సాక్షి, నంద్యాల జిల్లా: భుజం నొప్పితో నంద్యాలలో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లిన నారా లోకేష్.. ఎంఆర్‌ఐ స్కానింగ్ చేయించుకున్నారు. యువగళం పాదయాత్ర ప్రస్తుతం నంద్యాల నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఆయన కొద్ది రోజులుగా భుజం నొప్పితో ఇబ్బంది పడుతున్నారు. రెండు మూడు రోజులుగా ఈ నొప్పి సంక్లిష్టంగా మారడంతో వైద్యుల సూచన మేరకు నంద్యాలలోని మాగ్నా MRI సెంటర్ లో స్కానింగ్ చేయించుకున్నారు.
జనవరి 27, 2023న యువగళం పేరుతో పాదయాత్ర ప్రారంభించిన నారా లోకేష్ నాయుడు.. 400 రోజుల్లో 4 వేల కిలోమీటర్లు నడుస్తానని ప్రకటించారు. ఇప్పటివరకు 3 జిల్లాల్లో పర్యటించిన లోకేష్ అష్టకష్టాలు పడుతున్నారు. పెద్దగా ప్రజల నుంచి స్పందన లేకపోవడం ఆయన్ను నిరుత్సాహానికి గురి చేస్తోంది. ఎలాగైనా వాడి వేడి ప్రసంగాలతో జనాన్ని ఆకట్టుకోవాలని లోకేష్ చేస్తోన్న ప్రయత్నాలు కూడా చాలా సార్లు బెడిసికొడుతున్నాయి.
పదాలను స్పష్టంగా పలకలేకపోవడం, వ్యాక్యాన్ని చెప్పలేకపోవడం, ఏ విషయం చెబుతున్నాడో దానిపై పూర్తిగా అవగాహన లేకపోవడం, చెప్పే మాటల్లో నిలకడలేమి ఉండడం, చేసింది ఒకటయితే.. దానికి విరుద్ధమైన ప్రకటనలు చేయడం, నేరుగా విమర్శించలేక.. తిట్ల దండకం అందుకోవడం.. ఇవన్నీ పాదయాత్రలో చినబాబు బయటపెట్టుకున్న అంశాలు. దీనికి తోడు పలుమార్లు "సైకిల్ పోవాలి" అంటూ నోరు జారడం పార్టీ నేతలకు ఇబ్బందికరంగా మారింది. పైగా తనను తాను మూర్ఖుడని బలంగా చెప్పుకుంటున్నారు. ప్రత్యర్థిని భయపెట్టే క్రమంలో నిజాలు చెప్పాలి, ఆధారాలు చూపించాలి కానీ.. వాటిని వదిలి తిట్ల దండకం అందుకోవడం, మూర్ఖుడినని చెప్పుకోవడం, తనకు అవకాశం ఇస్తే అంతు చూస్తానని వ్యాఖ్యానాలు చేయడం ద్వారా గతంలో ఉన్న ఇమేజ్ కూడా ఇప్పుడు పోయినట్టయింది.
దానికి తోడు ఇప్పటివరకు వెళ్లిన చాలా నియోజకవర్గాల్లో వర్గపోరు రచ్చకెక్కడం, గ్రూపులుగా విడిపోయి వ్యూహాలు, ప్రతివ్యూహాలు, దాడులు చేసుకోవడం, అంతంత మాత్రంగా ఉన్న పార్టీ ఇమేజ్ ను మరింత దెబ్బ తీసినట్టవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment