సాక్షి, హైదరాబాద్: తొమ్మిదేళ్ల రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడమే ఎజెండాగా కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ సమావేశాలకు సిద్ధమవుతోంది. నీళ్లు, నిధులు, నియామకాల ప్రాతిపదికన ఏర్పడిన రాష్ట్రంలో ఉద్యమసాధన ఆకాంక్షలు నెరవేరని తీరును ఎండగట్టాలని అనుకుంటోంది. రాష్ట్రంలో ఇటీవల సంభవించిన భారీ వర్షాల కారణంగా జరిగిన నష్టాన్ని సభ దృష్టికి తేవడం ద్వారా వరద బాధితులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ప్రజలకు వివరించేలా అసెంబ్లీలో గళమెత్తాలని నిర్ణయించింది.
దీంతో పాటు సీఎల్పినేత మల్లు భట్టి విక్రమార్క ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు నిర్వహించిన పీపుల్స్‌మార్చ్ పాదయాత్ర అనుభవాలు, ప్రజలు ఏకరువు పెట్టిన సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించడం ద్వారా వాటి పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని భావిస్తోంది. రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణం అశాస్త్రీయంగా జరుగుతోందని, ముఖ్యంగా మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టులు, చెరువుల నిర్వహణలో ప్రభుత్వం చూపిన నిర్లక్ష్యం కారణంగానే తాజా వరదనష్టం జరిగిందని, ప్రాణ, ఆస్తి, పంట నష్టాలకు ప్రభుత్వ ఎత్తుగడల లోపమే కారణమనే అంశాలను ఫోకస్ చేయాలని నిర్ణయించింది.
కాగా, ఈ అసెంబ్లీ సమావేశాలు కనీసం 15 రోజుల పాటు నిర్వహించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని భావిస్తోంది. ఈ సమావేశాల్లో లేవనెత్తాల్సిన అంశాలపై చర్చించేందుకుగాను గురువారం కాంగ్రెస్ శాసనసభాపక్షం సమావేశం కానుంది. ఇక, ఈ అసెంబ్లీ గడువు తీరేలోపు ఇవే చివరి సమావేశాలనే చర్చ జరుగుతోంది. 2018 జరిగిన ఎన్నికల్లో గెలిచిన 19 మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీలోకి అడుగుపెట్టిన కాంగ్రెస్‌పార్టీ చివరి సమావేశాల నాటికి తన ప్రాతినిధ్యాన్ని కోల్పోయి ఐదుగురికి మాత్రమే పరిమితం కావడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment