పరీక్షల్లేవు... మందుల్లేవు | Poor Medical Services In ESI Hospitals In Telangana | Sakshi
Sakshi News home page

పరీక్షల్లేవు... మందుల్లేవు

Published Sat, Feb 26 2022 2:04 AM | Last Updated on Sat, Feb 26 2022 3:17 PM

Poor Medical Services In ESI Hospitals In Telangana - Sakshi

సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ ఈఎస్‌ఐ ఆస్పత్రిలో మూలనపడిన వైద్య పరికరాలు

సాక్షి, హైదరాబాద్‌/నెట్‌వర్క్‌: ఈఎస్‌ఐ ఆస్పత్రుల్లో అందుతున్న వైద్యసేవలకు తార్కాణమిది. ఉద్యోగులకు పూర్తిస్థాయిలో వైద్యసేవలు అందించే లక్ష్యంతో ఏర్పాటుచేసిన ఈఎస్‌ఐ ఆస్పత్రులు సంకట స్థితిలో ఉన్నాయి. పలు విభాగాల్లో సంతృప్తికరస్థాయిలో వైద్యులు, సిబ్బంది ఉన్నా మౌలిక వసతుల లేమి రోగులను వెక్కిరిస్తోంది. వందల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చిన బాధితులు బిత్తరపోతున్నారు.

వైద్య పరికరాలు లేని కారణంగా డాక్టర్లే ప్రైవేటు బాట పట్టిస్తున్నారు. కార్మిక రాజ్య బీమా సంస్థ (ఈఎస్‌ఐసీ) పరిధిలో ఒక సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి, నాలుగు ప్రధాన ఆస్పత్రులు, రెండు డయాగ్నస్టిక్‌ కేంద్రాలు, 70 డిస్పెన్సరీలున్నాయి.

ఇందులో సనత్‌నగర్‌లో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి పూర్తిగా ఈఎస్‌ఐసీ కార్పొరేషన్‌ పరిధిలో కొనసాగుతుండగా.. నాచారం, ఆర్సీపురం, సిర్పూర్‌–కాగజ్‌నగర్, వరంగల్‌ ఆస్పత్రులు, డిస్పెన్సరీలు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని కార్మిక రాజ్య బీమా విభాగం వైద్యసేవలను పర్యవేక్షిస్తోంది. ఆ ఆస్పత్రి మినహా తక్కిన ఆస్పత్రుల్లో వైద్యసేవలు గందరగోళంలో పడ్డాయి. పర్యవేక్షణ లోపం, మౌలికవసతుల కల్పన తదితర కారణాలతో ఇక్కడికి వచ్చే బాధితులకు సకాలంలో సరైన వైద్యం అందకప్రైవేటు ఆస్పత్రులే దిక్కవుతున్నాయి.  

ఈ ఆస్పత్రులు విభిన్నం... 
సాధారణంగా వైద్య, ఆరోగ్య శాఖ ఆస్పత్రులతో ఈఎస్‌ఐ ఆస్పత్రులను పోల్చలేం. రాష్ట్ర ప్రభుత్వ ఆస్పత్రులను పూర్తిగా ప్రభుత్వ బడ్జెట్‌తో నిర్వహిస్తారు. ఇక్కడ రోగుల నుం చి ఎలాంటి ఫీజులు స్వీకరించరు. కానీ ఈఎస్‌ఐ ఆస్పత్రుల నిర్వహణ పూర్తిగా చందాదారుల నుంచి స్వీకరించే ప్రీమియం నుంచే ఖర్చు చేస్తారు. ఈఎస్‌ఐ పరిధిలోకి వచ్చే ఉద్యోగులు చెల్లించే నెలవారీ చందాతో వీటిని నిర్వహిస్తారు. ఒక్కో ఉద్యోగి నెలకు రూ.100–450 వరకు చందా రూపంలో చెల్లిస్తున్నారు. రాష్ట్రంలో 20.78 లక్షల మంది ఈఎస్‌ఐ చందాదారులున్నారు. వీరి కుటుంబ సభ్యులు, వీరిపై ఆధారపడ్డవారిని కలిపితే లబ్ధిదారుల సంఖ్య 80 లక్షలు ఉంటుంది. 

ఓపీ సేవలతో సరి 
రాష్ట్రంలోని నాలుగు ఈఎస్‌ఐ ప్రధాన ఆస్పత్రులు కేవలం అవుట్‌పేషెంట్‌ (ఓపీ) సర్వీసులతోనే సరిపెడుతున్నాయి. జనరల్‌ డాక్టర్లతోపాటు స్పెషలైజ్డ్‌ వైద్యులు ఉన్నప్పటికీ సరైన మౌలికవసతులు లేవు. దీంతో వారంతా సాధారణ ఓపీ చెకప్‌కే పరిమితమవుతున్నారు. శస్త్రచికిత్సలు, ఇతర అత్యాధునిక వైద్య సేవలు అవసరముంటే సనత్‌నగర్‌ ఆస్పత్రికి రిఫర్‌ చేస్తూ చేతులు దులుపుకుంటున్నారు.

ప్రధాన ఆస్పత్రుల్లో సేవలందించే వీలున్నప్పటికీ చిన్నపాటి పరీక్షల కోసం ప్రైవేటు కేంద్రాలకు వెళ్లాల్సి రావడం, అటూఇటూ చక్కర్లు కొట్టడం అటు బాధితులకు, వారి వెంట ఉన్న సహాయకులకు ఇబ్బందికరంగా మారింది. దీంతో పెద్ద సంఖ్యలో ప్రైవేటు ఆస్పత్రుల బాట పడుతున్నారు. 

జాడలేని సీటీ, ఎంఆర్‌ఐ 
సనత్‌నగర్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి మినహాయిస్తే ప్రధాన ఆస్పత్రుల్లో ఎక్కడా ఎంఆర్‌ఐ, సీటీ స్కాన్, 2డీ ఇకో యంత్రాలు లేవు. ఆ సేవల కోసం సనత్‌నగర్‌కు పరుగులు పెట్టాల్సిందే. దీంతో ప్రధాన ఆస్పత్రుల నుంచి రోగులు పెద్దసంఖ్యలో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రికి వెళ్తుండగా... అక్కడ ఒత్తిడి తీవ్రం కావడంతో స్కానింగ్‌ తీసుకునేందుకు రోజు ల తరబడి వేచిచూడాల్సిన పరిస్థితి ఉంది.

పారిశ్రామికవాడలు, వాణిజ్య సముదాయాల మధ్య ఉన్న నాచారం, ఆర్సీపురం ఆస్పత్రుల్లో సేవలు కాస్త మెరుగ్గానే ఉన్నా.. సిర్పూర్‌–కాగజ్‌నగర్, వరంగల్‌ ఆస్పత్రుల్లో సేవలు అధ్వానంగా ఉన్నాయి. ఈ రెండిట్లో కనీసం ఎక్స్‌రే యంత్రాలు కూడా లేవు. వరంగల్‌లో కొన్ని రక్త పరీక్షలు మాత్రమే నిర్వహిస్తుండగా, సిర్పూర్‌–కాగజ్‌నగర్‌లో అది కూడా లేదు. ప్రైవేటు ల్యాబ్‌లో చేయించిన రిపోర్టులను అక్కడి డాక్టర్లు పరిగణనలోకి తీసుకుంటున్నారు. దీంతో రెండిట్లో 95 శాతం బెడ్లు ఖాళీగా ఉంటున్నాయి. ఒక రకంగా ఇక్కడ ఐపీ సేవలు నిలిచిపోయాయని చెప్పొచ్చు. 

వస్తారు... వెళ్తారు 
వరంగల్, సిర్పూర్‌–కాగజ్‌నగర్‌ ఆస్పత్రుల్లో ఐపీ సేవలు నిలిచిపోవడంతో అక్కడ వైద్యులు, సిబ్బంది విధులను మొక్కుబడిగా నిర్వర్తిస్తున్నారు.  గంట, రెండు గంటల పాటు కాలక్షేపం చేసి ఇంటికెళ్తున్నారు. ఇక్కడ మెజార్టీ వైద్యులు హైదరాబాద్‌ నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో రోజుల తరబడి విధులకు ఎగనామం పెట్టే వైద్యులు కూడా ఉన్నట్లు ఆరోపణలున్నాయి. 

అటకెక్కిన పర్యవేక్షణ 
ఈఎస్‌ఐ ఆస్పత్రుల్లో పర్యవేక్షణ గాడితప్పింది. ఆకస్మిక తనిఖీలు, పర్యవేక్షణ నిర్వహించేందుకు రాష్ట్ర కార్యాలయంలో డైరెక్టర్, సంయుక్త సంచాలకుల పాత్ర కీలకం. అదేవిధంగా వరంగల్, హైదరాబాద్‌ జాయింట్‌ డైరెక్టర్లు సైతం తమ పరిధిలోని ఆస్పత్రుల్లో తనిఖీలు చేయాలి. కానీ కొన్నేళ్లుగా ఇలాంటి పర్యవేక్షణలు మచ్చుకైనా లేవు. దీంతో వైద్యు లు, సిబ్బంది హాజరు ఇష్టారాజ్యంగా మారింది. ఎలాంటి అనుమతులు లేకుండా రోజుల తరబడి సెలవులు పెట్టడం, వాటిని రెన్యువల్‌ చేసుకోవడంలాంటి తంతు ఏళ్లుగా జరుగుతోంది. డైరెక్టర్‌ ఇన్సూరెన్స్‌ మెడికల్‌ సర్వీసెస్‌ (డీఐఎంఎస్‌) విభాగాధిపతి హోదాలో రెండున్నరేళ్లుగా ఇన్‌చార్జ్‌ అధికారి ఉన్నందునే ఈ పరిస్థితి వచ్చినట్లు విమర్శలు వస్తున్నాయి.

ఈ చిత్రంలోని వ్యక్తి పేరు ఎం.ప్రవీణ్‌కుమార్‌. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాకలోని ఐటీసీకి చెందిన బీపీఎల్‌ కంపెనీలో పనిచేస్తున్నారు. డస్ట్‌ ఎలర్జీతో బాధపడుతూ ఆస్తమా బారిన పడ్డాడు. సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నప్పటికీ ఖర్చుకు భయపడి వరంగల్‌ ఈఎస్‌ఐ ఆస్పత్రికెళ్లాడు.

వైద్యుడు మాత్రలు రాయడంతోపాటు చెస్ట్‌ ఎక్స్‌రే, స్కానింగ్‌ తీయించాలని సూచించారు. కానీ అక్కడ ఈ రెండు వసతులు లేవు. దీంతో వాటికోసం ప్రైవేటు డయాగ్నస్టిక్‌ సెంటర్‌కు పరుగుపెట్టాడు. అన్నిరకాల సేవలు దొరుకుతాయని భావించి 180 కి.మీ. దూరం నుంచి వచ్చిన ఆయనకు నిరాశ తప్పలేదు. 

11 గంటలైనా తాళాలు తీయలే
వరంగల్‌ ఆస్పత్రిలో వైద్యులు సమయపాలన పాటించకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. సుదూర ప్రాంతాల నుంచి అత్యవసర పరిస్థితుల్లో వచ్చేవారిని హైదరాబాద్‌లోని ఈఎస్‌ఐ ఆస్పత్రులకు రెఫర్‌ చేస్తున్నారు. అల్ట్రాసౌండ్, డిజిటల్‌ ఎక్స్‌రే, సీటీ స్కాన్‌ తదితర పరికరాలు లేకపోవడంతో రోగులు తిప్పలు పడుతున్నారు.


వరంగల్‌ ఈఎస్‌ఐ ఆస్పత్రిలో ఉదయం 11 గంటలు అయినా డాక్టర్‌ రాకపోవడంతో ఖాళీగా దర్శనమిచ్చిన కుర్చీ  

శుక్రవారం ఈ ఆస్పత్రిని ‘సాక్షి’విజిట్‌ చేయగా ఉదయం 11 గంటలకు కూడా పిల్లలు, ఆర్థోపెడిక్‌ విభాగాల తాళం కూడా తీయలేదు. గైనకాలజిస్టు, డెంటిస్టు, ఆర్థోపెడిక్, పీడియాట్రిక్‌ వైద్యుల పోస్టులు ఖాళీగా ఉండటంతో ఇక్కడికొచ్చే రోగుల సంఖ్య బాగా తగ్గిందని సిబ్బంది చెబుతున్నారు. 

వారం రోజులుగా తిరుగుతున్నా..
నిజామాబాద్‌కు చెందిన ఇతని పేరు నాగభూషణం. ఇతనికి గుండె ఆపరేషన్‌ జరిగింది. ప్రతి నెలా మందుల కోసం నిజామాబాద్‌ న్యాల్‌కల్‌ రోడ్డులోని ఈఎస్‌ఐ ఆస్పత్రికి వస్తుంటారు. వైద్యులు రాసిన పది రకాల మందుల కోసం ప్రిస్కిప్షన్‌ తీసుకుని ఇక్కడకు వస్తే ఏ ఒక్క మాత్ర ఉండడం లేదు. వారం రోజులుగా తిరుగుతున్నప్పటికీ ఇవ్వడం లేదు. బయట మాత్రలు కొనుగోలు చేసే స్తోమత లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.  

ఖర్చులు తడిసిమోపెడు 
నేను కొన్నేళ్లుగా నరాల సమస్యతో ఇబ్బంది పడుతున్నా. తూప్రాన్‌ డిస్పెన్సరీ వైద్యుల సూచనతో ఆర్సీపురం ఆస్పత్రికి వచ్చాను. అయితే ఎంఆర్‌ఐ, సీటీ స్కాన్‌ అందుబాటులో లేవని డాక్టర్లు చెప్పారు. దీంతో సనత్‌నగర్‌ ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించాను. ఆయా రిపోర్టులను తిరిగి ఆర్సీపురం వైద్యులకు చూపించి మందులు రాయించుకున్నా. దీనికోసం ఆరేడుసార్లు తిరిగాను. ప్రయాణ ఖర్చులు సైతం తడిసి మోపెడవుతున్నాయి.

– సత్యనారాయణ, తూప్రాన్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement