Intermediate practical exams
-
31 నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్
సాక్షి, అమరావతి: ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ పరీక్షలను ఈనెల 31వ తేదీ నుంచి ఏప్రిల్ 24వ తేదీవరకు నిర్వహించనున్నారు. ఇందుకోసం ఇంటర్మీడియెట్‌బోర్డు ఏర్పాట్లు పూర్తిచేసింది. ఎంపీసీ స్ట్రీమ్ నుంచి 2,60,012 మంది, బైపీసీ స్ట్రీమ్‌నుంచి 98,462 మంది మొత్తం 3,58,474 మంది హాజరుకానున్నారు. 947 కేంద్రాల్లో ఉదయం (9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు), మధ్యాహ్నం (2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు) సెషన్లలో ఆదివారాల్లో కూడా ఈ పరీక్షలు నిర్వహిస్తారు. విద్యార్థులెవరికీ ఫిజికల్ హాల్ టికెట్లను బోర్డు పంపిణీ చేయటంలేదు. బోర్డు వెబ్సైట్ ‘బీఐఈ.ఏపీ.జీవోవీ.ఐఎన్’ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. ప్రైవేటు జూనియర్ కాలేజీల్లోని పరీక్ష కేంద్రాలకు ప్రభుత్వ, ఎయిడెడ్ జూనియర్ కాలేజీల నుంచి చీఫ్ సూపరింటెండెంట్లను నియమించనున్నారు. అన్ని పరీక్ష కేంద్రాల్లోను బోటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్సు ల్యాబ్స్‌లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఆన్లైన్లో ప్రశ్నపత్రం ప్రాక్టికల్ పరీక్షలకు ప్రశ్నపత్రాలను ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. ప్రశ్నపత్రాన్ని వెబ్సైట్నుంచి డౌన్లోడ్ చేసుకున్న తరువాత పరీక్ష సమయానికి ముందు బోర్డు అధికారులు విడుదల చేసే ఓటీపీతో మాత్రమే ఓపెన్ అవుతుంది. సెషన్ల వారీగా పరీక్ష ముగిసిన వెంటనే మూల్యాంకనం పూర్తయిన సమాధాన పత్రాలు, ఒరిజినల్ అవార్డు లిస్టు, డూప్లికేట్ అవార్డు లిస్టు కవర్లో ఉంచి సీల్ చేయాలి. ఈ ప్రక్రియ మొత్తం సీసీ కెమెరాల ముందు నిర్వహించాలి. పరీక్షలలో అక్రమాలు జరిగితే ఆ కేంద్రంలోని పరీక్షల నిర్వాహకులు, విద్యార్థులను బాధ్యులుగా పరిగణిస్తారు. ప్రాక్టికల్ రికార్డు బుక్సును వేరొకరు వినియోగించకుండా ఒకటి రెండుచోట్ల గోటితో చించాలి. ఫలితాలు విడుదలయ్యే వరకు ఈ ప్రాక్టికల్ రికార్డు బుక్సును సెషన్ల వారీగా, బ్యాచీల వారీగా భద్రపరిచి ఉంచాలి. చీఫ్ సూపరింటెండెంటుకు మాత్రమే పరీక్ష కేంద్రాల్లో సెల్‌ఫోను వినియోగించవచ్చు. కోవిడ్ జాగ్రత్తలతో పరీక్షలు కోవిడ్–19 వైరస్ దృష్ట్యా ప్రొటోకాల్ నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పకుండా పాటించాలి. మాస్కు ధరించడం తప్పనిసరి. పరీక్ష కేంద్రాలను శానిటైజేషన్ చేయాలి. కోవిడ్–19తో బాధపడుతున్న విద్యార్థులకు వేరుగా ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించాలి. విద్యార్థులు ఒకే దగ్గర గుంపులుగా చేరకుండా ఉండేందుకు వీలుగా బ్యాచ్‌లోని 20 మంది విద్యార్థుల్లో 10 మందిని మాత్రమే ప్రాక్టికల్ రూములోకి అనుమతించాలి. వారి తరువాత మిగతా 10 మందికి పరీక్షలు నిర్వహించాలి. -
ఇంటర్ ప్రాక్టికల్స్‌లో మాల్ ప్రాక్టీస్
ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ జరిగిపోతోంది. ‘సాక్షి’ కథనం అక్షరాల నిజమవుతోంది. సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం.. పకడ్బందీగా పరీక్షలను నిర్వహిస్తున్నామని అధికారులు చెబుతున్నా సెంటర్లలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ప్రాక్టికల్స్ జరిగే కేంద్రాల చుట్టూ కార్పొరేట్ కళాశాలలకుచెందిన అధ్యాపకులు, సిబ్బంది హల్చల్ చేస్తున్నారు. సెంటర్లలోకి బయట వ్యక్తులకు అనుమతి లేకున్నా ప్రైవేట్ కళాశాలకు చెందిన వారు హడావుడి చేస్తున్నారు. సోమవారం నెల్లూరులోని డీకేడబ్ల్యూ కళాశాలలో ప్రైవేట్ కళాశాలలకు చెందిన వ్యక్తులు విద్యార్థులతో నేరుగా ప్రాక్టికల్స్ హాల్ వైపు వెళ్లిన వైనం బయటపడింది. ర్యాంక్‌లే లక్ష్యంగా ప్రాక్టికల్స్‌లో మార్కులు వేయించుకునేందుకు కార్పొరేట్ కళాశాలలు అక్రమాలకు తెగబడుతున్నాయి. చీఫ్ సూపరింటెండెంట్లు, ఇన్విజిలేటర్లతో ఏ రోజుకారోజు సెల్ఫోన్లలో మంతనాలుజరుపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నెల్లూరు(టౌన్): జిల్లాలో