కవితారెడ్డిని సన్మానిస్తున్న ప్రతినిధులు
సాక్షి, నిజామాబాద్: సమాజంలో మహిళలు అన్నిరంగాల్లో ముందుంటున్నారని, స్వశక్తితో తాము అనుకున్నది సాధిస్తున్నారని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ కవితారెడ్డి పేర్కొన్నారు. శనివారం నగరంలోని గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో మహిళా సాధికారత విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా కవితారెడ్డి మాట్లాడుతూ మహిళలు పురుషుల కంటే మిన్నగా రాణిస్తున్నారని, విద్యతోనే ఇది సాధ్యమని తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ కె.దుబ్బరాజం మాట్లాడుతూ మహిళా ఉద్యోగినులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపి, ప్రస్తుతం మహిళలు ప్రతిఒక్క రంగంలో కీర్తి పతాకాన్ని ఎగురవేస్తున్నారన్నారు. జిల్లా సఖీ కేంద్రం లీగల్ కౌన్సిలర్ భాను ప్రియ మాట్లాడుతూ సఖీ కేంద్రంపై విద్యార్థినులకు విషయ పరిజ్ఞానాన్ని అందించారు. అనంతరం కళాశాల సీనియర్ మహిళా ఉద్యోగినులు, ప్రతిభ చాటిన మహిళా ఉద్యోగినులు, జాతీయ, రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబర్చిన విద్యార్థినులను సన్మానించారు. అనంతరం మహిళా ఉద్యోగినులకు ఆటల పోటీలు, ఇతర క్రీడా పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ ఏ గంగాధర్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామ్స్ డాక్టర్ వేణుప్రసాద్, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్స్ డాక్టర్ ఎం సునీత, అధ్యాపకులు డాక్టర్ ఎన్ జ్యోతి, సుమలత, అనసూయ, విజయలక్ష్మీ, హేమలతా, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment