ఎస్3వీ వాస్క్యులార్ టెక్నాలజీస్ ప్రతినిధులతో జరిగిన సమావేశంలో మంత్రి కేటీఆర్, జయేశ్‌రంజన్
సాక్షి, హైదరాబాద్: దేశానికి హైదరాబాద్ వైద్య ఉపకరణాల తయారీ కేంద్రంగా మారుతోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు పేర్కొన్నారు. నరాలు, గుండె జబ్బులకు సంబంధించిన అత్యాధునిక వైద్య ఉపకరణాల తయారీ సంస్థ ఎస్3వీ వాస్క్యులార్ టెక్నాలజీస్ సంస్థ సుల్తాన్‌పూర్ మెడికల్ డివైజెస్ పార్కులో రూ.250 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది.
ఎస్3వీ వాస్క్యులార్ టెక్నాలజీస్ ప్రతినిధులు గురువారం మంత్రి కేటీఆర్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని వైద్య ఉపకరణాల పార్కులో 2017 నుంచి ఇప్పటివరకు సుమారు రూ.1,500 కోట్ల పెట్టుబడులతో పాటు 7 వేల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభించాయన్నారు. 302 ఎకరాల్లో విస్తరించి ఉన్న మెడికల్ డివైజెస్ పార్కులో పెట్టుబడులకు మంచి స్పందన లభిస్తోందని, ఇప్పటివరకు 50కి పైగా కంపెనీలు పెట్టుబడులతో ముందుకు వచ్చి తయారీ, పరిశోధన, అభివృద్ధి యూనిట్లు ఏర్పాటు చేశాయన్నారు.
పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణలు, తయారీ రంగంలో వైద్య ఉపకరణాల పార్కును బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని కేటీఆర్ అన్నారు. రూ.250 కోట్లతో తాము నెలకొల్పే యూనిట్ ద్వారా 500 మందికి ప్రత్యక్షంగా, మరో 250 మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని ఎస్3వీ వాస్క్యులార్ టెక్నాలజీస్ ప్రమోటర్, డైరెక్టర్ బదరీ నారాయణ్ వెల్లడించారు. కేటీఆర్‌తో బదరీ నారాయణ్, విజయగోపాల్, ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, రాష్ట్ర లైఫ్‌సైన్సెస్, ఫార్మా డైరెక్టర్ శక్తి నాగప్పన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment