‘మంత్రి కామినేని సిగ్గుతో తల దించుకోవాలి’
గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్యశ్రీ అమలు తీరుపై చర్చించేందుకు సిద్ధమని, మంత్రి కామినేని శ్రీనివాస్ సవాల్ ను స్వీకరిస్తున్నామని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. చర్చకు తేదీ, సమయం, వేదిక రేపు సాయంత్రంలోగా మంత్రి చెప్పాలని సూచించారు. కామినేని బీజేపీ నాయకుడని మర్చిపోయారని, తమ చంద్రబాబు అని సంబోధిస్తూ టీడీపీ నేతగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఆరోగ్యశ్రీలో కమీషన్లు రావు కాబట్టే చంద్రబాబు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. వైద్యం అందక పేదలు అల్లాడుతున్నారని చెప్పారు.
ఆరోగ్యశ్రీకి ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రేపు(శుక్రవారం) రాష్ట్రంలోని అన్ని కలెక్టరేట్ల వద్ద వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేయనున్నట్టు అంబటి ప్రకటించారు. తాము ధర్నా చేస్తామని ప్రకటించిన తర్వాతే అరకొరగా నిధులు విడుదల చేశారన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా ఆస్పత్రిలో ఎలుకలు, చీమలు కొరకడంతో పసిపిల్లలు చనిపోయారని.. దీనికి మంత్రి కామినేని సిగ్గుతో తలదించుకోవాలని అన్నారు.