ఇంటర్‌ ప్రాక్టికల్స్‌లో మాల్‌ ప్రాక్టీస్‌ | Malpractice in Intermediate Practicals SPSR Nellore | Sakshi
Sakshi News home page

మాల్‌ ప్రాక్టీస్‌

Published Tue, Feb 4 2020 12:16 PM | Last Updated on Tue, Feb 4 2020 12:16 PM

Malpractice in Intermediate Practicals SPSR Nellore - Sakshi

డీకేడబ్ల్యూలోకి విద్యార్థులతో పాటు వెళుతున్న ఓ ప్రైవేట్‌ కళాశాలకు చెందిన అధ్యాపకుడు

ఇంటర్మీడియట్‌ ప్రాక్టికల్స్‌ పరీక్షల్లో మాల్‌ ప్రాక్టీస్‌ జరిగిపోతోంది. ‘సాక్షి’ కథనం అక్షరాల నిజమవుతోంది. సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం.. పకడ్బందీగా పరీక్షలను నిర్వహిస్తున్నామని అధికారులు చెబుతున్నా సెంటర్లలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ప్రాక్టికల్స్‌ జరిగే కేంద్రాల చుట్టూ కార్పొరేట్‌ కళాశాలలకుచెందిన అధ్యాపకులు, సిబ్బంది హల్‌చల్‌ చేస్తున్నారు. సెంటర్లలోకి బయట వ్యక్తులకు అనుమతి లేకున్నా ప్రైవేట్‌ కళాశాలకు చెందిన వారు హడావుడి చేస్తున్నారు. సోమవారం నెల్లూరులోని డీకేడబ్ల్యూ కళాశాలలో ప్రైవేట్‌ కళాశాలలకు చెందిన వ్యక్తులు విద్యార్థులతో నేరుగా ప్రాక్టికల్స్‌ హాల్‌ వైపు వెళ్లిన వైనం బయటపడింది. ర్యాంక్‌లే లక్ష్యంగా ప్రాక్టికల్స్‌లో మార్కులు వేయించుకునేందుకు కార్పొరేట్‌ కళాశాలలు అక్రమాలకు తెగబడుతున్నాయి. చీఫ్‌ సూపరింటెండెంట్లు, ఇన్విజిలేటర్లతో ఏ రోజుకారోజు సెల్‌ఫోన్లలో మంతనాలుజరుపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

నెల్లూరు(టౌన్‌): జిల్లాలో ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ ఈ నెల 1వ తేదీన ప్రారంభం అయ్యాయి. ఈ నెల 20వ తేదీ వరకు 4 విడతల్లో పరీక్షలు జరుగుతాయి. జిల్లాలో 38 ప్రభుత్వ, 163 ప్రైవేట్‌ కళాశాలల  నుంచి 26,716 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. వీరిలో ఎంపీసీ 19,802 మంది, బైపీసీ 4,696 మంది, ఒకేషనల్‌ 2,218 మంది విద్యార్థులు ఉన్నారు. మొత్తం 48 సెంటర్లలో ప్రాక్టికల్స్‌ నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది నుంచి ఇంటర్‌లో మార్కులు ప్రవేశ పెట్టే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.  ఒక్కో సబ్జెక్టులో 30 మార్కులుంటాయి. ఈ నేపథ్యంలో కళాశాలల యాజమాన్యాలు ర్యాంక్‌ సాధించే విద్యార్థికి ఫుల్‌ మార్కులు, సాధారణ విద్యార్థికి ఒక్కో సబ్జెక్ట్‌లో 23 నుంచి 26 మార్కులు వేసే విధంగా చీఫ్‌ సూపరింటెండెంట్లు, ఎగ్జామినర్లతో ఒప్పందం చేసుకున్నారని తెలుస్తోంది. ఇందుకు ప్రతిగా వారికి రూ.300 నుంచి రూ.500 (ఒక్కో విద్యార్థికి) ముట్టజెబుతున్నట్టు సమాచారం. అయితే ప్రాక్టికల్స్‌ ఫిక్స్‌ అయ్యాయని గత నెల 30న ‘సాక్షి’లో ‘మార్కుల వేట’ శీర్షికతో కథనం ప్రచురితమైంది. 

ఏమి జరుగుతోందంటే..
ప్రాక్టికల్స్‌ సెంటర్లలో సీసీ కెమెరాలు బిగించినా అక్రమాలు యథేచ్ఛగా జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. కొన్ని సెంటర్లలో సీసీ కెమెరాలు పని చేయని పరిస్థితి ఉందని అధ్యాపకులే చెబుతున్నారు. తొలిసారిగా ప్రాక్టికల్స్‌ లైవ్‌లో జరుగుతున్నాయని ఇంటర్‌ అధికారులు చెబుతున్నా ప్రైవేట్‌ వ్యక్తులు కళాశాలల్లోనే హల్‌చల్‌ చేస్తున్నారంటే పరీక్షలు ఎంత పకడ్బందీగా జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. సీసీ కెమెరాలు ఏ మాత్రంపని చేస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. కార్పొరేట్‌ యాజమాన్యాలు మైక్రో జెరాక్స్‌లు చేయించి విద్యార్థులకు అందజేస్తున్నట్టు విశ్వశనీయ సమాచారం. కొన్ని సెంటర్లలో అయితే ఇన్విజిలేటర్లే చెబుతున్న పరిస్థితి ఉంది. స్క్వాడ్‌ బృందాలు తమకేం పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. సీసీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తే తప్ప అక్కడ జరుగుతున్న తంతు బయటపడే అవకాశం ఉందని కొందరు అధ్యాపకులే బహిరంగంగా చెబుతున్నారు. ఈ విషయంపై వివరణ కోరేందుకు ఆర్‌ఐఓ శ్రీనివాసరావును ఫోన్‌లో సంప్రదించగా ఆయన స్పందించలేదు.

ప్రాక్టికల్స్‌కు 134 మంది గైర్హాజరు
ఇంటర్మీడియట్‌ ప్రాక్టికల్స్‌కు సోమవారం జిల్లా వ్యాప్తంగా మొత్తం 134 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఉదయం జరిగిన ప్రాక్టికల్స్‌కు 2,832 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా 2,749 మంది హాజరయ్యారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement