సిగరెట్‌ అట్టముక్కే మందుల చీటీ.. డాక్టర్లపై మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం | Telangana Minister Harish Rao Visit To Jangaon MCH | Sakshi
Sakshi News home page

సిగరెట్‌ అట్టముక్కే మందుల చీటీ.. డాక్టర్లపై మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం

Published Sun, May 15 2022 1:44 AM | Last Updated on Sun, May 15 2022 3:18 PM

Telangana Minister Harish Rao Visit To Jangaon MCH - Sakshi

బాలింత, కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌రావు 

జనగామ: సిగరెట్‌ డబ్బా అట్టముక్కలపై మందులు రాసి బయట తెచ్చుకోమంటున్నారని మంత్రి హరీశ్‌రావుకు జనగామ చంపక్‌హిల్స్‌ మాతా శిశుసంరక్షణ ఆరోగ్య కేంద్రం (ఎంసీహెచ్‌)లోని బాలింతలు, రోగుల బంధువులు ఫిర్యాదు చేశారు. పేరుకే ఉచితమని.. సూదులు, సిరప్‌లు కూడా బయటే కొంటున్నామని మంత్రి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. నకిరేకల్‌ నుంచి సిద్దిపేటకు వెళ్లే క్రమంలో మార్గమధ్యలో ఉన్న చంపక్‌హిల్స్‌ ఎంసీహెచ్‌ను మంత్రి శనివారం తనిఖీ చేశారు.

నేరుగా జనరల్‌ వార్డులోని బాలింతల వద్దకు వెళ్లి ఆత్మీయంగా పలకరించారు. వారికి అందుతున్న వైద్య సేవలు, ఇతర సదుపాయాల గురించి తెలుసుకున్నారు. అక్కడే ఉన్న లింగాల ఘణపురానికి చెందిన మహేశ్‌ను మంత్రి పలకరించగా.. ‘సిగరెట్‌ డబ్బాల అట్టముక్కలపై మందుగోలీలు బయటకు రాస్తున్నారు. చూడండి సారూ’అంటూ తన వద్ద ఉన్న ప్రిస్క్రిప్షన్‌ను మంత్రికి చూపించారు. ‘ఉచితం పేరుకే. నొప్పుల సూది.. సిరప్‌లు కూడా బయటనే కొంటున్నాం’అంటూ జనగామ మండ లం గోపిరాజుపల్లికి చెందిన భాగ్యలక్ష్మి తన గోడు వెళ్లబోసుకున్నారు.  

ఆస్పత్రి నివేదికివ్వాలని వైద్యారోగ్య శాఖ కమిషనర్‌కు ఆదేశం  
ప్రభుత్వం నుంచి కొరత లేకుండా మందు లు పంపిస్తుంటే ప్రైవేటు మెడికల్‌ దుకాణాలకు ఎం దుకు రిఫర్‌ చేస్తున్నారని డాక్టర్లు, సిబ్బందిపై మం త్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంసీహెచ్‌ ఎదుట ఉన్న మెడికల్‌ దుకాణాలను వెంటనే సీజ్‌ చేయిం చాలని ఆదేశించా రు. ఒక్కో పేషెంట్‌ వద్దకు వెళ్లి వారు చెప్పిన ప్రతి విషయాన్ని వింటూ పక్కనే ఉన్న ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సుగుణాకర్‌రాజును వివరణ కోరారు.

ప్రైవేటు స్కా నింగ్‌ సెంటర్లను ప్రోత్సహించకుండా ఎంసీహెచ్‌లోనే గర్భిణులకు ఈ సేవలను ఉచితంగా అందించాలన్నారు. ఆస్పత్రిలోని లోపాలను గుర్తించి అక్కడి నుంచే వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ వాకాటి కరుణతో ఫోన్‌లో మాట్లాడారు. జనగామ ఎంసీహెచ్‌కు సంబంధించిన సమగ్ర నివేదికను అందించాలని ఆదేశించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement