న్యూఢిల్లీ: చౌకగా వచ్చి పడుతున్న చైనా వైద్య పరికరాల ముందు దేశీ పరిశ్రమ వెలవెలబోతోంది. కరోనా మహమ్మారి ఉధృత రూపం చూపించిన సమయంలో.. వైద్య ఉత్పత్తులకు డిమాండ్ అనూహ్యంగా పెరిగింది. దీంతో దేశీ పరిశ్రమ తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకుంది. కానీ, ఇప్పుడు సరైన అమ్మకాల్లేక 33 శాతం సామర్థ్యాన్ని వినియోగించుకోలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా కన్జ్యూమబుల్స్, డిస్పోజబుల్స్, తక్కువ ధరలతో కూడిన ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను తయారు చేసే పరిశ్రమలు మరింత ప్రతికూలతలను చూవిచూస్తున్నాయి.
ఇదీ పరిస్థితి..
అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ మెడికల్ డివైజెస్ ఇండస్ట్రీ (ఏఐఎంఈడీ) గణాంకాలను పరిశీలిస్తే.. కరోనా రాక ముందు ఏటా 6.24 మిలియన్ల పీపీఈ కిట్ల ఉత్పత్తి దేశీయంగా నడిచేది. కానీ, ఈ ఏడాది జూన్ నాటికి పీపీఈ కిట్ల సామర్థ్యం 234 మిలియన్ పీసులకు పెరిగింది. 3,360 వెంటిలేటీర్ల తయారీ సామర్థ్యం నుంచి 7,00,000 వెంటిలేటర్లకు పెరిగింది. మాస్క్‌ల ఉత్పత్తి అయితే ఏకంగా 31 కోట్ల నుంచి 355 కోట్లకు పెరిగిపోయింది. ‘‘కరోనా రెండో విడత విరుచుకుపడిన ఈ ఏడాది మార్చి–ఏప్రిల్‌లో కంపెనీలు పూర్తి సామర్థ్యం మేరకు ఉత్పత్తి చేశాయి. అయినా కానీ కొంత కొరత నెలకొంది’’ అని ఏఐఎంఈడీ ఫోరమ్ కోర్డినేటర్ రాజీవ్‌నాథ్ తెలిపారు. కానీ, ఇప్పుడు 40 శాతం ఉత్పత్తి సామర్థ్యమే నడుస్తోందని చెప్పారు. చెన్నైకు చెందిన మాస్క్‌ల తయారీ కంపెనీ శాన్సిఫి అయితే మూడింత ఒక వంతు ఉత్పత్తి సామర్థ్యాన్నే (ఎగుమతులతో కలసి) ప్రస్తుతం వినియోగించుకోగలుగుతున్నట్టు సంస్థ సీఈవో సుధీర్‌రెడ్డి తెలిపారు. కరోనా సమయంలో మిలియన్ డాలర్లతో సామర్థ్యాన్ని పెంచుకున్నామని, ఇప్పుడు స్థిర వ్యయాలే భారంగా మారినట్టు చెప్పారు. ‘‘పరిస్థితి ఇదే మాదిరిగా మరో ఆరు నెలలు కొనసాగితే అప్పుడు మెషినరీని విక్రయించడం లేదంటే కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదు’’ అని సుధీర్‌రెడ్డి అన్నారు.
దిగుమతుల పాత్ర..
ఒకవైపు కొంత డిమాండ్ తగ్గిన మాట వాస్తవమే కానీ, దేశీయ పరిశ్రమ సామర్థ్యం మేరకు పనిచేయకపోవడానికి చైనా నుంచి వస్తున్న చౌక దిగుమతులు కూడా కారణమేనని పరిశ్రమ అంటోంది. 2020–21 ఆర్థిక సంవత్సరంలో చైనా నుంచి వైద్య పరికరాల దిగుమతులు 75 శాతం పెరిగాయి. భారత్‌కు వైద్య పరికరాల ఎగుమతిదారుల్లో చైనానే ముందుంటోంది. అమెరికా, జర్మనీలు వెనుకనే ఉన్నాయి. మన దేశ అవసరాల్లో 80 శాతం పరికరాలను దిగుమతి చేసుకుంటున్నట్టు (సుమారు రూ45,000 కోట్ల విలువైన) గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్‌ఐ స్కీమ్) కింద దేశీయంగా వైద్య పరికరాల ఉత్పత్తిని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కానీ, ఇప్పటికే తయారీ సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోలేని పరిస్థితి ఎదుర్కొంటుంటే.. పీఎల్‌ఐ కింద అదనంగా పరిశ్రమలను ఏర్పాటు చేయడం వల్ల ప్రయోజనం ఏముంటుందన్న ప్రశ్న ఎదురవుతోంది. చైనా నుంచి దిగుమతులు పెరగడం ఆందోళన కలిగించేదిగా రాజీవ్‌నాథ్ అన్నారు. ప్రభుత్వం దేశీ పరిశ్రమను, ఇన్వెస్టర్లను మరింత ప్రోత్సహించే చర్యలతో ముందుకు రావాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. కనీసం కీలకమైన పరికరాలను అయినా పీఎల్‌ఐ పరిధిలోకి చేర్చాలన్నారు. లేదంటే టారిఫ్‌లతో (దిగుమతి సుంకాలు) అయినా దిగుమతుల నుంచి దేశీ పరిశ్రమకు రక్షణ కల్పించాలని అభిప్రాయపడ్డారు.
స్థానిక కంపెనీల్లో ఉత్సాహం కరవు..
వైద్య పరికాల పీఎల్‌ఐ పథకం కింద ఎక్కువ దరఖాస్తులు బహుళజాతి కంపెనీల నుంచే వచ్చాయని, స్థానిక కంపెనీలు పెద్దగా ముందుకు రాలేదని స్కాన్‌రే టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు ఆల్వ తెలిపారు. ఇన్‌వేసివ్ వెంటిలేటర్ల తయారీలో స్కాన్‌రే ప్రముఖ సంస్థగా ఉంది. చైనా నుంచి వచ్చే దిగుమతులపై నిషేధం విధించడం లేదంటే టారిఫ్‌లు పెంచడం అంత సులభం కాదని దేశీ వైద్య పరికాల పరిశ్రమ భావిస్తోంది. ‘‘ప్రభుత్వం నిజంగా నిషేధం విధించలేదు. ఎందుకంటే ఈ చర్యతో దేశీ పరిశ్రమ కూడా ఇబ్బందుల పాలవుతుంది. ఎందుకంటే విడిభాగాల కోసం దేశీ పరిశ్రమ చైనాపై ఆధారపడుతోంది. మా స్కాన్‌రే కంపెనీ విషయాన్నే పరిశీలిస్తే.. 80 శాతం విడిభాగాలు స్థానికంగానే సమకూర్చుకుంటున్నాం. అయినప్పటికీ మరో 20 శాతం కీలక విడిభాగాలపై చైనాపై ఆధారపడాల్సిందే. నిషేధిస్తే మేము సైతం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది’’ అని ఆల్వ వివరించారు.
చదవండి: చైనా నుంచి నెమ్మదిగా సైడ్.. భారత్ మార్కెట్ కోసం మైక్రోసాఫ్ట్ మాస్టర్ ప్లాన్
Comments
Please login to add a commentAdd a comment