Medical Association
-
అండగా ఉంటా.. ఆదుకుంటా
మేమంతా సిద్ధం బస్సు యాత్ర చేస్తున్న సీఎం వైఎస్ జగన్ గురువారం డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం గోపాలపురం సెంటర్లో కొద్దిసేపు ఆగి ప్రజలతో మమేకమయ్యారు. తనను కలిసిన పలువురు అనారోగ్య బాధితులకు ‘నేనున్నానంటూ’ భరోసా ఇచ్చారు. వారి సమస్యలను సావధానంగా విని.. అర్జీలు స్వీకరించారు. అండగా ఉంటానంటూ కన్నీళ్లు తుడిచారు. వారంతా సంతోషంతో సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలియచేశారు. –కొత్తపేట/రావులపాలెం జగనన్న న్యాయం చేస్తానన్నారు.. గతేడాది దీపావళి సమయంలో బాణసంచా పేలి నా కుమారుడు వినోద్ కుమార్ కుడిచేతికి తీవ్ర గాయమైంది. మణికట్టు వరకు తొలగించారు. కృత్రిమ చేయి పెట్టించేందుకు అవసరమైన సాయం కోసం ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ద్వారా జగనన్నను కలిశాను. నా బాధ విన్న జగనన్న తప్పకుండా న్యాయం చేస్తానని చెప్పారు. ఈ ఐదేళ్లలో ఆయన అమలు చేసిన పథకాల ద్వారా రూ.4.75 లక్షలు లబ్ధి పొందాం. ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటాం. – పువ్వల చినబాబు, జార్జిపేట, తాళ్లరేవు మండలం అడగకుండానే.. నా కాలికి ఆపరేషన్ చేయిస్తానన్నారు మా కుటుంబానికి సీఎం జగన్ మరో దేవుడు. ఆయన వస్తున్నారని తెలిసి చూద్దామని వచ్చాను. కానీ ఆయన్ని కలిసి మాట్లాడే అదృష్టం దక్కింది. నా పోలియో కాలును చూసిన జగనన్న.. ‘ఏమ్మా ఆపరేషన్ చేయించుకోలేదా’ అని అడిగారు. ఇరవై ఏళ్ల క్రితం చేయించుకున్నాను సార్.. అయినా ప్రయోజనం లేదని చెప్పాను. దీంతో జగనన్న ఆపరేషన్ చేయిస్తానని మాట ఇచ్చారు. అడగకుండానే అన్నీ ఇస్తున్న జగనన్నే మళ్లీ సీఎం కావాలని కోరుకుంటున్నా. – మెరుగు పువ్వు శాంతి, గోపాలపురం, రావులపాలెం మండలం భరోసా దొరికింది.. నాకు గుండె సమస్య ఉంది. ఏడాది కిందట ఒకసారి, ఇటీవల మరోసారి గుండెపోటు రాగా.. కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స చేయించుకొని నిన్ననే డిశ్చార్జ్ అయ్యాను. అయినా ఖరీదైన చికిత్స అవసరమని వైద్యులు చెప్పారు. దీంతో సీఎం జగన్‌ను కలిసి నా బాధ చెప్పుకున్నాను. ఆయన ఆదుకుంటానంటూ భరోసా ఇచ్చారు. – మెర్ల చంద్రరావు, ర్యాలీ, ఆత్రేయపురం మండలం బస్సు ఆపి.. బాధలు తెలుసుకున్న సీఎం రాజమహేంద్రవరం రూరల్/రాజమహేంద్రవరం సిటీ: మేమంతా సిద్ధం బస్సుయాత్ర గురువారం రాత్రి రాజమహేంద్రవరం పరిధిలోని కాతేరులో కొనసాగుతుండగా రోడ్డు పక్కన కొందరు వైద్య సహాయం కోసం వేచి ఉన్నారు. వారిని చూసిన సీఎం జగన్ వెంటనే బస్సు ఆపించారు. ప్రత్యేక కార్యదర్శి ధనుంజయరెడ్డి, ఆరోగ్యశ్రీ ఇన్చార్జి హరికృష్ణను వారి వద్దకు పంపి వివరాలు సేకరించారు. కొంతమూరు అఫీషియల్ కాలనీకి చెందిన బడుగు నర్సశ్రీ తన కుమారుడు సోహిత్ శివకుమార్‌కు కంటి ఆపరేషన్ చేయించినప్పటికీ రెటీనా దెబ్బతినడంతో కంటి చూపుపోయిందన్నారు. కంటిచూపు వచ్చేలా చూడాలని విన్నవించింది. దేవీపట్నం మండలం చిన్నదేవరపేటకు చెందిన బుడ్డిగ శ్రీనివాస్ కీళ్లవాతంతో బాధపడుతున్నాడని అతడి భార్య ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్తకు వైద్య సహాయం చేయాలని వేడుకుంది. రాజమహేంద్రవరంలోని తాడితోట జంక్షన్ వద్ద ఓ కుటుంబం తమ కుమారుడికి వైద్య సహాయం కోసం వేడుకుంది. బస్సులోంచి వారిని గమనించిన సీఎం జగన్ వెంటనే వారిని దగ్గరకు పిలిపించి వివరాలు తెలుసుకున్నారు. రాజమహేంద్రవరంలోని ఇన్నీసుపేటలో గల ముత్యాలమ్మ గుడి వీధికి చెందిన గుర్తుర్తి శ్రీకాంత్ చిరు వ్యాపారి. రెండో కుమారుడు తారకరామ్ ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది పడుతున్నాడు. అతడికి వైద్యం చేయించేందుకు సాయం చేయాలని వారు కోరారు. -
దేశమంతా ఏపీ వైపు చూస్తోంది
ప్రొద్దుటూరు క్రైం: రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న విప్లవాత్మక సంస్కరణల వల్ల వైద్యరంగంలో గొప్ప మార్పులు వచ్చాయని, దేశం మొత్తం ఏపీ వైపు చూస్తోందని ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఏపీఎంఎస్ఐడీసీ) చైర్మన్ డాక్టర్ బి.చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో ఆదివారం ఐఎంఏ ఏపీ స్టేట్ జోన్–3 రీజినల్ అకడమిక్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తీసుకుచ్చిన ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్‌్ట, జగనన్న ఆరోగ్య సురక్ష మెడికల్ క్యాంపులతో ప్రజలకు పూర్తిస్థాయిలో వైద్యం చేరువైందని చెప్పారు. జగనన్న ఆరోగ్య సురక్ష మెడికల్ క్యాంపుల ద్వారా 50 రోజుల్లోనే 60 లక్షల మందికి స్క్రీనింగ్ నిర్వహించడం ప్రపంచంలోనే ఎక్కడా జరగలేదన్నారు. సీఎం నిర్ణయాలతో రాష్ట్రంలో కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రులు బలోపేతమయ్యాయని చెప్పారు. రానున్న రోజుల్లో వైద్యం, ఆరోగ్యం విషయాల్లో మన రాష్ట్రం దేశానికి దిశానిర్దేశం చేస్తుందని తెలిపారు. గతంలో వైద్య రంగానికి సంబంధించి మన రాష్ట్రం కేరళ, తమిళనాడు తదితర రాష్ట్రాల కంటే దిగువన ఉండేదని, ప్రస్తుతం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న చర్యల కారణంగా ఏపీ ముందు వరుసలో ఉందని చెప్పారు. ఐఎంఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఫణీందర్ మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ వల్ల ప్రజలపై వైద్య ఖర్చుల భారం తగ్గుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వం సమీకృత వైద్యాన్ని ప్రవేశపెట్టాలని చూస్తోందని, ఇది మంచిది కాదన్నారు. ఈ కాన్ఫరెన్స్‌లో భాగంగా పలువురు వైద్యులు చేసిన అరుదైన శస్త్రచికిత్సల గురించి వీడియో ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ఐఎంఏ ప్రతినిధులు డాక్టర్ జీవీజీ మహేష్, డాక్టర్ త్యాగరాజరెడ్డి, డాక్టర్ ఇ.సాయిప్రసాద్, డాక్టర్ హేమలత, వసుధ, డాక్టర్ హరీ‹Ùకుమార్, అప్నా ప్రెసిడెంట్ డాక్టర్ ఏవీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు. -
జపాన్ మెరుగైన ప్రత్యామ్నాయం
న్యూఢిల్లీ: కీలకమైన వైద్య పరికరాల దిగుమతుల కోసం భారత్‌కు చైనా కంటే జపాన్ మెరుగైన ప్రత్యామ్నాయమని మెడికల్ టెక్నాలజీ అసోసియేష్ ఆఫ్ ఇండియా (ఎంటాయ్) పేర్కొంది. ఇతర దేశాల మాదిరే భారత్ సైతం తన మెడికల్ టెక్నాలజీ అవసరాల కోసం ప్రధానంగా అమెరికా, జపాన్, యూరప్, బ్రిటన్, చైనా, సింగపూర్ దేశాలపై ఆధారపడి ఉన్నట్టు గుర్తు చేసింది. చైనా నుంచి మెడికల్ టెక్నాలజీ దిగుమతుల విలువ పెరుగుతుండడం ఆందోళనకరమని, ప్రాధాన్య ప్రాతిపదికన ప్రత్యామ్నాయాలను గుర్తించాల్సిన అవసరం ఉందని సూచించింది కొన్ని రకాల వైద్య పరికరాలకు భారత్ తగినంత తయారీ సామర్థ్యాన్ని సమకూర్చుకుందని చెబుతూ.. క్లిష్టమైన సాంకేతికతతో కూడిన ఉపకరణాల కోసం దిగుమతులపైనే ఆధారపడి ఉన్నట్టు తెలియజేసింది. నాణ్యమైన, అత్యాధునిక వైద్య పరికరాల దిగుమతులు కష్టమేమీ కాబోదంటూ.. చైనా నుంచి ఈ తరహా ఉత్పత్తుల విలువ పెరగడం ఒక్కటే ఆందోళన కలిగిస్తున్నట్టు ఎంటాయ్ చెప్పింది. చైనా–భారత్ మధ్య గత మూడేళ్లుగా సరిహద్దు, ద్వైపాక్షిక విభేదాలు నెలకొనడం తెలిసిందే. అయినా కానీ కీలకమైన వైద్య పరికరాల దిగుమతుల విలువ 2020–21లో 327 బిలియన్ డాలర్ల నుంచి 2021–22లో 515 బిలియన్ డాలర్లకు విస్తరించింది. ‘‘వైద్య పరికరాలు, విడిభాగాల దిగుమతులు తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్ఐ) కింద పలు ప్రోత్సాహకాలను ఇప్పటికే ప్రకటించడం విలువైన చర్యే. కానీ, ఇది ఫలితాలను ఇవ్వడానికి కొంత సమయం పడుతుంది. ఆలోపు భారత్ అత్యవసరంగా చైనాకు ప్రత్యామ్నాయాలను చూడాలి’’అని ఎంటాయ్ చైర్మన్ పవన్ చౌదరి పేర్కొన్నారు. -
కనీసం 6 నెలలు బదిలీలు ఆపండి
డాబాగార్డెన్స్(విశాఖ దక్షిణ): వైద్యుల బదిలీల సమయం ఇది కాదని, కనీసం ఆరు నెలలు బదిలీలు అపాలని ఏపీ ప్రభుత్వ డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ పి.శ్యామ్‌సుందర్ ప్రభుత్వాన్ని కోరారు. నగరంలోని ఓ హోటల్లో సోమవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. బదిలీల విషయమై పక్షం రోజులుగా ఎటువంటి ఆందోళనలు చేపట్టకుండా, రోడ్లెక్కి నిరసనలు చేయకుండా, శాంతియుతంగా ప్రజా ప్రతినిధులను కలిసి మొర పెట్టుకున్నా స్పందన రాలేదన్నారు. బదిలీల విషయమై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైద్య సంఘాలతో చర్చించిన తర్వాతే బదిలీల విషయమై నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఆరోగ్యశాఖ అధికారులు సీఎంను తప్పుదోవ పట్టిస్తున్నారని శ్యామ్‌సుందర్ ఆరోపించారు. కేజీహెచ్‌లో ఉన్న 300 మందికి పైగా వైద్యులు ఐదేళ్లు పైబడి ఉన్నారని, వారందరినీ ఒకేసారి బదిలీ చేస్తే వ్యవస్థ తీవ్రంగా నష్టపోతుందన్నారు. ఫలితంగా ప్రజల ప్రాణాలు పోవడమే గాక, ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే ప్రమాదం ఉందని వివరించారు. అసోసియేషన్ విశాఖ అధ్యక్షుడు డాక్టర్ సుందరరాజు, కార్యదర్శి డాక్టర్ బి.రమేష్‌కుమార్ పాల్గొన్నారు. -
