మెడ్‌టెక్ జోన్ తయారు చేసిన సూపర్ కండక్టింగ్ మాగ్నెట్స్
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: వైద్య ఉపకరణాల ఉత్పత్తికి వేదికగా నిలుస్తూ ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చుకున్న ఆంధ్రప్రదేశ్ మెడ్‌టెక్ జోన్ మరో అత్యాధునిక ఆవిష్కరణకు కేంద్ర బిందువుగా మారింది. ఎంఆర్‌ఐ పరికరాల్లో ఉపయోగించే మాగ్నెట్స్‌లో అత్యుత్తమ ఫలితాలను తక్కువ కాలంలోనే అందించేలా సూపర్ కండక్టింగ్ మాగ్నెట్స్‌ని తయారు చేసింది. మెడ్‌టెక్ జోన్ నుంచే పరికరాల ఉత్పత్తి, పరీక్షలు, అభివృద్ధి జరగడం దేశంలోనే తొలిసారి కావడం విశేషం.
మాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్(ఎంఆర్‌ఐ)ని అత్యంత శక్తివంతమైన అయస్కాంత క్షేత్రం, రేడియో తరంగాలను ఉపయోగించడంపై ఆధారపడి ఉంటుంది. ఛాతీ, ఉదరం, మెదడు, వెన్నెముక లేదా కటి ప్రాంతంతో సంబంధం ఉన్న అనేక భాగాల ఆరోగ్య స్థితిగతుల్ని తెలుసుకునేందుకు ఎంఆర్‌ఐ తీస్తారు. ఎంఆర్‌ఐ స్కానర్ల నుంచి వచ్చే అయస్కాంత క్షేత్రాలు, రేడియో తరంగాలు శరీర కణజాలాల్లో ఉండే ప్రోటాలతో జరిపే పరస్పర చర్య ద్వారా ఆ భాగానికి సంబంధించిన చిత్రాన్ని తీస్తుంది.
ఈ స్కాన్ ఆధారంగా.. ఆరోగ్య సమస్యల్ని వైద్యులు నిర్థారిస్తుంటారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 1.5 టెస్లా ఎంఆర్‌ఐ కండక్టింగ్ మాగ్నెట్స్‌ని మాత్రమే వినియోగిస్తున్నారు. కానీ.. ఏపీ మెడ్‌టెక్ జోన్‌లో మాత్రం ఎంఆర్‌ఐలలో అత్యంత కీలకమైన పరికరంగా పరిగణించే సూపర్ కండక్టింగ్ మాగ్నెట్స్‌ని మరింత శక్తివంతంగా తయారు చేశారు. దీని ద్వారా ఎంఆర్‌ఐ స్కానింగ్ తీసే సమయం మరింత తగ్గే అవకాశం ఉందని మెడ్‌టెక్ వర్గాలు వెల్లడించాయి.
దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ సూపర్ కండక్టింగ్ మాగ్నెట్స్‌ని ఉత్పత్తి చేయడమే కాకుండా.. మెడ్‌టెక్ జోన్‌లోనే పరీక్షలు నిర్వహించడంతో పాటు.. పరికరాలనూ అభివృద్ధి చేశారు. ఎంఆర్‌ఐ స్కానర్‌ను తయారు చేసే అసలు తయారీదారులకు అత్యంత కీలక భాగమైన సూపర్ కండక్టింగ్ మాగ్నెట్స్‌ని విశాఖ నుంచే ఎగుమతి చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment