ఎంఆర్‌ఐ స్కానింగ్ కేంద్రాన్ని ప్రారంభిస్తున్న రుయా సూపరింటెండెంట్ డాక్టర్ సిద్ధానాయక్
తిరుపతి రుయా ఆస్పత్రిలో ఎట్టకేలకు ఎంఆర్‌ఐ స్కానింగ్ కేంద్రం సేవలు ప్రారంభమయ్యాయి. ఏడాదిన్నర క్రితం ప్రారంభం కావాల్సి ఉన్నా అనేక అడ్డంకులు ఏర్పడ్డాయి. చివరకు స్కానింగ్ భవనం నిర్మాణ పనులు పూర్తయినా అతిథి కోసం రెండు నెలల పాటు ఎదురుచూడాల్సి వచ్చింది. అయినా, ఫలితం శూన్యం. ఈ క్రమంలోనే ఎన్నికల కోడ్ వస్తుందనే భయంతో సెంటర్ కాంట్రాక్టర్ హడావుడిగా గురువారం ఆస్పత్రి సూపరింటెండెంట్ చేతుల మీదుగా కేంద్రాన్ని ప్రారంభించారు. దీంతో నిరుపేదలకు కొంతైనా ఆర్థికభారం తగ్గినట్లయింది.
చిత్తూరు, తిరుపతి (అలిపిరి) : రుయా ఆస్పత్రిలో గత 2 వ తేదీన ఎంఆర్‌ఐ (మేగ్నటిక్ రెసోనన్స్ ఇమేజింగ్) స్కానింగ్ భవన నిర్మాణం పూర్తయ్యింది. రూ.10 కోట్ల ప్రాజెక్ట్ అని చెప్పుకునే స్కానింగ్ కేంద్రం కాంట్రాక్టర్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతి«థి కోసం నిర్మాణ పనులు ఆలస్యం చేశారు. ఆరు నెలల క్రితం మిషనరీని తెప్పించినా ముఖ్య అతిథి కోసం వాయిదా వేసుకుంటూ వచ్చారు. గత నెల 2న ప్రారంభం కావాల్సి ఉన్నా ప్రారంభానికి నోచుకోలేదు. ఇందుకు అధికారులు వంతపాడుతూ వచ్చారన్న విమర్శలు వున్నాయి.
కోడ్ భయంతో..!
ఎన్నికల కోడ్ అమలైతే ఎంఆర్‌ఐ స్కానింగ్ కేంద్రం ప్రారంభానికి మరింత ఆలస్యం అవుతుం దన్న భయంతో గురువారం కాంట్రాక్టర్ హడా వుడిగా కేంద్రాన్ని ప్రారంభించారు. రుయా ఉన్నతాధికారులను పిలిచి సేవలకు శ్రీకారం చుట్టారు. అతిథి కోసం ఎదురుచూపులు ఫలిం చకపోవడంతో చడీచప్పుడు కాకుండా ప్రారంభిం చడంపై రుయా ఉద్యోగులు ఆశ్చర్యానికి లోనయ్యారు.
కనిపించని అభివృద్ధి కమిటీ
ఎంఆర్‌ఐ స్కానింగ్ కేంద్రం ప్రారంభ సమయంలో రుయా అభివృద్ధి కమిటీ సభ్యులు ఒక్కరూ కనిపించలేదు. రుయా అభివృద్ధి కోసం నిత్యం ఆస్పత్రిలో తిరుగుతూ పర్యవేక్షించే కమిటీ వర్కింగ్ చైర్మన్ చినబాబుకు ఆహ్వానం అందలేదు. కేంద్రం ప్రారంభానికి ఆహ్వానించకపోవడం పట్ల కమిటీ సభ్యులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.
రోగులకు ఊరట
రుయా ఆస్పత్రిలో ఏడాదిన్నర క్రితం ప్రారంభం కావాల్సిన ఎంఆర్‌ఐ స్కానింగ్ కేంద్రం సేవలకు ఎట్టకేలకు మోక్షం లభించింది. స్కానింగ్‌సేవలు అందుబాటులోకి రావడంతో నిరుపేద రోగులకు ఆర్థిక భారం నుంచి వెసులుబాటు లభించినట్లయింది. ప్రైవేట్ స్కానింగ్ కేంద్రాల్లో ఎంఆర్‌ఐ సేవలకు రూ.4,500 నుంచి రూ. 5 వేలు వసూలు చేస్తున్నారు. రుయాకు ఆధునిక సేవలు అందుబాటులోకి రావడంతో రోగులకు కాస్త ఊరట లభించినట్లయింది.
రోగులకు మెరుగైన సేవలు
రుయా ఆస్పత్రిలో రోగులకు మెరుగైన సేవలు అందిస్తున్నాం. సిటీ, ఎంఆర్‌ఐ స్కానింగ్ కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయి. నిరుపేదలకు మరింత మెరుగైన సేవ చేసే అవకాశం లభించింది.
– డాక్టర్ సిద్ధానాయక్, సూపరింటెండెంట్,రుయా ఆస్పత్రి, తిరుపతి
Comments
Please login to add a commentAdd a comment