సకాలంలో ఆసుపత్రులకు రావాలి : మంత్రి హరీశ్‌రావు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఆసుపత్రులకు వైద్యు లు సకాలంలో హాజరు కావాలని, నిర్ణీత సమయం వరకు ఉండాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వైద్య, ఆరోగ్య మంత్రిగా నియమితులైన ఆయన.. బుధవారం రాత్రి వైద్య ఆరోగ్య శాఖకు చెందిన ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ప్రభుత్వ ఆసుపత్రులకు సకాలంలో వైద్యులు రాకపోవడం, వచ్చినా నిర్ణీత సమయం వరకు ఉండకపోవడం వంటి ఫిర్యాదులు వస్తున్నాయని పేర్కొన్నారు. థర్డ్ వేవ్ పరిస్థితి ఏంటి? రాష్ట్రంలో కరోనా కేసులు ఏ స్థాయిలో నమోదవుతు న్నాయి? థర్డ్‌వేవ్ వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఒకవేళ వస్తే అందుకు తీసుకునే చర్యల గురించి మంత్రి హరీశ్‌రావు అడిగి తెలుసుకున్నారని ఓ అధి కారి తెలిపారు. రాష్ట్రంలో కరోనా పూర్తిగా నియంత్రణలోనే ఉందని, కేసులు తక్కువగానే నమోదవుతున్నాయని అధికారులు వివరించారు. థర్డ్‌వేవ్ వచ్చి నా అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత వేగంగా నిర్వహించాలని మంత్రి ఆదేశించినట్లు తెలిసింది. కాగా, రాష్ట్రంలోని 8 కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటు విషయంలో జాతీయ వైద్య కమిషనర్‌కు దరఖాస్తు చేసినట్లు మంత్రికి వివరించారు. ఆరోగ్యశ్రీ, టీవీవీపీలపై ఆరా... కీలకమైన ఆరోగ్యశ్రీకి ఇన్నాళ్లుగా పూర్తిస్థాయి సీఈవో లేకపోవడంపై ఆయన ఆరా తీసినట్లు తెలిసింది. వైద్య ఆరోగ్య కార్యదర్శి రిజ్వీ ఇన్చార్జి సీఈవోగా కొనసాగడం వల్ల రోజువారీ ఆరోగ్యశ్రీ కార్యకలాపాలకు అవాంతరాలు వస్తున్నాయనే విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన దీనిపై అడిగి తెలుసుకున్నారని సమాచారం. కాగా, తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ)కు కూడా పూర్తిస్థాయి కమిషనర్ లేరు. వైద్య విద్య డైరెక్టర్ (డీఎంఈ) రమేశ్‌రెడ్డి దీనికి ఇన్చార్జిగా ఉన్నారు. దీనిపైనా మంత్రి దృష్టి సారించినట్లు సమాచారం. కాగా, వైద్య ఆరోగ్యశాఖలో ఖాళీ పోస్టులపైనా అడిగి తెలుసుకున్నారని సమాచారం. ‘సమస్యలు పరిష్కరించండి’ వైద్యుల సమస్యలు పరిష్కరించేందుకు వైద్యులతో సమావేశం ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం ప్రతినిధులు హరీశ్‌రావును కోరారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించారని నేతలు తెలిపారు. వైద్య, ఆరోగ్య మంత్రి హరీశ్‌రావును తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం సెంట్రల్ లీగల్ అధ్యక్షుడు పల్లం ప్రవీణ్, తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం (డీహెచ్ విభాగం) అధ్యక్షుడు డాక్టర్ లాలూప్రసాద్ రాథోడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ కల్యాణ్ చక్రవర్తి, గాంధీ మెడికల్ కాలేజీ కార్యదర్శి డాక్టర్ అజ్మీరా రంగా, ఉస్మానియా యూనిట్ ప్రతినిధి డాక్టర్ శేఖర్, డాక్టర్ వినోద్, డాక్టర్ రవి తమ సమస్యలు విన్నవించారు. -
‘చిల్లర’ సమాధానం చెప్పడంతో బైక్ సీజ్ చేసిన పోలీసులు
ధారూరు/వికారాబాద్: లాక్డౌన్ నిబంధనలను అతిక్రమించడమే కాకుండా సిల్లీ సమాధానం చెప్పిన ఓ మెడికల్ షాపు నిర్వాహకుడి బైక్‌ను సీజ్ చేసినట్లు ఎస్ఐ సురేశ్ తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. ధారూరులో మెడికల్ షాపు నిర్వహించే రాజేశ్ ఆదివారం బైక్‌పై వికారాబాద్ వెళ్తుండగా పోలీసులు ఆపి వివరాలు అడిగారు. అయితే మందుల దుకాణంలో చిల్లర లేదని, వికారాబాద్ వెళ్లి తెచ్చుకుంటానని చెప్పడంతో పోలీసులు బైక్‌ను సీజ్ చేశారు. దీన్ని నిరసిస్తూ రాజేశ్ కాలినడకన బయలుదేరాడు. కొద్దిదూరం వెళ్లిన తర్వాత ఈ విషయాన్ని జిల్లా మెడికల్ అసోసియేషన్ సభ్యుల దృష్టికి తీసుకెళ్లడంతో వారు వచ్చి మరో బైక్‌పై అతన్ని ఏఎస్పీ రషీద్ వద్దకు తీసుకెళ్లి ఫిర్యాదు చేశారు. అయితే లాక్డౌన్ అమలులో భాగంగానే పోలీసులు బైక్ సీజ్ చేశారని, పాసులు లేనివారిని అనుమతించేది లేదని ఏఎస్పీ చెప్పారు. ఇదిలా ఉండగా తాను మందుల కోసం వెళ్తున్నానని చెప్పినా పోలీసులు బైక్ ఇవ్వలేదని రాజేశ్ ఆరోపించాడు. (చదవండి: ఓరి నాయనో.. డెలివరీ బాయ్స్‌లా వేషం, బ్యాగ్‌లో ఫుడ్ కూడా!) -
డాక్టర్ ధీశాలి
స్టెతస్కోప్‌కి జెండర్ ఉండదు. తను పరీక్షిస్తున్నది పురుషుడినా, స్త్రీనా స్టెత్ వివక్ష చూపదు. మరి స్టెత్‌ని పట్టుకున్న లేడీ డాక్టర్‌పై ఎందుకింత వివక్ష?! సమాజం ఆమెలో డాక్టర్నే చూస్తున్నా.. డాక్టర్ల సమాజం ఆమెను ఎందుకు స్త్రీగా మాత్రమే చూస్తుంది. అర్థంలేని అలాంటి వివక్షను ఎదుర్కొని నిలిచిన వైద్యురాలే కృష్ణ ప్రశాంతి. స్టెత్‌తో ఆమె వృత్తి బంధానికి ముప్పై ఏళ్లు నిండాయి. ‘ఆడవాళ్లు గైనకాలజీ తీసుకోకుండా జనరల్ ఫిజీషియన్ అవడం ఏంటి’ అని నవ్వింది పురుష సమాజం. డాక్టర్ అంటే దైవంతో సమానం. అయితే డాక్టర్స్ సొసైటీ కూడా ఆడ – మగ స్పష్టమైన విభజన రేఖ గీసి చూస్తుందని అప్పుడే తెలిసింది డాక్టర్ కృష్ణ ప్రశాంతికి. వివక్షలో అది అఆల దశేనని తెలియని ప్రశాంతికి అసలైన వివక్ష ఎంత కరడు గట్టుకుని ఉంటుందో ఆమె మెడికల్ అసోసియేషన్‌కు పోటీ చేసినప్పుడు అర్థమైంది. ఆమె ఐఎంఏ ప్రెసిడెంట్ పదవికి నామినేషన్ వేసినప్పుడు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఐఎంఏ ప్రెసిడెంట్‌గా గెలిచిన తర్వాత కూడా ఆమెకు అప్రతిష్ఠ తీసుకురావడానికి శతవిధాలా ప్రయత్నించారు ప్రత్యర్థులు. ఆమెను భయపెట్టడానికి ఒక రోజు ఆమె క్లినిక్ ముందు దేహం నుంచి నరికేసిన ఒక కాలిని పడేశారు. వైద్యులంటే అంటే ప్రాణం పోసేవాడని మెడిసిన్‌లో తాము నేర్చుకున్నదేమిటి, హోదాల కోసం పోటీలు పడుతున్న కొందరు వైద్యులు చేస్తున్నదేమిటి? ఈ ప్రశ్నలు ఆమెను వేధిస్తున్నాయి. ఐఎంఏ ఎన్నికల్లో తనతో పోటీ చేసిన వాళ్లే ఈ దారుణానికి పాల్పడ్డారని కొన్ని ఆధారాలైతే దొరుకుతున్నాయి. కానీ వాటి ఆధారంగా నిరూపించే ప్రయత్నం చేసుకుంటూ పోతే స్టెత్‌ను పక్కన పెట్టి దర్యాప్తు బాట పట్టాల్సి వస్తుంది. పైగా వాళ్లూ డాక్టర్లే. వైద్యవృత్తి వ్యాపారమయమైందని ఒక వైపు తీవ్రమైన విమర్శలు వస్తున్న ఈ రోజుల్లో డాక్టర్ల మధ్య ఎన్నికలు ఇంత భయానకంగా ఉంటాయని సమాజానికి పని గట్టుకుని చెప్పడం అవసరమా అని ఆలోచించి.. వైద్య వృత్తికి ఉన్న గౌరవాన్ని పలుచబరచకూడదని, తన వంతు ప్రయత్నంగా వైద్యవృత్తి మీద సామాన్యుల్లో గౌరవం పెరిగేలా పని చేయాలని ఆమె గట్టిగా అనుకున్నారు. ఆటుపోట్లమయం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఫిజీషియన్స్ అసోసియేషన్ వైస్ చైర్పర్సన్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న డాక్టర్ పెన్నా కృష్ణప్రశాంతికి జీవితం వడ్డించిన విస్తరి ఏమీ కాదు. పుట్టేటప్పటికి మాత్రం ఆమెది రెడ్‌కార్పెట్ జీవితమే. నాన్న ఇంజనీర్, అమ్మ డాక్టర్. ప్రశాంతి తొలి ప్రయత్నంలోనే 121వ ర్యాంకుతో మెడిసిన్‌లో సీటు తెచ్చుకున్నప్పటి వరకు ఆమెకు కష్టం అనే పదానికి నిర్వచనం తెలియలేదు. తిరుపతి ఎస్వీయూ మెడికల్ కాలేజ్‌లో ఎంబీబీఎస్ పూర్తయింది. పీజీలో చేరినప్పుడు తొలిసారి ‘నువ్వు స్త్రీవి, నీకు ఈ కోర్సులే తగును’ అనే మైండ్ సెట్‌ను చూసింది. ఆమె పీజీలో చేరగానే ‘మీ అమ్మాయిని మా అబ్బాయికి చేసుకుంటాం, మా అబ్బాయి కూడా డాక్టరే’ అంటూ పెళ్లి సంబంధాల తాకిడి మొదలైంది. నాకిప్పుడే పెళ్లి వద్దన్నా సరే, నచ్చచెప్పి పెళ్లి చేసేశారు అమ్మానాన్నలు. ‘ఆడపిల్ల అయినందుకు సర్దుకుపోవాలి’ అనే సమాజం రచించిన రాజ్యాంగం ఒకటి ఆమె మీద అదృశ్యంగా స్వారీ చేసింది. అప్పటి నుంచి అటు కుటుంబ జీవితంలోనూ, ఇటు ప్రొఫెషన్‌లోనూ ఒడిదొడుకులు మొదలయ్యాయి. పుట్టింటి వాళ్లకు – అత్తింటి వాళ్లకు మధ్య విభేదాలొచ్చాయి. ఆ ప్రకంపనలు ప్రశాంతి జీవితంలో ప్రతిధ్వనించాయి. ‘మీ బతుకు మీరే బతకండి’ అన్నారు అత్తింటివాళ్లు. పుస్తకాలు కొనుక్కోవడానికి డబ్బుల్లేని పరిస్థితి ఎదురైంది. కలలో కూడా ఊహించని పరిస్థితి అది. అమ్మ ఫియట్ కారు డ్రైవ్ చేస్తూ ఉంటే, తాను పక్కన కూర్చుని ప్రయాణించిన తన జీవితం నుంచి రూపాయి రూపాయి చూసుకుని ఖర్చు పెట్టుకోవాల్సిన స్థితికి వచ్చింది. అన్ని కష్టాల్లోనూ చదువుని నిర్లక్ష్యం చేయలేదామె. తమిళనాడులోని వేలూరు క్రిస్టియన్ మెడికల్ కాలేజ్‌లో డయాబెటాలజీలో ఫెలోషిప్ కోర్సు కూడా చేశారు ప్రశాంతి. ఆ తర్వాత తాను చదివిన ఎస్వీ మెడికల్ కాలేజ్‌లోనే అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉద్యోగం వచ్చింది. ఇష్టంగా చదువుకునే వాళ్లకు చదువు చెప్పడం కూడా ఇష్టమైన వ్యాపకంగానే ఉంటుంది. అలా టీచింగ్‌ని ఎంజాయ్ చేస్తూ పాఠాలు చెప్పారు డాక్టర్ ప్రశాంతి. ‘భార్యాభర్తలిద్దరమూ సంపాదనలోకి వచ్చేశాం, కాబట్టి ఆర్థిక కష్టాలను ఇట్టే గట్టెక్కవచ్చు’ అని కూడా స్థిమిత పడ్డారామె. ఇక అప్పుడు ఆటుపోట్లు ఉద్యోగంలో మొదలయ్యాయి. ప్రశాంతి పాఠాలతోపాటు ఆమెను కూడా ఇష్టపడే స్టూడెంట్స్ ఖాళీ టైమ్‌లో ఆమె చుట్టూ చేరేవాళ్లు. దాంతో సీనియర్ల దృష్టి పడింది. ప్రశాంతిని టీచింగ్ నుంచి తప్పించారు. ఆమెకు ప్రొటోకాల్ డ్యూటీలు, తిరుమల క్యాంప్ డ్యూటీలు పడ్డాయి. అప్పటికి ఇద్దరు పిల్లలు. క్యాంప్ డ్యూటీలకు వెళ్తే పిల్లల్ని చూసుకునేదెవరు? భర్తది కూడా సెలవులు లేని వైద్య వృత్తే. నా పిల్లల్ని సాకి పెట్టమని అత్తింటి వారిని, పుట్టింటి వారిని అడగ గలిగేట్లు పరిస్థితులు చక్కబడలేదు. దాంతో ఆమె ఉద్యోగానికి రాజీనామా చేయవలసి వచ్చింది. స్టెత్ మళ్లీ చేతికొచ్చిన వేళ! పిల్లలు, ఖర్చులు పోటీ పడి పెరిగిపోతుంటే తాను ఇంట్లో కూర్చుంటే గడిచేదెలా? ప్రశాంతికి జీవితం వేసిన మరో ప్రశ్న అది. ఈ ప్రశ్నకు సమాధానంగా ఓ చిన్న క్లినిక్ తెరిచారామె. రెండు నెలల్లోనే డాక్టర్ ప్రశాంతిగా అందరికీ తెలిసారు. ‘‘ఒక మగవాడు తన ఉద్యోగమో, వ్యాపారమో చేసుకుంటూ ఉంటే.. అతడిని తన బతుకేదో తనని బతకనిస్తుంది సమాజం. ఒక స్త్రీ ఇల్లు దాటి బయటకు వస్తే.. సవాలక్ష ప్రశ్నార్థకపు చూపులు ఆమెను వెంటాడుతుంటాయి. బయటకు వచ్చిన మహిళ కూడా గుంపులో గోవిందమ్మలాగ ఉంటే అంత తీక్షణంగా పట్టించుకోరు. కానీ కొందరిలో ఒకరిగా ఎదుగుతుంటే మాత్రం సహించడం కష్టమే. ఎన్ని రకాలుగా బురద జల్లాలో అన్ని రకాలుగానూ బురద చల్లుతారు. అందుకే చాలామంది మహిళలు బయటకు రావడానికి భయపడుతుంటారు. బయటకు వచ్చినా కూడా అప్పటికే ఆ రంగంలో ఉన్న సవాలక్షలో ఒకరిగా ఉండిపోవడానికే ఇష్టపడుతున్నారు. ఈ పరిస్థితిని అధిగమించాలంటే ఆమెకు ఇంటినుంచి సపోర్టు ఉండాలి. ఇంట్లో వాళ్ల మద్దతు ఉంటే సమాజం బురద చల్లడానికి సాహసించదు’’ అన్నారు కృష్ణ ప్రశాంతి. ఫ్యామిలీ డాక్టర్ ‘‘నాకు ఇష్టమైన టీచింగ్ ప్రొఫెషన్లో స్థిరపడాలనుకున్నాను. కానీ కుదరలేదు. కార్డియాలజీలో డీఎం చేయాలనుకున్నా. అదీ కలగానే మిగిలిపోయింది. ఆసియాలోనే తొలిసారిగా డీఎం న్యూరాలజీ, ఎంసీ హెచ్న్యూరో సర్జన్ చేసిన సూపర్‌స్పెషాలిటీ మహిళ డాక్టర్ ప్రీతికాచారి. నేను ఆ స్థాయిలో పేరు తెచ్చుకోవాలనుకున్నాను, కానీ వీలుపడలేదు. ఆ కొరతను చూసి బాధపడడం కంటే నేను సాధించిన లక్ష్యాలను చూసుకుని సంతృప్తి చెందుతున్నాను. నేనిప్పుడు వేలాది కుటుంబాలకు ఫ్యామిలీ డాక్టర్ని మాత్రమే కాదు వాళ్ల ఫ్యామిలీ మెంబర్ని కూడా. వాళ్ల అనారోగ్యాలతోపాటు ఇంటి సమస్యలు కూడా చెప్పుకుని సలహా అడుగుతుంటారు. తిరుపతిలో స్టేజీ మీద వీణ వాయించిన తొలి డాక్టర్ని నేనే’’ అని కూడా అన్నారామె సంతోషంగా. నేనైతే వందసార్లు చనిపోయి ఉండాలి విద్యార్థులకు ఆమె చెప్పే సూచన ఒక్కటే.. ‘‘ఎన్ని సవాళ్లు ఎదురైనా సరే, జీవితం నుంచి పారిపోకూడదు. ఎదురీదాలి, ఎదురీదడం నేర్చుకోవాలి. కోర్సు నచ్చలేదనో, ర్యాగింగ్ చేశారనో, ఏడిపించారనో, వేధించారనో.. ఇంకో కారణం చేతనో ఆత్మహత్యలకు పాల్పడద్దు.. కష్టాలకు భయపడి వుంటే నేను వంద సార్లు చనిపోయి వుండాలి. ఎన్ని కష్టాలొచ్చినా ప్రాణం వదులు కోవద్దు. చనిపోయాక ఏమీ సాధించలేరు. ఏదైనా బతికే సాధించండి. నా జీవితంలో నేను అనుకున్నవేవీ జరగలేదు. ఇష్టమైన ఎన్నింటినో వదులుకున్నా. ఇష్టం లేకపోయినా కొన్ని పనులు చేయాల్సి వచ్చింది. చేపట్టిన పనిలో నూటికి నూరు శాతం మనవంతు బాధ్యత నిర్వర్తించడం ఒక్కటే మనం చేయాల్సింది. ఏది జరిగినా మన మంచికోసమే అనుకుని ముందుకుపోవాలి అదే జీవితం’’ అని చెప్తుంటారు డాక్టర్ ప్రశాంతి. బాలచంద్ర పున్నాగు, సాక్షి, తిరుపతి ఫొటోలు: మహమ్మద్ రఫీ సంపాదన కోసం రావద్దు మా వారు సిద్ధా హరినాథరెడ్డి జనరల్, ల్యాప్రోస్కోపిక్ సర్జన్. అమ్మాయి కేదార హర్షిత కోలార్‌లో మెడిసిన్ చేస్తోంది. అబ్బాయి నూతన్ సాయి ప్రణీత్ మద్రాస్ మెడికల్ కళాశాలలో ఫస్టియర్. పిల్లల్ని మెడిసిన్ చదవమని మేము ఒత్తిడి చేయలేదు. వాళ్లే వైద్యవృత్తిని ఎంచుకున్నారు. మొత్తానికి మా కుటుంబమంతా వైద్య వృత్తికే అంకితం. వైద్యవృత్తి మీద పరుచుకుంటున్న నీలి నీడల్ని చెరిపేసి, పూర్వ గౌరవాలు తీసుకురావాలనేదే నా కోరిక. సంపాదన కోసమే అయితే ఎన్నో వ్యాపారాలున్నాయి, డబ్బు కోసం ఈ ప్రొఫెషన్లోకి రావద్దని నా పిల్లలకూ చెప్పాను. డాక్టర్ కృష్ణ ప్రశాంతి, వైస్ చైర్పర్సన్, అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్ -
మహిళలు అన్నిరంగాల్లో రాణిస్తున్నారు
సాక్షి, నిజామాబాద్: సమాజంలో మహిళలు అన్నిరంగాల్లో ముందుంటున్నారని, స్వశక్తితో తాము అనుకున్నది సాధిస్తున్నారని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ కవితారెడ్డి పేర్కొన్నారు. శనివారం నగరంలోని గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో మహిళా సాధికారత విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా కవితారెడ్డి మాట్లాడుతూ మహిళలు పురుషుల కంటే మిన్నగా రాణిస్తున్నారని, విద్యతోనే ఇది సాధ్యమని తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ కె.దుబ్బరాజం మాట్లాడుతూ మహిళా ఉద్యోగినులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపి, ప్రస్తుతం మహిళలు ప్రతిఒక్క రంగంలో కీర్తి పతాకాన్ని ఎగురవేస్తున్నారన్నారు. జిల్లా సఖీ కేంద్రం లీగల్ కౌన్సిలర్ భాను ప్రియ మాట్లాడుతూ సఖీ కేంద్రంపై విద్యార్థినులకు విషయ పరిజ్ఞానాన్ని అందించారు. అనంతరం కళాశాల సీనియర్ మహిళా ఉద్యోగినులు, ప్రతిభ చాటిన మహిళా ఉద్యోగినులు, జాతీయ, రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబర్చిన విద్యార్థినులను సన్మానించారు. అనంతరం మహిళా ఉద్యోగినులకు ఆటల పోటీలు, ఇతర క్రీడా పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ ఏ గంగాధర్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామ్స్ డాక్టర్ వేణుప్రసాద్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్స్ డాక్టర్ ఎం సునీత, అధ్యాపకులు డాక్టర్ ఎన్ జ్యోతి, సుమలత, అనసూయ, విజయలక్ష్మీ, హేమలతా, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. -
మెడికల్ అసోసియేషన్ ప్రతినిధుల రిలేదీక్ష
రామాయంపేట: రెవెన్యూ డివిజన్‌కోసం రామాయంపేటలో దీక్షలు కొనసాగుతున్నారుు. 80 రోజులకు చేరుకున్నారుు. ఆదివారంనాటి దీక్షలో మెడికల్ అసోసియేషన్ ప్రతినిధులు వెంకటేశం, యాదగిరి, శ్రీనివాస్, సంతోష్, నరేశ్, నారాయణరెడ్డి, ప్రమోద్, నరేందర్, లింగం, భాను, బాల్‌రెడ్డి, భాస్కర్ పాల్గొన్నారు. దీక్షలకు అఖిలపక్ష కన్వీనర్ వెల్ముల సిద్దరాంలు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి సుప్రభాతరావు, మాజీ ఎంపీపీ రమేశ్‌రెడ్డి, ఇతర నాయకులు తీగల శ్రీనివాసగౌడ్, సుధాకర్‌రెడ్డి, అహ్మద్, చింతల రాములు, చింతల క్రిష్ణ, చింతల స్వామి, వెంకటి, మోతుకు రాజు, శేఖర్, దయానందరెడ్డి, నవాత్ రాజేంద్రప్రసాద్, మంగళి ముత్తయ్య, మర్కు రాములు, బాలచంద్రం, దోమకొండ యాదగిరి మద్దతు తెలిపారు.