ఆరోగ్యశ్రీపై పేరు ఎన్టీఆర్ ఆరోగ్యసేవగా మార్పు
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ ద్వారా ప్రభుత్వాస్పత్రులకు మేలు జరిగిందని, ఈ విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలని ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. రెండోరోజు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఆయన మాట్లాడారు. ఆరోగ్య శ్రీ ద్వారా 65% నిధులు ఆస్పత్రులకు వచ్చాయని, కేవలం 35 శాతం మాత్రమే వైద్యులకు అందుతుందని వైఎస్ జగన్ అన్నారు. పేదవాళ్లకు కార్పొరేట్ వైద్యం అందిందని ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా.. రాజీవ్ ఆరోగ్యశ్రీని ఎన్టీఆర్ ఆరోగ్యసేవగా మారుస్తున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. ఆరోగ్య శ్రీలో 100 జబ్బులను అదనంగా చేరుస్తున్నామని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో యూజర్ ఛార్జీలను పెంచే ఆలోచన ఏదీ ప్రభుత్వానికి లేదని చెప్పారు. ప్రభుత్వాసుపత్రుల్లో బయోమెట్రిక్, ట్రాకింగ్ విధానంపెడతామని మంత్రి శ్రీనివాస్ అన్నారు.