సాక్షి, హైదరాబాద్: వైద్య పరికరాల మార్కెట్‌లో ప్రపంచంలోనే టాప్–20లో భారత్ నాలుగో స్థానంలో ఉందని, ఈ పరిశ్రమకు మరింత ఊతమివ్వాల ని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు మంగళవారం ఆయన కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌కు లేఖ రాశారు. ఈ సందర్భంగా దేశంలో వైద్య పరికరాల పరిశ్రమను బలోపేతం చేయాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. గత ఫిబ్రవరిలో హైదరాబాద్‌లో బయో ఆసియా 20వ వార్షికోత్సవ ఎడిషన్‌ను విజయవంతంగా నిర్వహించిన విషయాన్ని తెలియజేశారు.
ఇందులో భాగంగా వైద్య పరికరాల అంశంపై నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో వివిధ కంపెనీల సీఈవోలు, వైద్యరంగ నిపుణులు, అసోసియేషన్ ప్రతినిధులు లేవనెత్తిన అంశాలను లేఖలో ఆయన కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. జీఎస్టీ కారణంగా వైద్య పరికరాల పరిశ్రమ ఎదుర్కొంటున్న పరిణామాలు, ప్రత్యామ్నాయ దిగుమతి విధానాలు, మేక్ ఇన్ ఇండియాపై విలోమ సుంకం ప్రభావం, మౌలిక సదుపాయాలు, ముడిసరుకు లభ్యత మొదలైన అంశాలను ఆయన కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
ప్రస్తుతం కస్టమ్ డ్యూటీతోపాటు వైద్య పరికరాల విడిభాగాలపై జీఎస్టీ కూడా పరికరాల కంటే ఎక్కువ రేటుతో వసూలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా, దేశంలోని వైద్య పరికరాల ధరలపై ప్రతికూల ప్రభావం చూపుతుందన్నారు. ప్రజలకు తక్కువ ధరకే వైద్యం అందించాలన్న దేశ మౌలిక లక్ష్యానికి భిన్నంగా ఇది ఉందన్నారు. ‘వైద్య పరికరాలు విలాసవంతమైన వస్తువులు కావు. ఆరోగ్య సంరక్షణను అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి పరికరాలు, డయాగ్నొíస్టిక్స్ కీలకమని గుర్తించాలి. వైద్య పరికరాలు, డయాగ్నస్టిక్స్‌పై ప్రస్తుతం విధిస్తున్న 18% జీఎస్టీని తగ్గించాలి.
వైద్య పరికరాలపై 12%, డయాగ్నొస్టిక్స్‌పై 5 శాతం మేరకు జీఎస్టీని తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా’అని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌కు మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లు, ఇతర ఎల్రక్టానిక్ భాగాలు, ఎల్‌ఈడీ మానిటర్లు, ప్యానెల్ డిస్‌ప్లే యూనిట్లు, బ్యాటరీ, సెమీకండక్టర్లు, మెకాట్రానిక్స్ మొదలైన వైద్య పరికరాల విడిభాగాల తయారీలో దేశీయ పరిశ్రమలను ప్రోత్సహించడానికి తీసుకోవలసిన చర్యలను వివరించారు. దీన్ని ప్రోత్సహించేందుకు హైదరాబాద్‌లో అధునాతన పరికరాలు యంత్రాలతో మెడికల్ ఇమేజింగ్ హబ్‌ను, మెడికల్ డివైజెస్ పార్క్‌ను కేంద్రం భాగస్వామ్యంతో ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు కేటీఆర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment