టెలీమెడిసిన్‌తో సత్వర వైద్య సేవలు
- రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్
- దెందులూరు సీహెచ్‌సీలో ‘టెలీమెడిసిన్’ ప్రారంభం
దెందులూరు : టెలీమెడిసిన్ ద్వారా రోగికి సత్వర వైద్యం అందేందుకు వైద్యులు తగిన సూచనలు, సలహాలు అందిస్తారని, ఈ విధానం రోగులకు ఎంతో మేలు చేకూరుస్తుందని రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్రంలో ప్రప్రథమంగా దెందులూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన టెలీమెడిసిన్ విభాగాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. డాక్టర్ రమేష్ హాస్పటల్స్ చైర్మన్ మద్దిపాటి సీతారామ్మోహనరావు, ఎండీ డాక్టర్ రమేష్‌ల ఆధ్వర్యంలో ఈ విభాగాన్ని నెలకొల్పారు.
ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ టెలీమెడిసన్ విధానం వల్ల రోగి పరిస్థితిని వైద్యులు ఏ ప్రాంతంలో ఉన్నా తెలుసుకోవచ్చని, ఫోన్‌లో రోగి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని వీడియో ద్వారా వైద్యసేవలు, సూచనలు ఇవ్వడం జరుగుతుందన్నారు. వైద్యులు కాలానుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని జవాబుదారీతనంతో వైద్యసేవలు అందించాలన్నారు.
ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రథమంగా దెందులూరులో టెలీమెడిసన్ విభాగం ప్రారంభించటం సంతోషంగా ఉందన్నారు. దెందులూరుకే పరిమితం కాకుండా నియోజకవర్గంలోని పెదవేగి, పెదపాడు, ఏలూరు రూరల్ మండలాలకు కూడా ఈ సేవలను విస్తరించాలని మంత్రిని కోరారు. జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, డీఎంహెచ్‌వో శంకరరావు, ఎస్‌పీహెచ్‌వో డాక్టర్ దుర్గారావు దొర తదితరులు పాల్గొన్నారు.
ఆరోగ్యశ్రీ పథకం భేష్
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం భేష్ అని వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ కొనియాడారు. ఈ పథకంతో ఎంతోమంది పేదలకు లబ్ధి చేకూరిందన్నారు. పథక లక్ష్యం మంచిదే అయినా అమలులో కొద్దిపాటి లోపాలు ఉన్నాయని తెలిపారు.