ఆస్పత్రుల అభివృద్ధికి కృషి చేస్తాం
- ఆరోగ్యశ్రీ మంచి పథకం
- రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి శ్రీనివాస్
- స్విమ్స్‌లో అధునాతన ఎంఆర్‌ఐ స్కానింగ్ మిషన్ ప్రారంభం
తిరుపతి అర్బన్ : ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఆస్పత్రుల అభివృద్ధికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ స్పష్టం చేశారు. జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన శుక్రవారం తిరుపతిలోని స్విమ్స్, రుయా అస్పత్రులను సందర్శించారు.
ఈ సందర్భంగా స్విమ్స్‌లోని రేడియాలజీ విభాగంలో రూ.8.33 కోట్లతో నూతనంగా ఏర్పాటు చేసిన అత్యాధునిక ఎంఆర్‌ఐ స్కానింగ్ మిషన్‌ను ప్రారంభించారు. అనంతరం స్విమ్స్ కమిటీ హాల్‌లో వైద్యులు, వివిధ విభాగాధిపతులు, ఆస్పత్రి అధికారులతో సమావేశమయ్యారు.
ఆయన మాట్లాడుతూ స్విమ్స్‌లో నిరుపేద రోగుల కోసం నిర్వహిస్తున్న డయాలసిస్ వైద్యసేవల్లో తీవ్ర జాప్యం జరుగుతోందని, వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. గతంలో హైదరాబాద్‌లో మాత్రమే అభివృద్ధి మొత్తం కేంద్రీకృతం అయిన కారణంగా ఎదుర్కొన్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని నవ్యాంధ్రప్రదేశ్‌లో అన్ని ప్రాంతాలను సమాన ప్రాతిపదికన అభివృద్ధి చేసేందుకు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.
అందులో భాగంగానే విజయవాడ-గుంటూరు జంట నగరాల మధ్య ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రి తరహాలో ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని తీసుకొచ్చేందుకు ప్రణాళిక బద్ధంగా వ్యవహరిస్తామన్నారు. అదేవిధంగా తిరుపతిలోని స్విమ్స్ ఆస్పత్రిని కూడా మరింత విస్తృతంగా అభివృద్ధి చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.
అయితే ఈ విషయంలో కేంద్ర నిధులతో పాటు టీటీడీ కూడా మరింత సహకారం అందించేలా సమన్వయంగా వ్యవహరిస్తామన్నారు. ఆరోగ్యశ్రీ ప్రతి ఒక్కరికీ మంచి పథకంగా కొనసాగుతోందని అయితే మరింత విస్తృతంగా సేవలు అందించే దిశగా చూస్తామన్నారు. రాయలసీమ ప్రాంత పేద ప్రజలకు వైద్యసేవలు అందిస్తున్న రుయా ఆస్పత్రికి టీటీడీ నుంచి నిధులను తెప్పించే విషయంలో ఇబ్బందిగా ఉన్న జీవో నెం.165 పై శనివారం వైద్యశాఖ ఉన్నతాధికారులతో సమీక్షిస్తానని హామీ ఇచ్చారు.
రుయాలోని చిన్నపిల్లల ఆస్పత్రిలో సౌకర్యాలు, అధునాతన వైద్య పరికరాలు మెరుగు పరిచేందుకు అధికారుల నివేదిక తరువాత చర్యలుంటాయన్నారు. ఈ సందర్భంగా రుయా అత్యవసర విభాగాన్ని సందర్శించిన మంత్రి అక్కడి వాతావరణం, రోగులకు అందుతున్న సేవలపై అసహనం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమాల్లో మంత్రి వెంట తిరుపతి ఎమ్మెల్యే వెంకటరమణ, స్విమ్స్ డెరైక్టర్ డాక్టర్ భూమా వెంగమ్మ, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సత్యనారాయణ, క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శివశంకర్, ఆరోగ్యశ్రీ ఇన్‌చార్జ్ లోకేశ్వర్‌రెడ్డి, రుయా సూపరింటెండెంట్ డాక్టర్ వీరాస్వామి, సీఎస్‌ఆర్‌ఎంవో డాక్టర్ చిలకల వరసుందరం, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ తదితరులు ఉన్నారు.