలేక, డీజిల్ సమకూర్చుకోలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఏకగ్రీవ పంచాయతీలకు ఇస్తానన్న నిధులూ ఇవ్వలేదన్నారు. రాజధానికి గ్రామీణుల వలసలు పెరిగినా, హైదరాబాద్‌లో మౌలిక వసతులు మెరుగుపర్చలేదని విమర్శించారు.
హైదరాబాద్ అభివృద్ధి కాంగ్రెస్ చలవే: రాజధానిలో ఈ మాత్రం అభివృద్ధి జరిగిందంటే అది కాంగ్రెస్ హయాంలోనే అని భట్టి స్పష్టం చేశారు. అందువల్లే హై దరాబాద్‌లో భూములు రేట్లు పెరిగాయన్నారు. ప్రజల కో సం కాంగ్రెస్ ప్రభుత్వాలు నిర్మించిన ఔటర్ రింగ్ రోడ్డును ఓ ప్రైవేటు కంపెనీకి 30 ఏళ్ళకు కట్టబెట్టడం దారుణమని నిందించారు. ఐఆర్‌బీ ఇన్‌ఫ్రాకు రింగు రోడ్డు ధారాదత్తం చే యడంపై పూర్తి వివరాలు సభ ముందుంచాలని భట్టి డి మాండ్ చేశారు. చెరువులు, నీటి కుంటల్లో క్రీడా ప్రాంగణాలు అంటూ బోర్డులు పెట్టడం ప్రజలను మోసం చేయడమేనన్నారు.
భట్టి క్షమాపణ చెప్పాలి: బీఆర్‌ఎస్ డిమాండ్
భట్టి ప్రసంగానికి మంత్రులు అడుగడుగునా అడ్డుపడ్డారు. అనారోగ్యంతో ఇల్లంతలకుంట సర్పంచ్ చనిపోతే, రాజకీయం చేస్తున్నారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకృష్ణ అభ్యంతరం చెప్పారు. సభను తప్పుదోవ పట్టించినందుకు భట్టి క్షమాపణ చెప్పాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
పాదయాత్రతో అలసిపోయి అసత్యాలు మాట్లాడుతున్నాడని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పంచాయతీలకు పదేళ్ళలో రూ. 4వేల కోట్లు ఇస్తే, తాము 9 ఏళ్ళలోనే రూ.31 వేల కోట్లు ఇచ్చామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు. హైదరాబాద్ అభివృద్ధిపై భట్టి అబద్ధాలు చెబుతున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆక్షేపించారు. ఈ చర్చలో ఎమ్మెల్యేలు వివేకానంద, ఆలె వెంకటేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment