MRI scanning machine
-
నారా లోకేష్‌కు ఎంఆర్ఐ స్కానింగ్
సాక్షి, నంద్యాల జిల్లా: భుజం నొప్పితో నంద్యాలలో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లిన నారా లోకేష్.. ఎంఆర్ఐ స్కానింగ్ చేయించుకున్నారు. యువగళం పాదయాత్ర ప్రస్తుతం నంద్యాల నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఆయన కొద్ది రోజులుగా భుజం నొప్పితో ఇబ్బంది పడుతున్నారు. రెండు మూడు రోజులుగా ఈ నొప్పి సంక్లిష్టంగా మారడంతో వైద్యుల సూచన మేరకు నంద్యాలలోని మాగ్నా MRI సెంటర్ లో స్కానింగ్ చేయించుకున్నారు. జనవరి 27, 2023న యువగళం పేరుతో పాదయాత్ర ప్రారంభించిన నారా లోకేష్ నాయుడు.. 400 రోజుల్లో 4 వేల కిలోమీటర్లు నడుస్తానని ప్రకటించారు. ఇప్పటివరకు 3 జిల్లాల్లో పర్యటించిన లోకేష్ అష్టకష్టాలు పడుతున్నారు. పెద్దగా ప్రజల నుంచి స్పందన లేకపోవడం ఆయన్ను నిరుత్సాహానికి గురి చేస్తోంది. ఎలాగైనా వాడి వేడి ప్రసంగాలతో జనాన్ని ఆకట్టుకోవాలని లోకేష్ చేస్తోన్న ప్రయత్నాలు కూడా చాలా సార్లు బెడిసికొడుతున్నాయి. పదాలను స్పష్టంగా పలకలేకపోవడం, వ్యాక్యాన్ని చెప్పలేకపోవడం, ఏ విషయం చెబుతున్నాడో దానిపై పూర్తిగా అవగాహన లేకపోవడం, చెప్పే మాటల్లో నిలకడలేమి ఉండడం, చేసింది ఒకటయితే.. దానికి విరుద్ధమైన ప్రకటనలు చేయడం, నేరుగా విమర్శించలేక.. తిట్ల దండకం అందుకోవడం.. ఇవన్నీ పాదయాత్రలో చినబాబు బయటపెట్టుకున్న అంశాలు. దీనికి తోడు పలుమార్లు "సైకిల్ పోవాలి" అంటూ నోరు జారడం పార్టీ నేతలకు ఇబ్బందికరంగా మారింది. పైగా తనను తాను మూర్ఖుడని బలంగా చెప్పుకుంటున్నారు. ప్రత్యర్థిని భయపెట్టే క్రమంలో నిజాలు చెప్పాలి, ఆధారాలు చూపించాలి కానీ.. వాటిని వదిలి తిట్ల దండకం అందుకోవడం, మూర్ఖుడినని చెప్పుకోవడం, తనకు అవకాశం ఇస్తే అంతు చూస్తానని వ్యాఖ్యానాలు చేయడం ద్వారా గతంలో ఉన్న ఇమేజ్ కూడా ఇప్పుడు పోయినట్టయింది. దానికి తోడు ఇప్పటివరకు వెళ్లిన చాలా నియోజకవర్గాల్లో వర్గపోరు రచ్చకెక్కడం, గ్రూపులుగా విడిపోయి వ్యూహాలు, ప్రతివ్యూహాలు, దాడులు చేసుకోవడం, అంతంత మాత్రంగా ఉన్న పార్టీ ఇమేజ్ ను మరింత దెబ్బ తీసినట్టవుతోంది. -
కలర్‌ఫుల్ ఎంఆర్ఐ స్కానర్
న్యూఢిల్లీ: ఎంఆర్ఐ స్కానింగ్ అంటే చాలా మందికి భయం. వింత శబ్దాలతో గుహలోకి వెళ్లిన ఫీలింగ్. చిన్నారులకు ఎంఆర్ఐ అంటే మరీ కష్టం. పిల్లలు భయపడకుండా స్కాన్ తీయడం కోసం ‘చిన్నారి’ ఎంఆర్ఐ మిషన్లు వస్తున్నాయి. మిషన్‌కు రంగులద్దడంతో పాటు దానిపైన ఫిక్షనల్ కేరక్టర్స్, బొమ్మలు చిత్రీకరించి పిల్లల్ని ఆకర్షించేలా రూపొందిస్తున్నారు. చాలా ఆస్పత్రుల్లో ఇలాంటి ఎంఆర్ఐ మిషన్లు ఉంటున్నాయని పారిశ్రామికవేత్త హర్షగోయెంక ఒక ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. ఇప్పుడు ఆ మిషన్‌ను చూసిన నెటిజన్లు భలేగా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. -
ఏపీ మెడ్‌టెక్ జోన్ నుంచి ఎంఆర్ఐ పరికరాలు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: వైద్య ఉపకరణాల ఉత్పత్తికి వేదికగా నిలుస్తూ ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చుకున్న ఆంధ్రప్రదేశ్ మెడ్‌టెక్ జోన్ మరో అత్యాధునిక ఆవిష్కరణకు కేంద్ర బిందువుగా మారింది. ఎంఆర్ఐ పరికరాల్లో ఉపయోగించే మాగ్నెట్స్‌లో అత్యుత్తమ ఫలితాలను తక్కువ కాలంలోనే అందించేలా సూపర్ కండక్టింగ్ మాగ్నెట్స్‌ని తయారు చేసింది. మెడ్‌టెక్ జోన్ నుంచే పరికరాల ఉత్పత్తి, పరీక్షలు, అభివృద్ధి జరగడం దేశంలోనే తొలిసారి కావడం విశేషం. మాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్(ఎంఆర్ఐ)ని అత్యంత శక్తివంతమైన అయస్కాంత క్షేత్రం, రేడియో తరంగాలను ఉపయోగించడంపై ఆధారపడి ఉంటుంది. ఛాతీ, ఉదరం, మెదడు, వెన్నెముక లేదా కటి ప్రాంతంతో సంబంధం ఉన్న అనేక భాగాల ఆరోగ్య స్థితిగతుల్ని తెలుసుకునేందుకు ఎంఆర్ఐ తీస్తారు. ఎంఆర్ఐ స్కానర్ల నుంచి వచ్చే అయస్కాంత క్షేత్రాలు, రేడియో తరంగాలు శరీర కణజాలాల్లో ఉండే ప్రోటాలతో జరిపే పరస్పర చర్య ద్వారా ఆ భాగానికి సంబంధించిన చిత్రాన్ని తీస్తుంది. ఈ స్కాన్ ఆధారంగా.. ఆరోగ్య సమస్యల్ని వైద్యులు నిర్థారిస్తుంటారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 1.5 టెస్లా ఎంఆర్ఐ కండక్టింగ్ మాగ్నెట్స్‌ని మాత్రమే వినియోగిస్తున్నారు. కానీ.. ఏపీ మెడ్‌టెక్ జోన్లో మాత్రం ఎంఆర్ఐలలో అత్యంత కీలకమైన పరికరంగా పరిగణించే సూపర్ కండక్టింగ్ మాగ్నెట్స్‌ని మరింత శక్తివంతంగా తయారు చేశారు. దీని ద్వారా ఎంఆర్ఐ స్కానింగ్ తీసే సమయం మరింత తగ్గే అవకాశం ఉందని మెడ్‌టెక్ వర్గాలు వెల్లడించాయి. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ సూపర్ కండక్టింగ్ మాగ్నెట్స్‌ని ఉత్పత్తి చేయడమే కాకుండా.. మెడ్‌టెక్ జోన్లోనే పరీక్షలు నిర్వహించడంతో పాటు.. పరికరాలనూ అభివృద్ధి చేశారు. ఎంఆర్ఐ స్కానర్‌ను తయారు చేసే అసలు తయారీదారులకు అత్యంత కీలక భాగమైన సూపర్ కండక్టింగ్ మాగ్నెట్స్‌ని విశాఖ నుంచే ఎగుమతి చేస్తున్నారు. -
రోగులకు ఊరట
గాంధీఆస్పత్రి: సికింద్రాబాద్ గాంధీఆస్పత్రిలో అత్యాధునిక వైద్య యంత్రాలు క్యాథ్‌ల్యాబ్, ఎమ్మారై స్కానింగ్ మెషీన్లు అందుబాటులోకి రానున్నాయి. ఆదివారం మంత్రులు తలసాని శ్రీనివాసయాదవ్, మెహమూద్‌ఆలీలతో కలిసి వైద్య శాఖ హరీష్‌రావు వీటిని ప్రారంభిస్తారని గాంధీ సూపరింటెండెంట్ ప్రొఫెసర్ రాజారావు తెలిపారు. గాంధీ రేడియాలజీ, కార్డియాలజీల్లో 2010లో ఏర్పాటు చేసిన ఎమ్మారై, క్యాథ్‌ల్యాబ్‌లు కాలపరిమితి ముగియడంతో తరచూ మొరాయిస్తున్నాయని ఆస్పత్రి పాలనాయంత్రాంగం విజ్ఞప్తికి మంత్రి హరీష్‌రావు స్పందించి ఆదేశాలు జారీ చేయడంతో రూ.9.5 కోట్లతో ఎమ్మారై స్కానింగ్, రూ.13.5 కోట్లతో క్యాథ్‌ల్యాబ్‌ను కొనుగోలు చేశారు. కరోనా లాక్డౌన్, రష్యా ఉక్రెయిన్ యుద్ధం తదితర కారణాలతో ఆయా యంత్ర విడిభాగాలు ఇతర దేశాల నుంచి దిగుమతి కావడంలో జాప్యం ఏర్పడింది. మంత్రి ఆదేశాల మేరకు జర్మనీ, జపాన్ దేశాల నుంచి వాయు మార్గంలో యంత్ర విడిభాగాలను దిగుమతి చేసుకుని, నిరుపేద రోగులకు అందుబాటులోకి తెస్తున్నట్లు ఆస్పత్రి అధికారులు తెలిపారు. -
పరీక్షల్లేవు... మందుల్లేవు
సాక్షి, హైదరాబాద్/నెట్వర్క్: ఈఎస్ఐ ఆస్పత్రుల్లో అందుతున్న వైద్యసేవలకు తార్కాణమిది. ఉద్యోగులకు పూర్తిస్థాయిలో వైద్యసేవలు అందించే లక్ష్యంతో ఏర్పాటుచేసిన ఈఎస్ఐ ఆస్పత్రులు సంకట స్థితిలో ఉన్నాయి. పలు విభాగాల్లో సంతృప్తికరస్థాయిలో వైద్యులు, సిబ్బంది ఉన్నా మౌలిక వసతుల లేమి రోగులను వెక్కిరిస్తోంది. వందల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చిన బాధితులు బిత్తరపోతున్నారు. వైద్య పరికరాలు లేని కారణంగా డాక్టర్లే ప్రైవేటు బాట పట్టిస్తున్నారు. కార్మిక రాజ్య బీమా సంస్థ (ఈఎస్ఐసీ) పరిధిలో ఒక సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, నాలుగు ప్రధాన ఆస్పత్రులు, రెండు డయాగ్నస్టిక్ కేంద్రాలు, 70 డిస్పెన్సరీలున్నాయి. ఇందులో సనత్‌నగర్‌లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పూర్తిగా ఈఎస్ఐసీ కార్పొరేషన్ పరిధిలో కొనసాగుతుండగా.. నాచారం, ఆర్సీపురం, సిర్పూర్–కాగజ్‌నగర్, వరంగల్ ఆస్పత్రులు, డిస్పెన్సరీలు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని కార్మిక రాజ్య బీమా విభాగం వైద్యసేవలను పర్యవేక్షిస్తోంది. ఆ ఆస్పత్రి మినహా తక్కిన ఆస్పత్రుల్లో వైద్యసేవలు గందరగోళంలో పడ్డాయి. పర్యవేక్షణ లోపం, మౌలికవసతుల కల్పన తదితర కారణాలతో ఇక్కడికి వచ్చే బాధితులకు సకాలంలో సరైన వైద్యం అందకప్రైవేటు ఆస్పత్రులే దిక్కవుతున్నాయి. ఈ ఆస్పత్రులు విభిన్నం... సాధారణంగా వైద్య, ఆరోగ్య శాఖ ఆస్పత్రులతో ఈఎస్ఐ ఆస్పత్రులను పోల్చలేం. రాష్ట్ర ప్రభుత్వ ఆస్పత్రులను పూర్తిగా ప్రభుత్వ బడ్జెట్‌తో నిర్వహిస్తారు. ఇక్కడ రోగుల నుం చి ఎలాంటి ఫీజులు స్వీకరించరు. కానీ ఈఎస్ఐ ఆస్పత్రుల నిర్వహణ పూర్తిగా చందాదారుల నుంచి స్వీకరించే ప్రీమియం నుంచే ఖర్చు చేస్తారు. ఈఎస్ఐ పరిధిలోకి వచ్చే ఉద్యోగులు చెల్లించే నెలవారీ చందాతో వీటిని నిర్వహిస్తారు. ఒక్కో ఉద్యోగి నెలకు రూ.100–450 వరకు చందా రూపంలో చెల్లిస్తున్నారు. రాష్ట్రంలో 20.78 లక్షల మంది ఈఎస్ఐ చందాదారులున్నారు. వీరి కుటుంబ సభ్యులు, వీరిపై ఆధారపడ్డవారిని కలిపితే లబ్ధిదారుల సంఖ్య 80 లక్షలు ఉంటుంది. ఓపీ సేవలతో సరి రాష్ట్రంలోని నాలుగు ఈఎస్ఐ ప్రధాన ఆస్పత్రులు కేవలం అవుట్‌పేషెంట్ (ఓపీ) సర్వీసులతోనే సరిపెడుతున్నాయి. జనరల్ డాక్టర్లతోపాటు స్పెషలైజ్డ్ వైద్యులు ఉన్నప్పటికీ సరైన మౌలికవసతులు లేవు. దీంతో వారంతా సాధారణ ఓపీ చెకప్‌కే పరిమితమవుతున్నారు. శస్త్రచికిత్సలు, ఇతర అత్యాధునిక వైద్య సేవలు అవసరముంటే సనత్‌నగర్ ఆస్పత్రికి రిఫర్ చేస్తూ చేతులు దులుపుకుంటున్నారు. ప్రధాన ఆస్పత్రుల్లో సేవలందించే వీలున్నప్పటికీ చిన్నపాటి పరీక్షల కోసం ప్రైవేటు కేంద్రాలకు వెళ్లాల్సి రావడం, అటూఇటూ చక్కర్లు కొట్టడం అటు బాధితులకు, వారి వెంట ఉన్న సహాయకులకు ఇబ్బందికరంగా మారింది. దీంతో పెద్ద సంఖ్యలో ప్రైవేటు ఆస్పత్రుల బాట పడుతున్నారు. జాడలేని సీటీ, ఎంఆర్ఐ సనత్‌నగర్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి మినహాయిస్తే ప్రధాన ఆస్పత్రుల్లో ఎక్కడా ఎంఆర్ఐ, సీటీ స్కాన్, 2డీ ఇకో యంత్రాలు లేవు. ఆ సేవల కోసం సనత్‌నగర్‌కు పరుగులు పెట్టాల్సిందే. దీంతో ప్రధాన ఆస్పత్రుల నుంచి రోగులు పెద్దసంఖ్యలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి వెళ్తుండగా... అక్కడ ఒత్తిడి తీవ్రం కావడంతో స్కానింగ్ తీసుకునేందుకు రోజు ల తరబడి వేచిచూడాల్సిన పరిస్థితి ఉంది. పారిశ్రామికవాడలు, వాణిజ్య సముదాయాల మధ్య ఉన్న నాచారం, ఆర్సీపురం ఆస్పత్రుల్లో సేవలు కాస్త మెరుగ్గానే ఉన్నా.. సిర్పూర్–కాగజ్‌నగర్, వరంగల్ ఆస్పత్రుల్లో సేవలు అధ్వానంగా ఉన్నాయి. ఈ రెండిట్లో కనీసం ఎక్స్‌రే యంత్రాలు కూడా లేవు. వరంగల్‌లో కొన్ని రక్త పరీక్షలు మాత్రమే నిర్వహిస్తుండగా, సిర్పూర్–కాగజ్‌నగర్‌లో అది కూడా లేదు. ప్రైవేటు ల్యాబ్‌లో చేయించిన రిపోర్టులను అక్కడి డాక్టర్లు పరిగణనలోకి తీసుకుంటున్నారు. దీంతో రెండిట్లో 95 శాతం బెడ్లు ఖాళీగా ఉంటున్నాయి. ఒక రకంగా ఇక్కడ ఐపీ సేవలు నిలిచిపోయాయని చెప్పొచ్చు. వస్తారు... వెళ్తారు వరంగల్, సిర్పూర్–కాగజ్‌నగర్ ఆస్పత్రుల్లో ఐపీ సేవలు నిలిచిపోవడంతో అక్కడ వైద్యులు, సిబ్బంది విధులను మొక్కుబడిగా నిర్వర్తిస్తున్నారు. గంట, రెండు గంటల పాటు కాలక్షేపం చేసి ఇంటికెళ్తున్నారు. ఇక్కడ మెజార్టీ వైద్యులు హైదరాబాద్ నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో రోజుల తరబడి విధులకు ఎగనామం పెట్టే వైద్యులు కూడా ఉన్నట్లు ఆరోపణలున్నాయి. అటకెక్కిన పర్యవేక్షణ ఈఎస్ఐ ఆస్పత్రుల్లో పర్యవేక్షణ గాడితప్పింది. ఆకస్మిక తనిఖీలు, పర్యవేక్షణ నిర్వహించేందుకు రాష్ట్ర కార్యాలయంలో డైరెక్టర్, సంయుక్త సంచాలకుల పాత్ర కీలకం. అదేవిధంగా వరంగల్, హైదరాబాద్ జాయింట్ డైరెక్టర్లు సైతం తమ పరిధిలోని ఆస్పత్రుల్లో తనిఖీలు చేయాలి. కానీ కొన్నేళ్లుగా ఇలాంటి పర్యవేక్షణలు మచ్చుకైనా లేవు. దీంతో వైద్యు లు, సిబ్బంది హాజరు ఇష్టారాజ్యంగా మారింది. ఎలాంటి అనుమతులు లేకుండా రోజుల తరబడి సెలవులు పెట్టడం, వాటిని రెన్యువల్ చేసుకోవడంలాంటి తంతు ఏళ్లుగా జరుగుతోంది. డైరెక్టర్ ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ (డీఐఎంఎస్) విభాగాధిపతి హోదాలో రెండున్నరేళ్లుగా ఇన్చార్జ్ అధికారి ఉన్నందునే ఈ పరిస్థితి వచ్చినట్లు విమర్శలు వస్తున్నాయి. ఈ చిత్రంలోని వ్యక్తి పేరు ఎం.ప్రవీణ్‌కుమార్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాకలోని ఐటీసీకి చెందిన బీపీఎల్ కంపెనీలో పనిచేస్తున్నారు. డస్ట్ ఎలర్జీతో బాధపడుతూ ఆస్తమా బారిన పడ్డాడు. సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నప్పటికీ ఖర్చుకు భయపడి వరంగల్ ఈఎస్ఐ ఆస్పత్రికెళ్లాడు. వైద్యుడు మాత్రలు రాయడంతోపాటు చెస్ట్ ఎక్స్‌రే, స్కానింగ్ తీయించాలని సూచించారు. కానీ అక్కడ ఈ రెండు వసతులు లేవు. దీంతో వాటికోసం ప్రైవేటు డయాగ్నస్టిక్ సెంటర్‌కు పరుగుపెట్టాడు. అన్నిరకాల సేవలు దొరుకుతాయని భావించి 180 కి.మీ. దూరం నుంచి వచ్చిన ఆయనకు నిరాశ తప్పలేదు. 11 గంటలైనా తాళాలు తీయలే వరంగల్ ఆస్పత్రిలో వైద్యులు సమయపాలన పాటించకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. సుదూర ప్రాంతాల నుంచి అత్యవసర పరిస్థితుల్లో వచ్చేవారిని హైదరాబాద్‌లోని ఈఎస్ఐ ఆస్పత్రులకు రెఫర్ చేస్తున్నారు. అల్ట్రాసౌండ్, డిజిటల్ ఎక్స్‌రే, సీటీ స్కాన్ తదితర పరికరాలు లేకపోవడంతో రోగులు తిప్పలు పడుతున్నారు. వరంగల్ ఈఎస్ఐ ఆస్పత్రిలో ఉదయం 11 గంటలు అయినా డాక్టర్ రాకపోవడంతో ఖాళీగా దర్శనమిచ్చిన కుర్చీ శుక్రవారం ఈ ఆస్పత్రిని ‘సాక్షి’విజిట్ చేయగా ఉదయం 11 గంటలకు కూడా పిల్లలు, ఆర్థోపెడిక్ విభాగాల తాళం కూడా తీయలేదు. గైనకాలజిస్టు, డెంటిస్టు, ఆర్థోపెడిక్, పీడియాట్రిక్ వైద్యుల పోస్టులు ఖాళీగా ఉండటంతో ఇక్కడికొచ్చే రోగుల సంఖ్య బాగా తగ్గిందని సిబ్బంది చెబుతున్నారు. వారం రోజులుగా తిరుగుతున్నా.. నిజామాబాద్‌కు చెందిన ఇతని పేరు నాగభూషణం. ఇతనికి గుండె ఆపరేషన్ జరిగింది. ప్రతి నెలా మందుల కోసం నిజామాబాద్ న్యాల్కల్ రోడ్డులోని ఈఎస్ఐ ఆస్పత్రికి వస్తుంటారు. వైద్యులు రాసిన పది రకాల మందుల కోసం ప్రిస్కిప్షన్ తీసుకుని ఇక్కడకు వస్తే ఏ ఒక్క మాత్ర ఉండడం లేదు. వారం రోజులుగా తిరుగుతున్నప్పటికీ ఇవ్వడం లేదు. బయట మాత్రలు కొనుగోలు చేసే స్తోమత లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఖర్చులు తడిసిమోపెడు నేను కొన్నేళ్లుగా నరాల సమస్యతో ఇబ్బంది పడుతున్నా. తూప్రాన్ డిస్పెన్సరీ వైద్యుల సూచనతో ఆర్సీపురం ఆస్పత్రికి వచ్చాను. అయితే ఎంఆర్ఐ, సీటీ స్కాన్ అందుబాటులో లేవని డాక్టర్లు చెప్పారు. దీంతో సనత్‌నగర్ ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించాను. ఆయా రిపోర్టులను తిరిగి ఆర్సీపురం వైద్యులకు చూపించి మందులు రాయించుకున్నా. దీనికోసం ఆరేడుసార్లు తిరిగాను. ప్రయాణ ఖర్చులు సైతం తడిసి మోపెడవుతున్నాయి. – సత్యనారాయణ, తూప్రాన్ -
ఎట్టకేలకు మరమ్మతులు
గాంధీఆస్పత్రి: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి రేడియాలజీ విభాగంలో ఎమ్మారై స్కానింగ్ యంత్రం అందుబాటులోకి వచ్చింది. కార్డియాలజీ విభాగంలోని క్యాత్‌ల్యాబ్, సీటీ స్కానింగ్ యంత్రాలకు సైతం మరమ్మతులు పూర్తయ్యాయి. జనవరి చివరి వారంలో ఎమ్మారై, సీటీ స్కానింగ్ యంత్రాలతో పాటు క్యాత్‌ల్యాబ్ మరమ్మతులకు గురయ్యాయి. నిర్వహణ సంస్థ ఫెబర్ సింధూరి మరమ్మతులు తమ వల్ల కాదని చేతులు ఎత్తేయడంతో ఆరు నెలలుగా యంత్రాలు మూలనపడ్డాయి. యంత్రాలను సరఫరా చేసిన సిమెన్స్ సంస్థ తమకు బకాయిపడ్డ సుమారు రూ.90 లక్షలు చెల్లిస్తేనే మరమ్మతులు చేస్తామని స్పష్టం చేసింది. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు శస్త్ర చికిత్సలు వాయిదా పడ్డాయి. క్యాత్‌ల్యాబ్ పనిచేయకపోవడంతో గుండె సంబంధ వ్యాధులతో ఇక్కడకు వచ్చిన రోగులు ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆస్పత్రి పాలనా యంత్రాంగం చొరవ తీసుకొని పరిస్థితిని ఉన్నతాధికారులకు వివరించింది. ఆస్పత్రి అభివృద్ధి నిధులు వెచ్చించి ఈ మూడు యంత్రాలను అందుబాటులోకి తేవాలని జిల్లా కలెక్టర్ లిఖితపూర్వకంగా ఆదేశాలు జారీ చేశారు. సిమెన్స్ సంస్థ ప్రతినిధులతో ఆస్పత్రి యంత్రాంగం పలుమార్లు ప్రత్యేకంగా సమావేశమై చర్చించింది. వారం రోజుల క్రితం సుమారు రూ.78 లక్షలు చెల్లించడంతో సిమెన్స్ సంస్థ ఇంజినీర్లు రంగంలోకి దిగారు. విదేశాల నుంచి యంత్ర భాగాలను తెప్పించి సిటీ, ఎమ్మారై, క్యాత్ల్యాబ్లను అందుబాటులోకి తెచ్చారు. ప్రతిరోజు సుమారు 20 ఎమ్మారై, 120–135 సీటీ స్కానింగ్‌లు నిర్వహిస్తున్నామని రేడియాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్ శ్రీహరి తెలిపారు. క్యాత్‌ల్యాబ్ పూర్తిస్థాయిలో పనిచేస్తోందని కార్డియాలజీ వైద్యులు పేర్కొన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అతి ముఖ్యమైన మూడు యంత్రాలకు మరమ్మతులు చేపట్టి అందుబాటులోకి తెచ్చామని, సదరు యంత్రాలకు సంబంధించి నిర్వహణ బాధ్యతలను సిమెన్స్ సంస్థకే అప్పగించామని ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రొఫెసర్ శ్రవణ్‌కుమార్ తెలిపారు. -
ఎట్టకేలకు మోక్షం!
తిరుపతి రుయా ఆస్పత్రిలో ఎట్టకేలకు ఎంఆర్ఐ స్కానింగ్ కేంద్రం సేవలు ప్రారంభమయ్యాయి. ఏడాదిన్నర క్రితం ప్రారంభం కావాల్సి ఉన్నా అనేక అడ్డంకులు ఏర్పడ్డాయి. చివరకు స్కానింగ్ భవనం నిర్మాణ పనులు పూర్తయినా అతిథి కోసం రెండు నెలల పాటు ఎదురుచూడాల్సి వచ్చింది. అయినా, ఫలితం శూన్యం. ఈ క్రమంలోనే ఎన్నికల కోడ్ వస్తుందనే భయంతో సెంటర్ కాంట్రాక్టర్ హడావుడిగా గురువారం ఆస్పత్రి సూపరింటెండెంట్ చేతుల మీదుగా కేంద్రాన్ని ప్రారంభించారు. దీంతో నిరుపేదలకు కొంతైనా ఆర్థికభారం తగ్గినట్లయింది. చిత్తూరు, తిరుపతి (అలిపిరి) : రుయా ఆస్పత్రిలో గత 2 వ తేదీన ఎంఆర్ఐ (మేగ్నటిక్ రెసోనన్స్ ఇమేజింగ్) స్కానింగ్ భవన నిర్మాణం పూర్తయ్యింది. రూ.10 కోట్ల ప్రాజెక్ట్ అని చెప్పుకునే స్కానింగ్ కేంద్రం కాంట్రాక్టర్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతి«థి కోసం నిర్మాణ పనులు ఆలస్యం చేశారు. ఆరు నెలల క్రితం మిషనరీని తెప్పించినా ముఖ్య అతిథి కోసం వాయిదా వేసుకుంటూ వచ్చారు. గత నెల 2న ప్రారంభం కావాల్సి ఉన్నా ప్రారంభానికి నోచుకోలేదు. ఇందుకు అధికారులు వంతపాడుతూ వచ్చారన్న విమర్శలు వున్నాయి. కోడ్ భయంతో..! ఎన్నికల కోడ్ అమలైతే ఎంఆర్ఐ స్కానింగ్ కేంద్రం ప్రారంభానికి మరింత ఆలస్యం అవుతుం దన్న భయంతో గురువారం కాంట్రాక్టర్ హడా వుడిగా కేంద్రాన్ని ప్రారంభించారు. రుయా ఉన్నతాధికారులను పిలిచి సేవలకు శ్రీకారం చుట్టారు. అతిథి కోసం ఎదురుచూపులు ఫలిం చకపోవడంతో చడీచప్పుడు కాకుండా ప్రారంభిం చడంపై రుయా ఉద్యోగులు ఆశ్చర్యానికి లోనయ్యారు. కనిపించని అభివృద్ధి కమిటీ ఎంఆర్ఐ స్కానింగ్ కేంద్రం ప్రారంభ సమయంలో రుయా అభివృద్ధి కమిటీ సభ్యులు ఒక్కరూ కనిపించలేదు. రుయా అభివృద్ధి కోసం నిత్యం ఆస్పత్రిలో తిరుగుతూ పర్యవేక్షించే కమిటీ వర్కింగ్ చైర్మన్ చినబాబుకు ఆహ్వానం అందలేదు. కేంద్రం ప్రారంభానికి ఆహ్వానించకపోవడం పట్ల కమిటీ సభ్యులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. రోగులకు ఊరట రుయా ఆస్పత్రిలో ఏడాదిన్నర క్రితం ప్రారంభం కావాల్సిన ఎంఆర్ఐ స్కానింగ్ కేంద్రం సేవలకు ఎట్టకేలకు మోక్షం లభించింది. స్కానింగ్‌సేవలు అందుబాటులోకి రావడంతో నిరుపేద రోగులకు ఆర్థిక భారం నుంచి వెసులుబాటు లభించినట్లయింది. ప్రైవేట్ స్కానింగ్ కేంద్రాల్లో ఎంఆర్ఐ సేవలకు రూ.4,500 నుంచి రూ. 5 వేలు వసూలు చేస్తున్నారు. రుయాకు ఆధునిక సేవలు అందుబాటులోకి రావడంతో రోగులకు కాస్త ఊరట లభించినట్లయింది. రోగులకు మెరుగైన సేవలు రుయా ఆస్పత్రిలో రోగులకు మెరుగైన సేవలు అందిస్తున్నాం. సిటీ, ఎంఆర్ఐ స్కానింగ్ కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయి. నిరుపేదలకు మరింత మెరుగైన సేవ చేసే అవకాశం లభించింది. – డాక్టర్ సిద్ధానాయక్, సూపరింటెండెంట్,రుయా ఆస్పత్రి, తిరుపతి -
ఆస్పత్రుల అభివృద్ధికి కృషి చేస్తాం
ఆరోగ్యశ్రీ మంచి పథకం రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి శ్రీనివాస్ స్విమ్స్‌లో అధునాతన ఎంఆర్ఐ స్కానింగ్ మిషన్ ప్రారంభం తిరుపతి అర్బన్ : ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఆస్పత్రుల అభివృద్ధికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ స్పష్టం చేశారు. జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన శుక్రవారం తిరుపతిలోని స్విమ్స్, రుయా అస్పత్రులను సందర్శించారు. ఈ సందర్భంగా స్విమ్స్‌లోని రేడియాలజీ విభాగంలో రూ.8.33 కోట్లతో నూతనంగా ఏర్పాటు చేసిన అత్యాధునిక ఎంఆర్ఐ స్కానింగ్ మిషన్‌ను ప్రారంభించారు. అనంతరం స్విమ్స్ కమిటీ హాల్లో వైద్యులు, వివిధ విభాగాధిపతులు, ఆస్పత్రి అధికారులతో సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ స్విమ్స్‌లో నిరుపేద రోగుల కోసం నిర్వహిస్తున్న డయాలసిస్ వైద్యసేవల్లో తీవ్ర జాప్యం జరుగుతోందని, వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. గతంలో హైదరాబాద్‌లో మాత్రమే అభివృద్ధి మొత్తం కేంద్రీకృతం అయిన కారణంగా ఎదుర్కొన్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని నవ్యాంధ్రప్రదేశ్‌లో అన్ని ప్రాంతాలను సమాన ప్రాతిపదికన అభివృద్ధి చేసేందుకు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. అందులో భాగంగానే విజయవాడ-గుంటూరు జంట నగరాల మధ్య ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రి తరహాలో ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని తీసుకొచ్చేందుకు ప్రణాళిక బద్ధంగా వ్యవహరిస్తామన్నారు. అదేవిధంగా తిరుపతిలోని స్విమ్స్ ఆస్పత్రిని కూడా మరింత విస్తృతంగా అభివృద్ధి చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అయితే ఈ విషయంలో కేంద్ర నిధులతో పాటు టీటీడీ కూడా మరింత సహకారం అందించేలా సమన్వయంగా వ్యవహరిస్తామన్నారు. ఆరోగ్యశ్రీ ప్రతి ఒక్కరికీ మంచి పథకంగా కొనసాగుతోందని అయితే మరింత విస్తృతంగా సేవలు అందించే దిశగా చూస్తామన్నారు. రాయలసీమ ప్రాంత పేద ప్రజలకు వైద్యసేవలు అందిస్తున్న రుయా ఆస్పత్రికి టీటీడీ నుంచి నిధులను తెప్పించే విషయంలో ఇబ్బందిగా ఉన్న జీవో నెం.165 పై శనివారం వైద్యశాఖ ఉన్నతాధికారులతో సమీక్షిస్తానని హామీ ఇచ్చారు. రుయాలోని చిన్నపిల్లల ఆస్పత్రిలో సౌకర్యాలు, అధునాతన వైద్య పరికరాలు మెరుగు పరిచేందుకు అధికారుల నివేదిక తరువాత చర్యలుంటాయన్నారు. ఈ సందర్భంగా రుయా అత్యవసర విభాగాన్ని సందర్శించిన మంత్రి అక్కడి వాతావరణం, రోగులకు అందుతున్న సేవలపై అసహనం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాల్లో మంత్రి వెంట తిరుపతి ఎమ్మెల్యే వెంకటరమణ, స్విమ్స్ డెరైక్టర్ డాక్టర్ భూమా వెంగమ్మ, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సత్యనారాయణ, క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శివశంకర్, ఆరోగ్యశ్రీ ఇన్చార్జ్ లోకేశ్వర్‌రెడ్డి, రుయా సూపరింటెండెంట్ డాక్టర్ వీరాస్వామి, సీఎస్‌ఆర్‌ఎంవో డాక్టర్ చిలకల వరసుందరం, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ తదితరులు ఉన్నారు.