Mata Child Welfare Center
-
సిగరెట్ అట్టముక్కే మందుల చీటీ.. డాక్టర్లపై మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం
జనగామ: సిగరెట్ డబ్బా అట్టముక్కలపై మందులు రాసి బయట తెచ్చుకోమంటున్నారని మంత్రి హరీశ్‌రావుకు జనగామ చంపక్‌హిల్స్ మాతా శిశుసంరక్షణ ఆరోగ్య కేంద్రం (ఎంసీహెచ్)లోని బాలింతలు, రోగుల బంధువులు ఫిర్యాదు చేశారు. పేరుకే ఉచితమని.. సూదులు, సిరప్లు కూడా బయటే కొంటున్నామని మంత్రి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. నకిరేకల్ నుంచి సిద్దిపేటకు వెళ్లే క్రమంలో మార్గమధ్యలో ఉన్న చంపక్‌హిల్స్ ఎంసీహెచ్‌ను మంత్రి శనివారం తనిఖీ చేశారు. నేరుగా జనరల్ వార్డులోని బాలింతల వద్దకు వెళ్లి ఆత్మీయంగా పలకరించారు. వారికి అందుతున్న వైద్య సేవలు, ఇతర సదుపాయాల గురించి తెలుసుకున్నారు. అక్కడే ఉన్న లింగాల ఘణపురానికి చెందిన మహేశ్‌ను మంత్రి పలకరించగా.. ‘సిగరెట్ డబ్బాల అట్టముక్కలపై మందుగోలీలు బయటకు రాస్తున్నారు. చూడండి సారూ’అంటూ తన వద్ద ఉన్న ప్రిస్క్రిప్షన్‌ను మంత్రికి చూపించారు. ‘ఉచితం పేరుకే. నొప్పుల సూది.. సిరప్లు కూడా బయటనే కొంటున్నాం’అంటూ జనగామ మండ లం గోపిరాజుపల్లికి చెందిన భాగ్యలక్ష్మి తన గోడు వెళ్లబోసుకున్నారు. ఆస్పత్రి నివేదికివ్వాలని వైద్యారోగ్య శాఖ కమిషనర్‌కు ఆదేశం ప్రభుత్వం నుంచి కొరత లేకుండా మందు లు పంపిస్తుంటే ప్రైవేటు మెడికల్ దుకాణాలకు ఎం దుకు రిఫర్ చేస్తున్నారని డాక్టర్లు, సిబ్బందిపై మం త్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంసీహెచ్ ఎదుట ఉన్న మెడికల్ దుకాణాలను వెంటనే సీజ్ చేయిం చాలని ఆదేశించా రు. ఒక్కో పేషెంట్ వద్దకు వెళ్లి వారు చెప్పిన ప్రతి విషయాన్ని వింటూ పక్కనే ఉన్న ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సుగుణాకర్‌రాజును వివరణ కోరారు. ప్రైవేటు స్కా నింగ్ సెంటర్లను ప్రోత్సహించకుండా ఎంసీహెచ్‌లోనే గర్భిణులకు ఈ సేవలను ఉచితంగా అందించాలన్నారు. ఆస్పత్రిలోని లోపాలను గుర్తించి అక్కడి నుంచే వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి కరుణతో ఫోన్లో మాట్లాడారు. జనగామ ఎంసీహెచ్‌కు సంబంధించిన సమగ్ర నివేదికను అందించాలని ఆదేశించారు. -
మాతా, శిశు సంరక్షణ కార్డులు ఎక్కడున్నాయ్..?
సాక్షి, రాయవరం (మండపేట): వివాహిత గర్భం దాల్చిన దగ్గర నుంచి ఆమె ఆరోగ్య వివరాలను, ఆమెకు అందించే పౌష్టికాహార వివరాలను నమోదు చేసేందుకు వినియోగించే మాతా, శిశు సంరక్షణ(ఎంసీహెచ్) కార్డులు పీహెచ్‌సీల్లో నిండుకున్నాయి. జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో గర్భిణులకు వీటిని పంపిణీ చేస్తారు. ఏడాదిగా కార్డుల కొరతను ఎదుర్కొంటున్నారు. అధికారులు పట్టించుకోక పోవడంతో గర్భిణులు, బాలింతలు ఇబ్బందులు పడుతున్నారు. గర్భిణి పూర్తి వివరాలు నమోదు మహిళలు గర్భం దాల్చిన సమయంలో కాన్పు అయ్యే వరకు ప్రభుత్వ వైద్యశాలల్లో నాలుగుసార్లు వైద్యసేవలు తప్పనిసరిగా చేయించుకోవాలి. మహిళల వైద్య చరిత్ర, గర్భం దాల్చిన తేదీ, ప్రసవం తేదీలతో పాటు అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం అందజేయడం, కాన్పు జరిగిన తర్వాత బిడ్డకు వేసే టీకాల వివరాలు, ప్రభుత్వం అందించే జననీ సురక్షాయోజన పథకాల ఆర్థిక సాయం వివరాలను ఎంసీహెచ్ కార్డుల్లో తప్పని సరిగా నమోదు చేయాలి. మూడు నెలలుగా కార్డులు నిలిచి పోయినట్టు సమాచారం. అన్ని ప్రాథమిక, సామాజిక ఆరోగ్య కేంద్రాలతో పాటు ఆరోగ్య ఉపకేంద్రాలు, జిల్లా ఆస్పత్రులకు ఎంసీహెచ్ కార్డులు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పంపిణీ చేస్తోంది. ఈ కార్డులు వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు జిల్లా అవసరాన్ని సరఫరా చేయాల్సి ఉండగా, కొంతకాలంగా వీటి సరఫరా నిలిచిపోయింది. కార్డుల కొరత ఉండడంతో వైద్య ఆరోగ్య సిబ్బంది ఫొటోస్టాట్ కాపీలను అందజేస్తున్నారు. అన్నింటికీ ఇబ్బందే ప్రభుత్వ వైద్యశాలల్లో వైద్య పరీక్షలకు వెళ్లే గర్భిణులు, బాలింతలు వైద్యాధికారులకు ఎంసీహెచ్ కార్డులు చూపించాలి. గర్భిణుల్లో హెమోగ్లోబిన్ శాతం, అందుతున్న మందులు, బిడ్డ ఎదుగుదల చెప్పే స్కానింగ్ వివరాలన్నీ కార్డులో నమోదు చేయాల్సి ఉంది. కార్డులు కావాల్సినన్ని అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఎంసీహెచ్ కార్డుల కొరతను పలువురు వైద్యాధికారులు జిల్లా అధికారుల దృష్టికి తీసుకు రావడంతో మూడు నెలల క్రితం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఎంసీహెచ్ కార్డుల కొరతను రాష్ట్ర అధికారుల దృష్టికి తీసుకు వెళ్లారు. అయినా నేటి వరకు ఎంసీహెచ్ కార్డులు రాలేదు. 50వేల కార్డులు అవసరం ప్రభుత్వ ఆస్పత్రుల్లో నెలకు 6–10 వేల వరకు ప్రసవాలు జరుగుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు పట్టణ ప్రాంతాల్లో కన్నా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రతి గర్భిణికి ఈ కార్డులు ఇవ్వడం వల్ల వారి పూర్తి వివరాలు ఇందులో నమోదవుతాయి. ఎంసీహెచ్ కార్డులు జిల్లాకు రప్పించడంలో అధికారులు పెద్దగా దృష్టి సారించడం లేదనే విమర్శలు విన్పిస్తున్నాయి. కార్డుల కొరత ఉంది ఎంసీహెచ్ కార్డుల కొరత ఉంది. పీహెచ్సీలో నెలకు 15–20 మంది గర్భిణులు నమోదవుతున్నారు. కార్డుల కొరత ఉండడంతో ఫొటోస్టాట్ కాపీలు ఇస్తున్నాం. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్లాం. – డాక్టర్ అంగర దేవిరాజశ్రీ, పీహెచ్సీ, రాయవరం త్వరలోనే పంపిణీకి చర్యలు ఈనెల 4న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిగా బాధ్యతలు తీసుకున్నాను. ఎంసీహెచ్ కార్డుల కొరత విషయం నా దృష్టికి వచ్చింది. రాష్ట్రస్థాయి అధికారులతో మాట్లాడి త్వరలోనే వీటి పంపిణికి చర్యలు తీసుకుంటాను. – డాక్టర్ టి.రమేష్‌కిశోర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి, కాకినాడ -
పసికందు మృతి.. ఆందోళన
వైద్యుల నిర్లక్ష్యమేనంటూ బంధువుల ఆరోపణ సిద్దిపేట జోన్: సిద్దిపేట మాతా శిశు సంక్షేమ కేంద్రంలో అప్పుడే పుట్టిన శిశువు మృతి చెందింది. దీంతో బంధువులు ఆందోళనకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ ఆరోపించారు. మిరుదొడ్డి మండలం లక్ష్మీనగర్‌కు చెం దిన పావని బుధవారం పురిటి నొప్పులతో ఎంసీహెచ్‌లో చేరారు. పరీక్షించిన వైద్యులు నార్మల్ డెలివరీ కోసం పర్యవేక్షణలో పెట్టారు. కాగా, గురువారం ఉదయం మరోసారి పావనికి నొప్పులు రావడం... గర్భంలో శిశువు కదలికల్లో తేడాలు గమనించిన వైద్యులు వెంటనే ఆమెకు శస్త్రచికిత్స చేశారు. అయితే గర్భంలోనే శిశువు మృతిచెంది ఉంది. విషయాన్ని సిబ్బంది బంధువులకు తెలపడంతో వారు భోరుమన్నారు. వైద్యులు సకాలంలో వైద్యం అందించకపోవడంవల్లే పసికందు ప్రాణాలు వదిలిందని బంధువులు ఆందోళనకు దిగారు. పరిస్థితి ఇంత విషమంగా ఉంటే చెప్పకపోవడంమేమిటని సిబ్బందిని నిలదీశారు. అయితే... పసికందు మృతిలో వైద్యుల నిర్లక్ష్యం లేదని ఎంసీహెచ్ సూపరింటెండెంట్ రఘురాం తెలిపారు.