పలువురు అనారోగ్య బాధితులకు సీఎం వైఎస్ జగన్ భరోసా
బస్సు ఆపి.. బాధలు తెలుసుకున్న సీఎం
మేమంతా సిద్ధం బస్సు యాత్ర చేస్తున్న సీఎం వైఎస్ జగన్ గురువారం డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం గోపాలపురం సెంటర్‌లో కొద్దిసేపు ఆగి ప్రజలతో మమేకమయ్యారు. తనను కలిసిన పలువురు అనారోగ్య బాధితులకు ‘నేనున్నానంటూ’ భరోసా ఇచ్చారు. వారి సమస్యలను సావధానంగా విని.. అర్జీలు స్వీకరించారు. అండగా ఉంటానంటూ కన్నీళ్లు తుడిచారు. వారంతా సంతోషంతో సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలియచేశారు. –కొత్తపేట/రావులపాలెం
జగనన్న న్యాయం చేస్తానన్నారు..
గతేడాది దీపావళి సమయంలో బాణసంచా పేలి నా కుమారుడు వినోద్ కుమార్ కుడిచేతికి తీవ్ర గాయమైంది. మణికట్టు వరకు తొలగించారు. కృత్రిమ చేయి పెట్టించేందుకు అవసరమైన సాయం కోసం ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ద్వారా జగనన్నను కలిశాను. నా బాధ విన్న జగనన్న తప్పకుండా న్యాయం చేస్తానని చెప్పారు. ఈ ఐదేళ్లలో ఆయన అమలు చేసిన పథకాల ద్వారా రూ.4.75 లక్షలు లబ్ధి పొందాం. ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటాం. – పువ్వల చినబాబు, జార్జిపేట, తాళ్లరేవు మండలం
అడగకుండానే.. నా కాలికి ఆపరేషన్ చేయిస్తానన్నారు
మా కుటుంబానికి సీఎం జగన్ మరో దేవుడు. ఆయన వస్తున్నారని తెలిసి చూద్దామని వచ్చాను. కానీ ఆయన్ని కలిసి మాట్లాడే అదృష్టం దక్కింది. నా పోలియో కాలును చూసిన జగనన్న.. ‘ఏమ్మా ఆపరేషన్ చేయించుకోలేదా’ అని అడిగారు. ఇరవై ఏళ్ల క్రితం చేయించుకున్నాను సార్.. అయినా ప్రయోజనం లేదని చెప్పాను. దీంతో జగనన్న ఆపరేషన్ చేయిస్తానని మాట ఇచ్చారు. అడగకుండానే అన్నీ ఇస్తున్న జగనన్నే మళ్లీ సీఎం కావాలని కోరుకుంటున్నా. – మెరుగు పువ్వు శాంతి, గోపాలపురం, రావులపాలెం మండలం
భరోసా దొరికింది..
నాకు గుండె సమస్య ఉంది. ఏడాది కిందట ఒకసారి, ఇటీవల మరోసారి గుండెపోటు రాగా.. కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స చేయించుకొని నిన్ననే డిశ్చార్జ్ అయ్యాను. అయినా ఖరీదైన చికిత్స అవసరమని వైద్యులు చెప్పారు. దీంతో సీఎం జగన్‌ను కలిసి నా బాధ చెప్పుకున్నాను. ఆయన ఆదుకుంటానంటూ భరోసా ఇచ్చారు. – మెర్ల చంద్రరావు, ర్యాలీ, ఆత్రేయపురం మండలం
బస్సు ఆపి.. బాధలు తెలుసుకున్న సీఎం
రాజమహేంద్రవరం రూరల్/రాజమహేంద్రవరం సిటీ: మేమంతా సిద్ధం బస్సుయాత్ర గురువారం రాత్రి రాజమహేంద్రవరం పరిధిలోని కాతేరులో కొనసాగుతుండగా రోడ్డు పక్కన కొందరు వైద్య సహాయం కోసం వేచి ఉన్నారు. వారిని చూసిన సీఎం జగన్ వెంటనే బస్సు ఆపించారు. ప్రత్యేక కార్యదర్శి ధనుంజయరెడ్డి, ఆరోగ్యశ్రీ ఇన్‌చార్జి హరికృష్ణను వారి వద్దకు పంపి వివరాలు సేకరించారు.
కొంతమూరు అఫీషియల్ కాలనీకి చెందిన బడుగు నర్సశ్రీ తన కుమారుడు సోహిత్ శివకుమార్‌కు కంటి ఆపరేషన్ చేయించినప్పటికీ రెటీనా దెబ్బతినడంతో కంటి చూపుపోయిందన్నారు. కంటిచూపు వచ్చేలా చూడాలని విన్నవించింది. దేవీపట్నం మండలం చిన్నదేవరపేటకు చెందిన బుడ్డిగ శ్రీనివాస్ కీళ్లవాతంతో బాధపడుతున్నాడని అతడి భార్య ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్తకు వైద్య సహాయం చేయాలని వేడుకుంది.
రాజమహేంద్రవరంలోని తాడితోట జంక్షన్ వద్ద ఓ కుటుంబం తమ కుమారుడికి వైద్య సహాయం కోసం వేడుకుంది. బస్సులోంచి వారిని గమనించిన సీఎం జగన్ వెంటనే వారిని దగ్గరకు పిలిపించి వివరాలు తెలుసుకున్నారు. రాజమహేంద్రవరంలోని ఇన్నీసుపేటలో గల ముత్యాలమ్మ గుడి వీధికి చెందిన గుర్తుర్తి శ్రీకాంత్ చిరు వ్యాపారి. రెండో కుమారుడు తారకరామ్ ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది పడుతున్నాడు. అతడికి వైద్యం చేయించేందుకు సాయం చేయాలని వారు కోరారు.
Comments
Please login to add a commentAdd a comment