ప్రాణాలు తీసిన దారిద్య్రం | Pregnant Women Died In Chittoor | Sakshi
Sakshi News home page

ప్రాణాలు తీసిన దారిద్య్రం

Published Sat, Dec 1 2018 12:22 PM | Last Updated on Sat, Dec 1 2018 12:22 PM

Pregnant Women Died In Chittoor - Sakshi

మృతి చెందిన లక్ష్మి, చిత్రంలో పసికందు

తిరుపతి తుడా, మంగళం : పేరుకు స్మార్టు సిటీ. ఇప్పటికీ చాలా ప్రాంతాలకు సరైన దారి సౌకర్యం లేని దుస్థితి. అంబులెన్స్‌ కూడా చేరుకోని పరిస్థితి. శుక్రవారం ఈ పరిస్థితి వల్ల ఓ నిండు గర్భిణీ ప్రాణం గాలిలో కలిసిపోయింది.అధికారుల నిర్లక్ష్యం ఈమెను బలి తీసుకుంది. పసికందును ప్రసవించి గర్భిణి కన్ను మూసిన వైనం స్థానికుల గుండెల్ని పిండేసింది. తిరుపతి నగర శివారు ప్రాంతం వినాయక సాగర్‌ సమీపంలోని వెంకటరెడ్డి కాలనీలో ఎస్టీ మహిళ లక్ష్మి గర్భిణి. ఈమెకు శుక్రవారం సాయంత్రం పురిటి నొప్పులు వచ్చాయి. వెంటనే భర్త 108కు ఫోన్‌ చేశాడు.  కరకంబాడి రోడ్డు బొంతాలమ్మ ఆలయ సమీపానికి మాత్రమే ఆటో చేరుకోగలిగింది.  వినాయక సాగర్‌ కట్ట నుంచి వెంకటరెడ్డి కాలనీకి వెళ్లేందుకు మార్గం అస్తవ్యస్తంగా ఉంది.

దీంతో అంబులెన్స్‌ ముందుకు కదల్లేదు. మెయిన్‌ రోడ్డు వరకు ఆటోలో తీసుకురావాలని 108 సిబ్బంది సమాచారం ఇచ్చారు. దీంతో ఆటోలో లక్ష్మిని తరలిస్తుండగా గుంతల రోడ్డులో కుదుపులకు నరకయాతన అనుభవించింది. ఫలితంగా ఆటోలోనే ప్రసవించింది. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. క్షణాల్లోనే లక్ష్మి ప్రాణం విడిచింది. దీంతో పసికందును పట్టుకుని కుటుంబ సభ్యులుగుండెలవిసేలా రోదించారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ యువనాయకుడు భూమన అభినయ్‌ ఘటనా స్థలానికి చేరుకుని చలించిపోయారు. కాలనీకి వాహనాలు కూడా సరిగా రాలేని పరిస్థితి ఎదురవ్వడం దారుణమన్నారు. ఈ నిర్లక్ష్యానికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. రోడ్లు వేయాలని నెలల తరబడి గ్రామస్తులు వేడుకుంటున్నా పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. ఆ కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలబడాలని డిమాండ్‌ చేశారు. ఆయన వెంట పాముల రమేష్‌రెడ్డి, శివప్రసాద్, వెంకటేష్‌ తదితరులు ఉన్నారు.

బాధ్యత ఎవరు వహించాలి..
తిరుపతిని స్మార్ట్‌ సిటీగా అభివృద్ధి చేశామని గొప్పలు చెప్పుకుంటున్న నాయకులకు, అధికారులకు ఈ ఘటన కనువిప్పు కలిగించాలి. తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌లో విలీనమైన తిమ్మినాయుడుపాళెం అభివృద్ధి్దకి దూరంగా ఆగిపోయింది. వినాయకసాగర్‌ అవతలి గ్రామానికి వెళ్లే ప్రజలకు సరైన దారి సౌకర్యాం కల్పించలేకపోయారు. ఇటీవల తుడా, కార్పొరేషన్, ఇరిగేషన్‌ శాఖలు వినాయక సాగర్‌ను అభివృద్ధి చేశాయి. అభివృద్ధి పనులను పూర్తి స్థాయిలో చేయకనే మధ్యలో నిలిపేశారు. శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో పనులు ఆగిపోయాయి. కట్టను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఇరిగేషన్‌ పరిధికి వస్తుంది.  తాము ఇప్పటికే పనులు చేశామని, ఇక కార్పొరేషన్‌ పూర్తి స్థాయి పనులను చేపట్టాలని చేతులు దులుపుకుంది. కార్పొరేషన్‌ యంత్రాం గం బాధ్యతలు తీసుకుని గ్రామాలకు రోడ్డును ఏర్పాటు చేయాలి. కానీ చేయలేదు. ఫలితంగా రోడ్డు గుంతలమయంగా తయారైంది. వాహన దారులు, పాదచారులు నరకయాతన పడుతున్నారు. తాజాగా గర్భిణి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. రోడ్డు గుంతలు సాకుగా చూపిన 108 సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడమూ ఆమె మృతికి కారణమైంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement