మృతదేహం వద్ద రోదిస్తున్న బంధువులు (ఇన్‌సెట్‌లో) మృతురాలు రిజ్వానా
లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రభుత్వాస్పత్రిలో బాలింత మృతి వివాదాస్పదంగా మారింది. పండంటి కవల పిల్లలకు జన్మనిచ్చిన ఆ తల్లి గంటల వ్యవధిలోనే మృతి చెందడం బంధువులను కలచివేసింది. వైద్యుల సరిగ్గా పట్టించుకోకపోవడం వల్లే ఇలా జరిగిందని ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. కాగా ప్రీ ఎట్వాన్సియా అనే సమస్యతో హైరిస్క్ కండీషన్‌లో తమ వద్దకు వచ్చినట్లు వైద్యులు తెలిపారు. దీంతో సాయంత్రం 5 గంటల సమయంలో బాలింత మృతి చెందగా, అర్ధరాత్రి వరకూ ఆందోళన కొనసాగింది.
వివరాలిలా ఉన్నాయి.
గుడివాడ బైపాస్‌రోడ్డులో నివసించే ఎస్‌కే రిజ్వానాకు పురిటినొప్పులు రావడంతో సోమవారం సాయంత్రం ప్రసవం కోసం ప్రభుత్వాస్పత్రికి తీసుకువచ్చారు. మంగళవారం ఉదయం 11.30 గంటల సమయంలో సిజేరియన్ చేయగా పండంటి కవల పిల్లలు పుట్టడంతో బంధువులు మురిసిపోయారు. మధ్యాహ్నం 4 గంటల సమయంలో రక్తస్రావం కంట్రోల్ కాక పోవడంతో వైద్యులు ఆపరేషన్ థియేటర్‌కు తీసుకెళ్లారు. సాయంత్రం 5 గంటల సమయంలో కార్డియాక్ అరెస్ట్ కావడంతో మృతి చెందారని వైద్యులు చెప్పడంతో అప్పటి వరకూ బంధువుల్లో ఉన్న ఆనందం ఒక్కసారిగా ఆవిరైంది.
వైద్యులు పట్టించుకోక పోవడం వల్లే..
ప్రసవం కోసం వచ్చిన గర్భిణీకి జూనియర్ వైద్యులు ఆపరేషన్ చేయడం వల్లే అలా జరిగినట్లు భర్త హుస్సేన్, బంధువులు ఆరోపిస్తున్నారు. సాయంత్రం 5 గంటల సమయంలో భాలింత మృతి చెందగా, అర్ధరాత్రి వరకూ మృతదేహాన్ని ఆస్పత్రిలోనే ఉంచి ఆందోళన చేస్తున్నారు.
పొంతన లేని సమాధానాలు చెబుతున్నారు
బాలింత మృతిపై వైద్యులు పొంతన లేని సమాధానాలు చెబుతున్నారని వైఎస్సార్‌సీపీ నగర అధ్యక్షుడు వెలంపల్లి శ్రీనివాస్ అన్నారు. హైబీపీతో వచ్చిందని , రక్తస్రావం అని చెపుతున్నట్లు పేర్కొన్నారు. ప్రసవం కోసం ప్రభుత్వాస్పత్రికి వస్తే రూ.16 వేలు ఖర్చు చేశారని అయినా ప్రాణాలతో దక్కలేదన్నారు. ప్రభుత్వాస్పత్రిల్లో సౌకర్యాలు మెరుగుపర్చాలన్నారు.
హైరిస్క్‌తో చేరారు
రిజ్వాన సోమవారం ప్రీ ఎట్వాన్షియా(హైబీపీ) అనే ప్రాబ్లమ్‌తో హైరిస్క్‌తో ఆస్పత్రిలో చేరారు. ఆ పరిస్థితుల్లో ఆమెను అబ్జర్వేషన్‌లో ఉంచారు. ఉదయం స్కాన్ చేయగా, కవల పిల్లలు ఉండటం, ఒక శిశువు ఎదురు కాళ్లతో ఉండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో సిజేరియన్ చేశారు. ఆపరేషన్ అనంతరం గర్భసంచి సంకోచించి నార్మల్ పరిస్థితికి రావాలి.కానీ ఆమెకు అలా జరగక పోవడంతో అధికరక్తస్రావమైంది. దానిని సరిద్దేందుకు వైద్యులు సిద్ధమవుతుండగా టోటల్ మెకానిజమ్ దెబ్బతినడంతో కార్డియాక్ అరెస్ట్ అయింది. – డాక్టర్ ఎస్.బాబూలాల్, సూపరింటెండెంట్
Comments
Please login to add a commentAdd a comment