సీఎం రేవంత్‌కు లేఖలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
దొడ్డు వడ్లకు కూడా రూ.500 బోనస్ ప్రకటించాలని డిమాండ్
లేకపోతే రైతుల తరఫున పోరాడతామని స్పష్టీకరణ
సాక్షి, హైదరాబాద్: మూసీ సుందరీకరణ పేరిట అవినీతి ఆలోచనలు మానుకొని ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టి పెట్టాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు హితవు పలికారు. మూసీ ప్రక్షాళన కోసం రూ. లక్షన్నర కోట్లు ఖర్చు పెడతామంటున్న ముఖ్యమంత్రికి రైతు భరోసా, దొడ్డు వడ్లకు బోనస్ ఇచ్చేందుకు డబ్బులు లేవా? అని ప్రశ్నించారు. రాష్ట్ర రైతాంగానికి ఇచ్చిన హామీలపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ దుయ్యబట్టారు.
ఈ మేరకు సీఎం రేవంత్‌కు కేటీఆర్ శుక్రవారం లేఖ రాశారు. సీఎం నిర్వహించిన వ్యవసాయ సమీక్షలో దొడ్డు వడ్లకు రూ. 500 బోనస్, వర్షాకాలంలో రైతు భరోసా వంటి అంశాలపై చర్చించలేదని విమర్శించారు. గత సీజన్‌లోనూ రైతులకు వరి ధాన్యంపై బోనస్ చెల్లించకుండా ప్రభుత్వం మోసగించిందని ఆరోపించారు. కేవలం సన్న వడ్లకే బోనస్ ఇస్తామనే ప్రకటనతో రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. 80 శాతం మంది రైతులు దొడ్డు వడ్లు పండిస్తారని తెలిసి కూడా కేవలం సన్న వడ్లకే ప్రభుత్వం బోనస్ ఇస్తామని ప్రకటించడం సరికాదన్నారు. దొడ్డు వడ్లకు కూడా బోనస్ ఇవ్వకుంటే రైతుల తరఫున బీఆర్‌ఎస్ పోరాడుతుందని కేటీఆర్ హెచ్చరించారు.
రైతు భరోసా సంగతి తేల్చండి: వానాకాలం సీజన్ పూర్తయినా ప్రభు త్వం రైతు భరోసా సంగతి తేల్చడం లేదని కేటీఆర్ లేఖలో మండిపడ్డారు. రైతుబంధు పథకం పేరును రైతు భరోసాగా మార్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఎకరాకు రూ. 15 వేలు ఇస్తామనే హామీని విస్మరించిందని, నేటికీ రైతులకు పెట్టుబడి సాయం అందించలేదని దుయ్యబట్టారు. రైతులకు బాకీ పడిన రైతు భరోసాను వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 100 శాతం రుణమాఫీ చేస్తామని ప్రకటించినా 20 లక్షల మంది రైతులకు నేటికీ మాఫీ వర్తించలేదన్నారు. ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు అవుతున్నా రైతులకు మేలు జరగట్లేదని.. రేవంత్ చేతకానితనం అన్నదాతలకు శాపంగా మారిందని కేటీఆర్ ధ్వజమెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment