పురిటి నొప్పులు పంటి బిగువున దిగమింగుకుని పుట్టిన శిశువును తనివితీరా ముద్దాడాలన్నదే మాతృమూర్తి ఆకాంక్ష. అయితే జిల్లాలో గర్భిణులకు ఆ కోరిక తీరడం లేదు. ఎంసీహెచ్ కార్డుల లేమి.. అందని నిధులు, వైద్యం, పౌష్టికాహారం వెరసి తల్లీబిడ్డలకు సంరక్షణ కరువైంది. ఫలితం మాతృవేదన.. శిశు రోదన తప్పడం లేదు.
సాక్షి, తిరుపతి: తల్లీబిడ్డలకు సంరక్షణ కరువైంది. గ్రామీణ ప్రాంతాల్లోని మా తా శిశుసంరక్షణ కోసం కేటాయించే నిధులు వారికి అందడం లేదు. దీంతో గర్భి ణులు, బాలింతలు ఇక్కట్లు పడుతున్నా రు. జిల్లాలో ప్రతి వెయ్యి మంది కి ఒకరు గర్భిణులు ఉన్నారు. వీరికి ప్రభుత్వం ఎంసీహెచ్ కార్డు సరఫరా చేయకపోవడంతో గర్భిణులకు అందా ల్సిన నిధులు, పౌష్టికాహారం ఆగిపోయింది. జిల్లాలో 102 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 644 ఉప కేంద్రాలున్నాయి. కార్పొరేషన్, మున్సిపాలిటీ పరిధిలో మరో 10 కేంద్రాలున్నాయి. ప్రతి ఉపకేంద్రం పరిధిలో 10 నుంచి 15 మంది వరకు గర్భిణులు ఉన్నారు. ఈ లెక్కన జిల్లా వ్యాప్తంగా సుమారు 6,540 మందికిపైగా గర్భిణులు ఉన్నారు.
తప్పని తిప్పలు
గ్రామాల్లోని గర్భిణులను గుర్తించిన అనంతరం వారికి మాతా శిశు సంరక్షణ (ఎంసీహెచ్) కార్డులు తప్పనిసరిగా ఇవ్వాలి. ఈ కార్డును పరీక్షల కోసం ఆస్పత్రికి వెళ్లిన సమయంలో చూపిం చాల్సి ఉంది. అయితే జిల్లాలో ఏడాదిగా ఎంసీహెచ్ కార్డుల పంపిణీ చేయటం లేదు. ఈ విషయమై ఏఎన్‌ఎంలు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం కనిపించటం లేదు. ఆస్పత్రికి వచ్చే గర్భిణులకు ఆన్‌లైన్‌లో ఉన్న ఎంసీహెచ్ కార్డులను జిరాక్స్ చేసి, వారి పేరు నమోదు చేసి ఇవ్వమని ఉచిత సలహా ఇస్తున్నారు.
అందని వందనం పథకం నిధులు
గ్రామీణ ప్రాంతాల్లోని గర్బిణుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి వందనం పథకం ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా ప్రతి ఒక్కరికి రూ.6 వేలు డిపాజిట్ చేస్తుంది. అయితే జిల్లాలో ఎంసీహెచ్ కార్డుల కొరత ఉండడంతో ప్రధానమంత్రి వందన పథకం ద్వారా మంజూరయ్యే నిధులు గర్భిణులకు అందడం లేదని పీహెచ్‌సీ వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే కార్డులు లేక అంగన్‌వాడీ కేంద్రాల నుంచి పౌష్టికాహారం కూడా తీసుకోలేని పరిస్థితి నెలకొంది.
అభివృద్ధి నిధులు వెనక్కేనా?
జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నిర్వహణకు ప్రభుత్వం కేటాయించిన నిధులను అధికారులు ఖర్చు చేయలేదు. 2017–18 ఆర్థిక సంవత్సరానికి గాను జిల్లాకు రూ.5.46 కోట్లు మంజూరు చేశారు. ఇందులో కేవలం రూ.46 లక్షలు మాత్రమే ఖర్చు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. మిగిలిన రూ.5 కోట్లు ఈనెల 31లోపు ఖర్చుచేయకపోతే వెనక్కి వెళ్లే అవకాశం ఉందని ఖజనా శాఖ అధికారులు హెచ్చరించారు.
ఆగని మాతా శిశు మరణాలు
మహిళ గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవం వరకు అన్ని వివరాలను ఎంసీహెచ్ కార్డులో నమోదు చేయాల్సి ఉంది. ఈ కార్డులు లేకపోవడంతో గర్భిణులు, బాలింతలకు ప్రధానమంత్రి మాతృత్వ వందనం పథకం నిధులు అందడం లేదు. అలాగే వారు పౌష్టికాహారం తీసుకోలేని పరిస్థితి నెలకొంది. తల్లీబిడ్డలకు వైద్యం కరువైంది. ఫలితంగా మాతా శిశుమరణాలు ఆగడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment