8 రోజులు ఉన్నా.. పరిస్థితిని నేనే చక్కదిద్దా
నేను గతంలో ఓడిపోయిన తర్వాత మెడ్‌టెక్ జోన్‌కి ఇబ్బందులు సృష్టించారు
మొదటిసారి సీఎం అయినప్పుడు ఐటీ పార్క్ క్రియేట్ చేశాను
రెండోసారి సీఎం అయ్యాక బయోటెక్నాలజీ పార్క్ క్రియేట్ చేశాను
మూడోసారి సీఎం అయ్యాక మెడికల్ ఎక్విప్‌మెంట్ మాన్యుఫాక్చరింగ్ సిస్టమ్ క్రియేట్ చేశాను
డ్రోన్లతో దోమల్ని నాశనం చేసే టెక్నాలజీ తీసుకొచ్చాను
బెంగళూరు ఎయిర్‌పోర్టు సమీపంలో అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నాం
ట్రిపుల్ ఐటీల్ని నేనే ప్రారంభించా.. సీఐఐ, ఏపీ మెడ్‌టెక్ జోన్ సదస్సులో చంద్రబాబు
వలంటీర్లతో పనేముందని అధికారుల సమీక్షలో వ్యాఖ్య
సాక్షి, విశాఖపట్నం/సాక్షి, అనకాపల్లి: ‘కోవిడ్ సమయంలో విశాఖలోనే ఉన్నా. పరిస్థితిని చక్కదిద్దా.. డ్రోన్లతో దోమల్ని నాశనం చేసే టెక్నాలజీని నేనే తీసుకొచ్చా. వాటిని గుర్తించి, డ్రోన్లతోనే చంపించేసి, దోమలరహిత రాష్ట్రంగా ఏపీని చేస్తా.. బెంగళూరు ఎయిర్‌పోర్టు సమీపంలో అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం’..
– సీఐఐ ప్రతినిధులతో, మెడ్‌టెక్ జోన్‌లోని భాగస్వాములు, సిబ్బందితో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిన దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యే వ్యాఖ్యలు.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా గురువారం విశాఖ పర్యటనకు వచ్చిన చంద్రబాబు విశాఖ, అనకాపల్లి, విజయనగరం జిల్లాల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గురువారం సాయంత్రం ఆయన మెడ్‌టెక్ జోన్‌ను సందర్శించారు. అక్కడ తయారు చేసిన పరికరాల ప్రదర్శనని తిలకించారు. గ్లోబల్ యూనివర్సిటీ ఫర్ మెడికల్ టెక్నాలజీ, నేషనల్ సెంటర్ ఫర్ మెడికల్ మెటీరియల్స్‌ని ప్రారంభించారు. అనంతరం అక్కడ జరిగిన సదస్సుల్లో మాట్లాడుతూ.. కోవిడ్ సమయంలో విశాఖపట్నంలోనే 8 రోజులు ఉంటూ.. పరిస్థితి మొత్తం చక్కదిద్దిన తర్వాతే వెళ్లాననీ, అదీ తన పని తీరని చెప్పారు. దీంతో విస్తుపోయిన మెడ్‌టెక్ జోన్ ప్రతినిధులు ‘హుద్ హుద్ మయంలో ఉన్నారు’ అని చెప్పారు.
వెంటనే చంద్రబాబు సర్దుకుని అవును హుద్‌హుద్ సమయంలో ఉన్నానని అన్నారు. తాను గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత మెడ్‌టెక్ జోన్‌కి చాలా ఇబ్బందులొచ్చాయని, ఆటంకాలు సృష్టించారని చెప్పారు. జితేంద్ర శర్మ దీన్ని కాపాడారన్నారు. గత ప్రభుత్వం దీనికి ఎలాంటి సహకారం అందించలేదని అన్నారు. తాను మొదటిసారి సీఎం అయ్యాక ఐటీ పార్క్ క్రియేట్ చేశానని, రెండోసారి సీఎం అయ్యాక బయోటెక్నాలజీ పార్క్ క్రియేట్ చేశానని చెప్పుకొన్నారు. మూడోసారి సీఎం అయ్యాక 275 ఎకరాల్లో మెడికల్ ఎక్విప్‌మెంట్ మాన్యుఫాక్చరింగ్ సిస్టమ్ క్రియేట్ చేశానన్నారు. ఇది రూ. 10 వేల కోట్ల టర్నోవర్ సాధించిందని చెప్పారు. ఈ మూడూ చాలా సంతృప్తినిచ్చాయని అన్నారు.
మెడ్‌టెక్ జోన్ త్వరలోనే గ్లోబల్ హబ్‌గా మారబోతోందని, దానికి సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారు. కోవిడ్ సమయంలో 20 రాష్ట్రాల వారు ఇక్కడ తయారైన సామాగ్రినే వినియోగించినప్పటికీ ఏపీలో గత ప్రభుత్వం వినియోగించలేదని అన్నారు. ఆరోగ్యానికి సంబంధించి పబ్లిక్ పాలసీలు తెవాల్సిన అవసరం ఉందని తెలిపారు. హాస్పిటల్స్, యూనివర్సిటీలు, డయాగ్నసిస్ సెంటర్స్ భాగస్వామ్యంతో నూతన ఆలోచనల్ని ఆవిష్కరించాలని చెప్పారు. ట్రిపుల్ ఐటీల్ని తానే ప్రారంభించానని చెప్పారు. డ్రోన్లతో దోమల్ని నాశనం చేసే టెక్నాలజీని తానే తీసుకొచ్చానన్నారు. వాటిని గుర్తించి, డ్రోన్లతోనే చంపించేసి, దోమలరహిత రాష్ట్రంగా ఏపీని చేస్తానని ప్రకటించారు. లండన్, సింగపూర్‌ను మోడల్‌గా తీసుకొని విశాఖను ఫిన్ టెక్ హబ్‌గా తీర్చిదిద్దుతామని తెలిపారు.
పీ4 విధానంలో భాగస్వామ్యం కండి
రాష్ట్ర అభివృద్ధి కోసం పబ్లిక్, ప్రైవేట్, పీపుల్స్ పార్ట్‌నర్‌షిప్ (పీ4) విధానంలో భాగస్వామ్యం కావాలని సీఐఐ ప్రతినిధులను చంద్రబాబు కోరారు. రాష్ట్రాన్ని పునర్నించే క్రమంలో పరిశ్రమలకు మెరుగైన రాయితీలు కల్పిస్తామన్నారు. సంస్కరణలు రాజకీయంగా నష్టం చేకూర్చినా ప్రజలకు మంచి చేస్తాయన్నారు. ఆర్థికంగా దేశం నంబర్ వన్‌గా ఉన్నప్పుడు ప్రజలు పేదరికంలో మగ్గుతుండటం దేశానికి మంచిది కాదన్నారు. 4, 5 నెలల్లో సోలార్, విండ్ , పంప్డ్ ఎనర్జీ అమలు చేసే తొలి కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. సీఐఐ 2వ యూనివర్సిటీని అమరావతిలో ప్రారంభించాలని కోరారు.
పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేం
అనకాపల్లి జిల్లా ఎస్.రాయవరం మండలం దార్లపూడి వద్ద పోలవరం ఎడమ కాలువ అక్విడెక్టు నిర్మాణ పనులను సీఎం చంద్రబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేమని అన్నారు. తన హయాంలో దార్లపూడిలో కాలువ పనులు 70 శాతం జరిగితే.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో 2 శాతమే జరిగాయన్నారు.గత ప్రభుత్వంలో ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టును నిర్లక్ష్యం చేశారని అన్నారు. రాష్ట్రంలో ఒక భూతం ఉందిని, దన్ని పూర్తిగా కంట్రోల్ చేసే భూత వైద్యులు ప్రజలేనంటూ వ్యాఖ్యలు చేశారు. వాజపేయి ప్రధానిగా ఉన్న సమయంలో స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేసే ప్రయత్నాలు జరిగితే తానే అడ్డుకున్నానని అన్నారు.
ఆ 500 ఎకరాలు జీఎంఆర్‌కే!
సాక్షి ప్రతినిధి, విజయనగరం: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ సంస్థ జీఎంఆర్‌కు మరో 500 ఎకరాలు ఇవ్వడానికి సిద్ధమని సీఎం చంద్రబాబు చెప్పారు. ఆ భూమిని ఏ విధంగా ఉపయోగిస్తారో సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆ సంస్థ ప్రతినిధులకు సూచించారు. ఆయన గురువారం అనకాపల్లి నుంచి హెలికాప్టర్‌లో భోగాపురం విమానాశ్రయానికి వచ్చి, నిర్మాణంలో ఉన్న రన్‌వేపై దిగారు. ఈ విమానాశ్రయంతో విశాఖపట్నం, విజయనగరం కలిసిపోతాయని, తర్వాత శ్రీకాకుళం జిల్లా కూడా కలుస్తుందని మీడియాతో చెప్పారు. ఈ విమానాశ్రయం నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 2015 మే 20న తలపెట్టిందని, తర్వాత వీళ్లు (వైఎస్సార్‌సీపీని ఉద్దేశించి) వచ్చి ప్రాజెక్టును అడ్డుకునే పరిస్థితి తెచ్చారని వ్యాఖ్యానించారు. 500 ఎకరాలపై లేనిపోని సమస్యలు సృష్టించారన్నారు. కుప్పం, దగదర్తి, నాగార్జునసాగర్, మూలపేట వద్ద విమానాశ్రయాలు నిర్మించాలని ఆలోచిస్తున్నామని చెప్పారు.
ప్రజాప్రతినిధులకు చేదు అనుభవం
మెడ్‌టెక్ జోన్ గాజువాక, పెందుర్తి నియోజకవర్గాల పరిధిలో ఉంది. అయినా గాజువాక ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా అయిన పల్లా శ్రీనివాస్‌కు, పెందుర్తి జనసేన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబుని అక్కడి కార్యక్రమంలో వేదిక పైకి ఆహ్వానించలేదు. దీంతో వారిద్దరూ అసహనం వ్యక్తం చేశారు.
వలంటీర్లతో పనేముంది?
మహారాణిపేట (విశాఖ దక్షిణ): రాష్ట్రంలో వలంటీర్లతో పనేముందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఆయన గురువారం రాత్రి అధికారులు, ప్రజాప్రతినిధులతో విశాఖ ఎయిర్‌పోర్టులో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వలంటీర్ల వ్యవస్థను ప్రస్తావించారు. వలంటీర్లు లేకపోతే పింఛన్లు ఇవ్వలేరా అంటూ ప్రశ్నించారు. తొలిసారిగా సచివాలయ ఉద్యోగులతో అద్భుతంగా పింఛన్లు పంపిణీ చేశామని చెప్పారు. ఇక వలంటీర్లతో పనేముందంటూ వ్యాఖ్యానించారు. విశాఖ నుంచి బీమిలి మీదుగా భోగాపురం వరకు బీచ్ కారిడార్ అభివృద్ధి చేయాలని, ఈ బీచ్‌రోడ్‌ని శ్రీకాకుళం వరకూ వెయ్యాలని సూచించారు.
దేశవ్యాప్త నిరసనతో దాడులపై వెనక్కి
టీడీపీ మూకలు విశాఖలోని డెక్కన్ క్రానికల్ పత్రిక కార్యాలయంపై దాడి చేయడంపై దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వచ్చింది. రాష్ట్రంలో టీడీపీ దాడులను దేశం మొత్తం ఖండించడంతో సీఎం చంద్రబాబు వెనక్కితగ్గేలా మాట్లాడారు. ఇకపై దాడులు, ఆఫీసుల వద్ద నిరసనలు అవసరం లేదనీ, చట్ట ప్రకారం ముందుకెళ్దామని పార్టీ శ్రేణులకు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment