ఎంఎన్‌పీ సమస్యలకు ట్రాయ్ చెక్
న్యూఢిల్లీ: నంబర్ పోర్టబిలిటీ అభ్యర్థనలు తిరస్కరణకు గురవుతున్న ఉదంతాలను నియంత్రించే దిశగా టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఎంఎన్‌పీ క్లియరింగ్ హౌస్ (ఎంసీహెచ్) ఏర్పాటు ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. నంబర్ పోర్టబిలిటీ ప్రక్రియకు సంబంధించిన వివరాలన్నీ ఎంసీహెచ్‌లో అందుబాటులో ఉండేలా చూడాలని ప్రతిపాదించింది.
ప్రస్తుత విధానం ప్రకారం నెట్‌వర్క్ మారదల్చుకున్న వారి గత బిల్లింగ్ బకాయిల వివరాలు, అందుకున్న నోటీసులు, విశిష్ట పోర్టింగ్ కోడ్ (యూపీసీ) ఆఖరు తేదీ మొదలైనవి కొత్త ఆపరేటరు (ఆర్‌వో)కి అందుబాటులో ఉండటం లేదు. దీంతో ఆయా అంశాలను ధ్రువీకరించు కోలేక పలు నంబర్ పోర్టబిలిటీ అభ్యర్థనలను ఆపరేటర్లు తిరస్కరించాల్సి వస్తోంది.
తిరస్కరణకు గురైన కేసుల్లో దాదాపు 40 శాతం అభ్యర్ధనలు యూపీసీ సరిపోలకపోవడం, యూపీసీ గడువు ముగిసిపోవడం వంటి అంశాల కోవకి చెందినవే ఉంటున్నాయి. ఇది గుర్తించిన ట్రాయ్.. ప్రస్తుత పోర్టబిలిటీ ప్రక్రియలో ఎంసీహెచ్‌ని కూడా చేర్చాలని భావించింది. దీనిపై ఆగస్టు 31 దాకా సంబంధిత వర్గాలు తమ అభిప్రాయాలను ట్రాయ్‌కి తెలియచేయొచ్చు.