ఆందోళన చేస్తున్న మృతురాలి కుటుంబ సభ్యులు(ఇన్‌సెట్) మృతురాలు కవిత
చిత్తూరు అర్బన్: చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో సరైన సమయంలో వైద్యం అందక బుధవారం బాలింత మృతిచెందింది. ఇక్కడ పనిచేసే డాక్టర్లే తమ బిడ్డను చంపేశారంటూ మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు. దీనిపై కలెక్టర్ సీరియస్ అయ్యారు. ఆస్పత్రిలో వరుస మరణాలపై డీసీహెచ్‌ఎస్ సరళమ్మపై మండిపడ్డారు.
సత్యవేడు మండలం పెద్దపాండూరుకు చెందిన రమణయ్య, సుశీలమ్మ కుమార్తె కవితను చిత్తూరు నగరంలోని ఇరువారం హరిజనవాడకు చెందిన ప్రభుకు ఇచ్చి గతేడాది మార్చిలో వివాహం చేశారు. కవిత గర్భం దాల్చడంలో ప్రతి నెలా చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకుంటోంది. సోమవారం పురిటి నొప్పులు రావడంతో ఆస్పత్రిలో అడ్మిట్ అయింది. వైద్యులు మంగళవారం మధ్యాహ్నం సిజేరియన్ చేసి ఆడబిడ్డకు పురుడుపోశారు. బుధవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో కవిత కడుపు ఉబ్బిపోయింది. ఆస్పత్రిలో వైద్యులు లేరు. దీంతో కవిత అక్క ఝాన్సీరాణి వైద్యులకు ఫోన్ చేసి విషయం తెలిపింది. తెల్లవారుజామున 4 గంటలకు వైద్యులు వచ్చి కవితను పరీక్షించి కిడ్నీ పనితీరుపై రక్తపరీక్ష చేయాలని కేస్ షీట్‌లో రాసి వెళ్లిపోయారు.
ఉదయం ఆరు గంటలకు మళ్లీ కవిత కడుపు ఉబ్బింది. ల్యాబ్ టెక్నీషియన్ లేరని, ప్రైవేట్ ల్యాబ్‌కు వెళ్లి పరీక్షలు చేయించుకుని రావాలని నర్సు రక్తనమూనాలు తీసి కవిత అక్కకు చెప్పారు. ఆమె నడుచుకుంటూ గాంధీ రోడ్డులోని ప్రైవేటు ల్యాబ్‌కు వెళ్లింది. వారు గంట తర్వాత ఇచ్చిన రిపోర్టును తీసుకుని వైద్యులకు అందచేసింది. అప్పటికే కవిత కడుపు మళ్లీ ఉబ్బడంతో 9 గంటల ప్రాంతంలో శస్త్ర చికిత్స చేశారు. ఆమెకు కడుపులో రక్తం లేకపోవడం, కాలేయం నుంచి వచ్చిన ద్రవం పూర్తిగా నిండి ఉండడాన్ని గుర్తించిన వైద్యులు ఆందోళనకు గురయ్యారు. పైగా శస్త్ర చికిత్స తరువాత మూత్ర విసర్జన కాలేదు. ఛాతీ నొప్పిగా ఉందని కవిత చెబుతూ స్పృహ కోల్పోయింది. వైద్యులు పరిశీలిస్తుండగా ఆమె చనిపోయింది.
మృతురాలి బంధువుల ఆందోళన
కవిత మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని పేర్కొంటూ బంధువులు ధర్నాకు దిగారు. రక్తనమూనాలను సహాయకుల వద్ద ఇచ్చి బయట పంపించడం, రెండోమారు ఆపరేషన్ గురించి తమకు చెప్పకపోవడం, సీఎంసీకి వెళతామని చెప్పినా డిశ్చార్జ్ చేయకపోవడం ఇక్కడి వైద్యుల పనితీరుకు నిదర్శమని కన్నీరుమున్నీరయ్యారు. ఇంత పెద్ద ఆస్పత్రిలో రాత్రిళ్లు వైద్యులు లేకపోవడం ఏమిటని ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం 9.30 గంటల ప్రాంతంలో తమ బిడ్డ చనిపోతే మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా చెప్పలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కలెక్టర్ ఆగ్రహం
ఆస్పత్రిలో జరిగిన ఘటనపై కలెక్టర్ ప్రద్యుమ్న ఆగ్రహం వ్యక్తం చేశారు. డీసీహెచ్‌ఎస్ సరళమ్మను ఫోన్‌లో మందలించారు. ఆస్పత్రిలో వరుస మరణాలపై మండిపడ్డారు. బాధ్యులైన వైద్యులపై చర్యలకు సిఫార్సు చేయాలని ఆదేశించారు. రాత్రి విధులు చేయలేమని అపోలో వైద్యులు చెప్పడంతో ఇక్కడ డ్యూటీలు ఎవరూ చేయడం లేదని, అవుట్ సోర్సింగ్ లాబ్ టెక్నీషియన్ మురళి నిర్లక్ష్యం కనిపిస్తుండటంతో అతన్ని విధుల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు సరళమ్మ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment