డాక్టర్‌ ధీశాలి | Dr P Krishna Prasanthi Elected as Vice President of the AP State Physicians Association | Sakshi
Sakshi News home page

డాక్టర్‌ ధీశాలి

Published Wed, Sep 25 2019 1:08 AM | Last Updated on Wed, Sep 25 2019 1:08 AM

Dr P Krishna Prasanthi Elected as Vice President of the AP State Physicians Association  - Sakshi

స్టెతస్కోప్‌కి జెండర్‌ ఉండదు. తను పరీక్షిస్తున్నది పురుషుడినా, స్త్రీనా స్టెత్‌ వివక్ష చూపదు. మరి స్టెత్‌ని పట్టుకున్న లేడీ డాక్టర్‌పై ఎందుకింత వివక్ష?! సమాజం ఆమెలో డాక్టర్‌నే చూస్తున్నా.. డాక్టర్‌ల సమాజం ఆమెను ఎందుకు స్త్రీగా మాత్రమే చూస్తుంది. అర్థంలేని అలాంటి వివక్షను ఎదుర్కొని నిలిచిన వైద్యురాలే కృష్ణ ప్రశాంతి.

స్టెత్‌తో ఆమె వృత్తి బంధానికి ముప్పై ఏళ్లు నిండాయి. ‘ఆడవాళ్లు గైనకాలజీ తీసుకోకుండా జనరల్‌ ఫిజీషియన్‌ అవడం ఏంటి’ అని నవ్వింది పురుష సమాజం. డాక్టర్‌ అంటే దైవంతో సమానం. అయితే డాక్టర్స్‌ సొసైటీ కూడా ఆడ – మగ స్పష్టమైన విభజన రేఖ గీసి చూస్తుందని అప్పుడే తెలిసింది డాక్టర్‌ కృష్ణ ప్రశాంతికి.  వివక్షలో అది అఆల దశేనని తెలియని ప్రశాంతికి అసలైన వివక్ష ఎంత కరడు గట్టుకుని ఉంటుందో ఆమె మెడికల్‌ అసోసియేషన్‌కు పోటీ చేసినప్పుడు అర్థమైంది. ఆమె ఐఎంఏ ప్రెసిడెంట్‌ పదవికి నామినేషన్‌ వేసినప్పుడు బెదిరింపు కాల్స్‌ వచ్చాయి. ఐఎంఏ ప్రెసిడెంట్‌గా గెలిచిన తర్వాత కూడా ఆమెకు అప్రతిష్ఠ తీసుకురావడానికి శతవిధాలా ప్రయత్నించారు ప్రత్యర్థులు. ఆమెను భయపెట్టడానికి ఒక రోజు ఆమె క్లినిక్‌ ముందు దేహం నుంచి నరికేసిన ఒక కాలిని పడేశారు.

వైద్యులంటే అంటే ప్రాణం పోసేవాడని మెడిసిన్‌లో తాము నేర్చుకున్నదేమిటి, హోదాల కోసం పోటీలు పడుతున్న కొందరు వైద్యులు చేస్తున్నదేమిటి? ఈ ప్రశ్నలు ఆమెను వేధిస్తున్నాయి. ఐఎంఏ ఎన్నికల్లో తనతో పోటీ చేసిన వాళ్లే ఈ దారుణానికి పాల్పడ్డారని కొన్ని ఆధారాలైతే దొరుకుతున్నాయి. కానీ వాటి ఆధారంగా నిరూపించే ప్రయత్నం చేసుకుంటూ పోతే స్టెత్‌ను పక్కన పెట్టి దర్యాప్తు బాట పట్టాల్సి వస్తుంది. పైగా వాళ్లూ డాక్టర్లే. వైద్యవృత్తి వ్యాపారమయమైందని ఒక వైపు తీవ్రమైన విమర్శలు వస్తున్న ఈ రోజుల్లో డాక్టర్ల మధ్య ఎన్నికలు ఇంత భయానకంగా ఉంటాయని సమాజానికి పని గట్టుకుని చెప్పడం అవసరమా అని ఆలోచించి.. వైద్య వృత్తికి ఉన్న గౌరవాన్ని పలుచబరచకూడదని, తన వంతు ప్రయత్నంగా వైద్యవృత్తి మీద సామాన్యుల్లో గౌరవం పెరిగేలా పని చేయాలని ఆమె గట్టిగా అనుకున్నారు.

ఆటుపోట్లమయం
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ ఫిజీషియన్స్‌ అసోసియేషన్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న డాక్టర్‌ పెన్నా కృష్ణప్రశాంతికి జీవితం వడ్డించిన విస్తరి ఏమీ కాదు. పుట్టేటప్పటికి మాత్రం ఆమెది రెడ్‌కార్పెట్‌ జీవితమే. నాన్న ఇంజనీర్, అమ్మ డాక్టర్‌. ప్రశాంతి తొలి ప్రయత్నంలోనే 121వ ర్యాంకుతో మెడిసిన్‌లో సీటు తెచ్చుకున్నప్పటి వరకు ఆమెకు కష్టం అనే పదానికి నిర్వచనం తెలియలేదు. తిరుపతి ఎస్వీయూ మెడికల్‌ కాలేజ్‌లో ఎంబీబీఎస్‌ పూర్తయింది. పీజీలో చేరినప్పుడు తొలిసారి ‘నువ్వు స్త్రీవి, నీకు ఈ కోర్సులే తగును’ అనే మైండ్‌ సెట్‌ను చూసింది. ఆమె పీజీలో చేరగానే ‘మీ అమ్మాయిని మా అబ్బాయికి చేసుకుంటాం, మా అబ్బాయి కూడా డాక్టరే’ అంటూ పెళ్లి సంబంధాల తాకిడి మొదలైంది. నాకిప్పుడే పెళ్లి వద్దన్నా సరే, నచ్చచెప్పి పెళ్లి చేసేశారు అమ్మానాన్నలు. ‘ఆడపిల్ల అయినందుకు సర్దుకుపోవాలి’ అనే సమాజం రచించిన రాజ్యాంగం ఒకటి ఆమె మీద అదృశ్యంగా స్వారీ చేసింది. అప్పటి నుంచి అటు కుటుంబ జీవితంలోనూ, ఇటు ప్రొఫెషన్‌లోనూ ఒడిదొడుకులు మొదలయ్యాయి. పుట్టింటి వాళ్లకు – అత్తింటి వాళ్లకు మధ్య విభేదాలొచ్చాయి. ఆ ప్రకంపనలు ప్రశాంతి జీవితంలో ప్రతిధ్వనించాయి.

‘మీ బతుకు మీరే బతకండి’ అన్నారు అత్తింటివాళ్లు. పుస్తకాలు కొనుక్కోవడానికి డబ్బుల్లేని పరిస్థితి ఎదురైంది. కలలో కూడా ఊహించని పరిస్థితి అది. అమ్మ ఫియట్‌ కారు డ్రైవ్‌ చేస్తూ ఉంటే, తాను పక్కన కూర్చుని ప్రయాణించిన తన జీవితం నుంచి రూపాయి రూపాయి చూసుకుని ఖర్చు పెట్టుకోవాల్సిన స్థితికి వచ్చింది. అన్ని కష్టాల్లోనూ చదువుని నిర్లక్ష్యం చేయలేదామె. తమిళనాడులోని వేలూరు క్రిస్టియన్‌ మెడికల్‌ కాలేజ్‌లో డయాబెటాలజీలో ఫెలోషిప్‌ కోర్సు కూడా చేశారు ప్రశాంతి. ఆ తర్వాత తాను చదివిన ఎస్వీ మెడికల్‌ కాలేజ్‌లోనే అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా ఉద్యోగం వచ్చింది. ఇష్టంగా చదువుకునే వాళ్లకు చదువు చెప్పడం కూడా ఇష్టమైన వ్యాపకంగానే ఉంటుంది. అలా టీచింగ్‌ని ఎంజాయ్‌ చేస్తూ పాఠాలు చెప్పారు డాక్టర్‌ ప్రశాంతి.

‘భార్యాభర్తలిద్దరమూ సంపాదనలోకి వచ్చేశాం, కాబట్టి ఆర్థిక కష్టాలను ఇట్టే గట్టెక్కవచ్చు’ అని కూడా స్థిమిత పడ్డారామె. ఇక అప్పుడు ఆటుపోట్లు ఉద్యోగంలో మొదలయ్యాయి. ప్రశాంతి పాఠాలతోపాటు ఆమెను కూడా ఇష్టపడే స్టూడెంట్స్‌ ఖాళీ టైమ్‌లో ఆమె చుట్టూ చేరేవాళ్లు. దాంతో సీనియర్‌ల దృష్టి పడింది. ప్రశాంతిని టీచింగ్‌ నుంచి తప్పించారు. ఆమెకు ప్రొటోకాల్‌ డ్యూటీలు, తిరుమల క్యాంప్‌ డ్యూటీలు పడ్డాయి. అప్పటికి ఇద్దరు పిల్లలు. క్యాంప్‌ డ్యూటీలకు వెళ్తే పిల్లల్ని చూసుకునేదెవరు? భర్తది కూడా సెలవులు లేని వైద్య వృత్తే. నా పిల్లల్ని సాకి పెట్టమని అత్తింటి వారిని, పుట్టింటి వారిని అడగ గలిగేట్లు పరిస్థితులు చక్కబడలేదు. దాంతో ఆమె  ఉద్యోగానికి రాజీనామా చేయవలసి వచ్చింది.

స్టెత్‌ మళ్లీ చేతికొచ్చిన వేళ!
పిల్లలు, ఖర్చులు పోటీ పడి పెరిగిపోతుంటే తాను ఇంట్లో కూర్చుంటే గడిచేదెలా? ప్రశాంతికి జీవితం వేసిన మరో ప్రశ్న అది. ఈ ప్రశ్నకు సమాధానంగా ఓ చిన్న క్లినిక్‌ తెరిచారామె. రెండు నెలల్లోనే డాక్టర్‌ ప్రశాంతిగా అందరికీ తెలిసారు. ‘‘ఒక మగవాడు తన ఉద్యోగమో, వ్యాపారమో చేసుకుంటూ ఉంటే.. అతడిని తన బతుకేదో తనని బతకనిస్తుంది సమాజం. ఒక స్త్రీ ఇల్లు దాటి బయటకు వస్తే.. సవాలక్ష ప్రశ్నార్థకపు చూపులు ఆమెను వెంటాడుతుంటాయి. బయటకు వచ్చిన మహిళ కూడా గుంపులో గోవిందమ్మలాగ ఉంటే అంత తీక్షణంగా పట్టించుకోరు. కానీ కొందరిలో ఒకరిగా ఎదుగుతుంటే మాత్రం సహించడం కష్టమే. ఎన్ని రకాలుగా బురద జల్లాలో అన్ని రకాలుగానూ బురద చల్లుతారు. అందుకే చాలామంది మహిళలు బయటకు రావడానికి భయపడుతుంటారు. బయటకు వచ్చినా కూడా అప్పటికే ఆ రంగంలో ఉన్న సవాలక్షలో ఒకరిగా ఉండిపోవడానికే ఇష్టపడుతున్నారు. ఈ పరిస్థితిని అధిగమించాలంటే ఆమెకు ఇంటినుంచి సపోర్టు ఉండాలి. ఇంట్లో వాళ్ల మద్దతు ఉంటే సమాజం బురద చల్లడానికి సాహసించదు’’ అన్నారు కృష్ణ ప్రశాంతి.

ఫ్యామిలీ డాక్టర్‌
‘‘నాకు ఇష్టమైన టీచింగ్‌ ప్రొఫెషన్‌లో స్థిరపడాలనుకున్నాను. కానీ కుదరలేదు. కార్డియాలజీలో డీఎం చేయాలనుకున్నా. అదీ కలగానే మిగిలిపోయింది. ఆసియాలోనే తొలిసారిగా డీఎం న్యూరాలజీ, ఎంసీ హెచ్‌న్యూరో సర్జన్‌ చేసిన సూపర్‌స్పెషాలిటీ మహిళ డాక్టర్‌ ప్రీతికాచారి. నేను ఆ స్థాయిలో పేరు తెచ్చుకోవాలనుకున్నాను, కానీ వీలుపడలేదు. ఆ కొరతను చూసి బాధపడడం కంటే నేను సాధించిన లక్ష్యాలను చూసుకుని సంతృప్తి చెందుతున్నాను. నేనిప్పుడు వేలాది కుటుంబాలకు ఫ్యామిలీ డాక్టర్‌ని మాత్రమే కాదు వాళ్ల ఫ్యామిలీ మెంబర్‌ని కూడా. వాళ్ల అనారోగ్యాలతోపాటు ఇంటి సమస్యలు కూడా చెప్పుకుని సలహా అడుగుతుంటారు. తిరుపతిలో స్టేజీ మీద వీణ వాయించిన తొలి డాక్టర్‌ని నేనే’’ అని కూడా అన్నారామె సంతోషంగా.

నేనైతే వందసార్లు చనిపోయి ఉండాలి
విద్యార్థులకు ఆమె చెప్పే సూచన ఒక్కటే.. ‘‘ఎన్ని సవాళ్లు ఎదురైనా సరే, జీవితం నుంచి పారిపోకూడదు. ఎదురీదాలి, ఎదురీదడం నేర్చుకోవాలి. కోర్సు నచ్చలేదనో, ర్యాగింగ్‌ చేశారనో, ఏడిపించారనో, వేధించారనో.. ఇంకో కారణం చేతనో ఆత్మహత్యలకు పాల్పడద్దు.. కష్టాలకు భయపడి వుంటే నేను వంద సార్లు చనిపోయి వుండాలి. ఎన్ని కష్టాలొచ్చినా ప్రాణం వదులు కోవద్దు. చనిపోయాక ఏమీ సాధించలేరు. ఏదైనా బతికే సాధించండి. నా జీవితంలో నేను అనుకున్నవేవీ జరగలేదు. ఇష్టమైన ఎన్నింటినో వదులుకున్నా. ఇష్టం లేకపోయినా కొన్ని పనులు చేయాల్సి వచ్చింది. చేపట్టిన పనిలో నూటికి నూరు శాతం మనవంతు బాధ్యత నిర్వర్తించడం ఒక్కటే మనం చేయాల్సింది. ఏది జరిగినా మన మంచికోసమే అనుకుని ముందుకుపోవాలి అదే జీవితం’’ అని చెప్తుంటారు డాక్టర్‌ ప్రశాంతి.
బాలచంద్ర పున్నాగు, సాక్షి, తిరుపతి
ఫొటోలు: మహమ్మద్‌ రఫీ


సంపాదన కోసం రావద్దు
మా వారు సిద్ధా హరినాథరెడ్డి జనరల్, ల్యాప్రోస్కోపిక్‌ సర్జన్‌. అమ్మాయి కేదార హర్షిత కోలార్‌లో మెడిసిన్‌ చేస్తోంది. అబ్బాయి నూతన్‌ సాయి ప్రణీత్‌ మద్రాస్‌ మెడికల్‌ కళాశాలలో ఫస్టియర్‌. పిల్లల్ని మెడిసిన్‌ చదవమని మేము ఒత్తిడి చేయలేదు. వాళ్లే  వైద్యవృత్తిని ఎంచుకున్నారు. మొత్తానికి మా కుటుంబమంతా వైద్య వృత్తికే అంకితం. వైద్యవృత్తి మీద పరుచుకుంటున్న నీలి నీడల్ని చెరిపేసి, పూర్వ గౌరవాలు తీసుకురావాలనేదే నా కోరిక. సంపాదన కోసమే అయితే ఎన్నో వ్యాపారాలున్నాయి, డబ్బు కోసం ఈ ప్రొఫెషన్‌లోకి రావద్దని నా పిల్లలకూ చెప్పాను.

డాక్టర్‌ కృష్ణ ప్రశాంతి, వైస్‌ చైర్‌పర్సన్,
అసోసియేషన్‌ ఆఫ్‌ ఫిజీషియన్స్‌
ఆఫ్‌ ఇండియా, ఆంధ్రప్రదేశ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement