‘మహా’ మాస్టర్ ప్లాన్ రెడీ
- 13 ప్రత్యేక జోన్లుగా విభజన, 7 జిల్లాల్లో విస్తరణ
- ఎంసీహెచ్, హెచ్‌ఎండీఏ, హడా, సీడీఏ అంతటా ఒకే ప్రణాళిక
- సర్వే నంబర్లవారీగా జీఐఎస్‌తో అనుసంధానం
- త్వరలో ప్రభుత్వానికి నివేదిక... నెలాఖరులో ప్రజల ముందుకు
సాక్షి, హైదరాబాద్
హైదరాబాద్ మహానగర అభివృద్ధి నూతన ప్రణాళిక ఏడు జిల్లాలకు విస్తరిస్తూ త్వరలో ప్రజల ముందుకు రానుంది. గతంలో ఉన్న హైదరాబాద్, సైబరాబాద్, హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ డెవలప్‌మెంట్ అథారిటీ, ఔటర్ రింగ్‌రోడ్డు గ్రోత్ కారిడార్‌లతో పాటు భువనగిరి, సంగారెడ్డి మున్సిపాలిటీల మాస్టర్ ప్లాన్లన్నింటినీ కలుపుకుని అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన మాస్టర్ ప్లాన్‌లో మొత్తం 13 జోన్లను పొందుపరిచారు. గతంలో ఉన్న 24 జోన్లను కుదించి రెసిడెన్షియల్, కమర్షియల్, పెరీ అర్బన్, మల్టిపుల్ యూజ్, రిక్రియేషన్, ఫారెస్ట్, కన్జర్వేషన్, ట్రాఫిక్ అండ్ ట్రాన్‌సపోర్ట్ తదితర అంశాలకు మాస్టర్ ప్లాన్‌లో ప్రాధాన్యం ఇచ్చారు. అయితే గతంలో ఉన్న గ్రామాల మ్యాపుల ప్రకారం చాలా రహదారులు, చెరువులు తాజా ప్రణాళికలో మాయంకాగా కొత్తగా రహదారులు, చెరువులను గుర్తించి అందుకోసం రిజర్వు చేశారు. గతంలో రూపొందించిన ఆయా మాస్టర్ ప్లాన్లతో పోలిస్తే తాజా సర్వేలో చెరువుల సంఖ్య భారీగా పెరిగినట్లు సమాచారం.
గ్రామం, సర్వే నంబర్‌వారీగా...
తాజా మాస్టర్ ప్లాన్‌లో గ్రామం లేదా పట్టణం, మున్సిపల్ డివిజన్‌వారీగా, సర్వే నంబర్‌వారీగా ఆయా జోన్లను ప్రకటించనున్నారు. మాస్టర్ ప్లాన్ అమల్లోకి వచ్చాక రూపొందించే ప్రత్యేక యాప్‌లో సర్వే నంబర్‌వారీగా జోన్ల వివరాలను క్షణాల్లో ఆన్‌లైన్‌లోనే తెలుసుకునే అవకాశం ఉంటుంది. గతంలో రూపొందించిన ఎంసీహెచ్, హడా మాస్టర్‌ప్లాన్‌లు ఆటోకార్డ్ సాఫ్ట్‌వేర్‌లో, హెచ్‌ఎండీఏ ఆటోక్యాడ్‌లో ఉండగా తాజాగా రూపొందించిన మాస్టర్ ప్లాన్‌ను గ్లోబల్ ఇన్ఫర్మేషన్ సిస్టం (జీఐఎస్)తో అనుసంధానమయ్యేలా రూపొందించారు. త్వరలో ముఖ్యమంత్రి, పురపాలక మంత్రి దృష్టికి తీసుకువెళ్లి వారి ఆమోదం పొందాక ముసారుుదా ప్రణాళికను గ్రామాలవారీగా ప్రదర్శించి ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకోనున్నారు.
ఇదీ హెచ్‌ఎండీఏ మాస్టర్ ప్లాన్ పరిధి...
హెచ్‌ఎండీఏ కొత్త మాస్టర్ ప్లాన్ హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, యాదాద్రి-భువనగిరి, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో విస్తరించనుంది. ఇందులో హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల్లో పూర్తి ప్రాంతాలతోపాటు రంగారెడ్డి జిల్లాలో మంచాల, కొందుర్గు, ఆమనగల్లు, కేశంపేట, చౌదరిగూడ, యాచారం, తలకొండపల్లి, మాడ్గుల మినహా అన్ని ప్రాంతాలు, యాదాద్రి-భువనగిరిలో భువనగిరి, పోచంపల్లి, చౌటుప్పల్, బీబీనగర్, బొమ్మల రామారం మండలాలు, సంగారెడ్డిలో సంగారెడ్డి, ఆర్‌సీ పురం, పటాన్‌చెరువు, హత్నూర, జిన్నారం, మెదక్ జిల్లాలో నర్సాపూర్, శివ్వంపేట, సిద్దిపేట జిల్లాలో వర్గల్, ములుగు, మర్కుక్ మండలాలు హెచ్‌ఎండీఏ పరిధిలోకి వస్తాయి.
అభివృద్ధి నమూనాగా నిలిచేనా...
హైదరాబాద్ చుట్టూరా ఉన్న రంగారెడ్డి, మేడ్చల్, యాదాద్రి, సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లాల అభివృద్ధికి నమూనాగా హెచ్‌ఎండీఏ రూపొందించిన మాస్టర్‌ప్లాన్‌పై అనేక అంచనాలున్నాయి. లీ అసోసియేట్ ఆధ్వర్యంలో రూపొందించిన మాస్టర్ ప్లాన్ హైదరాబాద్ చుట్టూరా విస్తరించి ఉన్న ఏడు జిల్లాలను సమగ్ర అభివృద్ధి దిశగా నడిపించే దిశగా ఉంటుందన్న నమ్మకం ఆయా ప్రాంతవాసుల్లో నెలకొంది. గతంలో హైదరాబాద్ పశ్చిమానే అభివృద్ధి కేంద్రీకృతం కావటంతో వరంగల్, కరీంనగర్, మెదక్, విజయవాడ, మహబూబ్‌నగర్ రహదారుల వైపు అభివృద్ధి నిలిచిపోయింది. సీఎంగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టాక హైదరాబాద్ చుట్టూరా సమాన అభివృద్ధి కేంద్రాలు విలసిల్లేలా చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో తాజా మాస్టర్ ప్లాన్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.