న్యూఢిల్లీ: కీలకమైన వైద్య పరికరాల దిగుమతుల కోసం భారత్‌కు చైనా కంటే జపాన్ మెరుగైన ప్రత్యామ్నాయమని మెడికల్ టెక్నాలజీ అసోసియేష్ ఆఫ్ ఇండియా (ఎంటాయ్) పేర్కొంది. ఇతర దేశాల మాదిరే భారత్ సైతం తన మెడికల్ టెక్నాలజీ అవసరాల కోసం ప్రధానంగా అమెరికా, జపాన్, యూరప్, బ్రిటన్, చైనా, సింగపూర్ దేశాలపై ఆధారపడి ఉన్నట్టు గుర్తు చేసింది.
చైనా నుంచి మెడికల్ టెక్నాలజీ దిగుమతుల విలువ పెరుగుతుండడం ఆందోళనకరమని, ప్రాధాన్య ప్రాతిపదికన ప్రత్యామ్నాయాలను గుర్తించాల్సిన అవసరం ఉందని సూచించింది కొన్ని రకాల వైద్య పరికరాలకు భారత్ తగినంత తయారీ సామర్థ్యాన్ని సమకూర్చుకుందని చెబుతూ.. క్లిష్టమైన సాంకేతికతతో కూడిన ఉపకరణాల కోసం దిగుమతులపైనే ఆధారపడి ఉన్నట్టు తెలియజేసింది.
నాణ్యమైన, అత్యాధునిక వైద్య పరికరాల దిగుమతులు కష్టమేమీ కాబోదంటూ.. చైనా నుంచి ఈ తరహా ఉత్పత్తుల విలువ పెరగడం ఒక్కటే ఆందోళన కలిగిస్తున్నట్టు ఎంటాయ్ చెప్పింది. చైనా–భారత్ మధ్య గత మూడేళ్లుగా సరిహద్దు, ద్వైపాక్షిక విభేదాలు నెలకొనడం తెలిసిందే. అయినా కానీ కీలకమైన వైద్య పరికరాల దిగుమతుల విలువ 2020–21లో 327 బిలియన్ డాలర్ల నుంచి 2021–22లో 515 బిలియన్ డాలర్లకు విస్తరించింది.
‘‘వైద్య పరికరాలు, విడిభాగాల దిగుమతులు తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్‌ఐ) కింద పలు ప్రోత్సాహకాలను ఇప్పటికే ప్రకటించడం విలువైన చర్యే. కానీ, ఇది ఫలితాలను ఇవ్వడానికి కొంత సమయం పడుతుంది. ఆలోపు భారత్ అత్యవసరంగా చైనాకు ప్రత్యామ్నాయాలను చూడాలి’’అని ఎంటాయ్ చైర్మన్ పవన్ చౌదరి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment