హరీశ్‌రావుకు అభినందనలు తెలుపుతున్న ప్రభుత్వ వైద్యుల సంఘం నేతలు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఆసుపత్రులకు వైద్యు లు సకాలంలో హాజరు కావాలని, నిర్ణీత సమయం వరకు ఉండాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వైద్య, ఆరోగ్య మంత్రిగా నియమితులైన ఆయన.. బుధవారం రాత్రి వైద్య ఆరోగ్య శాఖకు చెందిన ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ప్రభుత్వ ఆసుపత్రులకు సకాలంలో వైద్యులు రాకపోవడం, వచ్చినా నిర్ణీత సమయం వరకు ఉండకపోవడం వంటి ఫిర్యాదులు వస్తున్నాయని పేర్కొన్నారు.
థర్డ్ వేవ్ పరిస్థితి ఏంటి?
రాష్ట్రంలో కరోనా కేసులు ఏ స్థాయిలో నమోదవుతు న్నాయి? థర్డ్‌వేవ్ వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఒకవేళ వస్తే అందుకు తీసుకునే చర్యల గురించి మంత్రి హరీశ్‌రావు అడిగి తెలుసుకున్నారని ఓ అధి కారి తెలిపారు. రాష్ట్రంలో కరోనా పూర్తిగా నియంత్రణలోనే ఉందని, కేసులు తక్కువగానే నమోదవుతున్నాయని అధికారులు వివరించారు. థర్డ్‌వేవ్ వచ్చి నా అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత వేగంగా నిర్వహించాలని మంత్రి ఆదేశించినట్లు తెలిసింది. కాగా, రాష్ట్రంలోని 8 కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటు విషయంలో జాతీయ వైద్య కమిషనర్‌కు దరఖాస్తు చేసినట్లు మంత్రికి వివరించారు.
ఆరోగ్యశ్రీ, టీవీవీపీలపై ఆరా...
కీలకమైన ఆరోగ్యశ్రీకి ఇన్నాళ్లుగా పూర్తిస్థాయి సీఈవో లేకపోవడంపై ఆయన ఆరా తీసినట్లు తెలిసింది. వైద్య ఆరోగ్య కార్యదర్శి రిజ్వీ ఇన్‌చార్జి సీఈవోగా కొనసాగడం వల్ల రోజువారీ ఆరోగ్యశ్రీ కార్యకలాపాలకు అవాంతరాలు వస్తున్నాయనే విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన దీనిపై అడిగి తెలుసుకున్నారని సమాచారం. కాగా, తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ)కు కూడా పూర్తిస్థాయి కమిషనర్ లేరు. వైద్య విద్య డైరెక్టర్ (డీఎంఈ) రమేశ్‌రెడ్డి దీనికి ఇన్‌చార్జిగా ఉన్నారు. దీనిపైనా మంత్రి దృష్టి సారించినట్లు సమాచారం. కాగా, వైద్య ఆరోగ్యశాఖలో ఖాళీ పోస్టులపైనా అడిగి తెలుసుకున్నారని సమాచారం.
‘సమస్యలు పరిష్కరించండి’
వైద్యుల సమస్యలు పరిష్కరించేందుకు వైద్యులతో సమావేశం ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం ప్రతినిధులు హరీశ్‌రావును కోరారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించారని నేతలు తెలిపారు. వైద్య, ఆరోగ్య మంత్రి హరీశ్‌రావును తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం సెంట్రల్ లీగల్ అధ్యక్షుడు పల్లం ప్రవీణ్, తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం (డీహెచ్ విభాగం) అధ్యక్షుడు డాక్టర్ లాలూప్రసాద్ రాథోడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ కల్యాణ్ చక్రవర్తి, గాంధీ మెడికల్ కాలేజీ కార్యదర్శి డాక్టర్ అజ్మీరా రంగా, ఉస్మానియా యూనిట్ ప్రతినిధి డాక్టర్ శేఖర్, డాక్టర్ వినోద్, డాక్టర్ రవి తమ సమస్యలు విన్నవించారు.
Comments
Please login to add a commentAdd a comment