ఇంటర్ ప్రాక్టికల్స్ ఈ నెల 1వ తేదీన ప్రారంభం అయ్యాయి. ఈ నెల 20వ తేదీ వరకు 4 విడతల్లో పరీక్షలు జరుగుతాయి. జిల్లాలో 38 ప్రభుత్వ, 163 ప్రైవేట్ కళాశాలల నుంచి 26,716 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. వీరిలో ఎంపీసీ 19,802 మంది, బైపీసీ 4,696 మంది, ఒకేషనల్ 2,218 మంది విద్యార్థులు ఉన్నారు. మొత్తం 48 సెంటర్లలో ప్రాక్టికల్స్ నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది నుంచి ఇంటర్లో మార్కులు ప్రవేశ పెట్టే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఒక్కో సబ్జెక్టులో 30 మార్కులుంటాయి. ఈ నేపథ్యంలో కళాశాలల యాజమాన్యాలు ర్యాంక్ సాధించే విద్యార్థికి ఫుల్ మార్కులు, సాధారణ విద్యార్థికి ఒక్కో సబ్జెక్ట్‌లో 23 నుంచి 26 మార్కులు వేసే విధంగా చీఫ్ సూపరింటెండెంట్లు, ఎగ్జామినర్లతో ఒప్పందం చేసుకున్నారని తెలుస్తోంది. ఇందుకు ప్రతిగా వారికి రూ.300 నుంచి రూ.500 (ఒక్కో విద్యార్థికి) ముట్టజెబుతున్నట్టు సమాచారం. అయితే ప్రాక్టికల్స్ ఫిక్స్ అయ్యాయని గత నెల 30న ‘సాక్షి’లో ‘మార్కుల వేట’ శీర్షికతో కథనం ప్రచురితమైంది. ఏమి జరుగుతోందంటే.. ప్రాక్టికల్స్ సెంటర్లలో సీసీ కెమెరాలు బిగించినా అక్రమాలు యథేచ్ఛగా జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. కొన్ని సెంటర్లలో సీసీ కెమెరాలు పని చేయని పరిస్థితి ఉందని అధ్యాపకులే చెబుతున్నారు. తొలిసారిగా ప్రాక్టికల్స్ లైవ్‌లో జరుగుతున్నాయని ఇంటర్ అధికారులు చెబుతున్నా ప్రైవేట్ వ్యక్తులు కళాశాలల్లోనే హల్చల్ చేస్తున్నారంటే పరీక్షలు ఎంత పకడ్బందీగా జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. సీసీ కెమెరాలు ఏ మాత్రంపని చేస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. కార్పొరేట్ యాజమాన్యాలు మైక్రో జెరాక్స్‌లు చేయించి విద్యార్థులకు అందజేస్తున్నట్టు విశ్వశనీయ సమాచారం. కొన్ని సెంటర్లలో అయితే ఇన్విజిలేటర్లే చెబుతున్న పరిస్థితి ఉంది. స్క్వాడ్ బృందాలు తమకేం పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. సీసీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తే తప్ప అక్కడ జరుగుతున్న తంతు బయటపడే అవకాశం ఉందని కొందరు అధ్యాపకులే బహిరంగంగా చెబుతున్నారు. ఈ విషయంపై వివరణ కోరేందుకు ఆర్ఐఓ శ్రీనివాసరావును ఫోన్లో సంప్రదించగా ఆయన స్పందించలేదు. ప్రాక్టికల్స్‌కు 134 మంది గైర్హాజరు ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్‌కు సోమవారం జిల్లా వ్యాప్తంగా మొత్తం 134 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఉదయం జరిగిన ప్రాక్టికల్స్‌కు 2,832 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా 2,749 మంది హాజరయ్యారు. -
జంబ్లింగ్ విధానంపై పరిశీలన: సబిత
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ లో పరీక్షా కేంద్రాల జంబ్లింగ్ విధానాన్ని అమలు చేసే అంశాన్ని పరిశీలిస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. దీనిపై అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. నిబంధనలకు విరుద్ధంగా వేసవి సెలవుల్లో కాలేజీలు నడిపిన వారికి నోటీసులు జారీ చేశామన్నారు. ప్రైవేటు కాలేజీల్లోనూ కౌన్సిలర్లు ప్రైవేటు కళాశాలల విద్యార్థులు ఎక్కువగా ఒత్తిడి గురవుతున్నారని, ప్రైవేటు కాలేజీల్లో కూడా కౌన్సిలర్ల వ్యవస్థ ఉండాలని మంత్రి సబిత అన్నారు. నాంపల్లిలోని వనిత మహా విద్యాలయ ఆడిటోరియంలో విద్యార్థుల ఆత్మహత్యల నివారణకై జూనియర్ కళాశాలల్లో నియమితులైన కౌన్సిలర్ల రెండు రోజుల శిక్షణ శిబిరాన్ని మంత్రి మంగళవారం ప్రారంభించారు. -
నేటినుంచి ఇంటర్ ప్రాక్టికల్స్
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు బుధవారం నుంచి మార్చి 4 వరకు జరగనున్నాయి. ఈ పరీక్షలకు జంట జిల్లాల నుంచి సుమారు లక్షమంది విద్యార్థులు హాజరవుతున్నారు. పరీక్షలు ప్రతి రోజూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు సెషన్లలో జరుగుతాయి. హైదరాబాద్ జిల్లాలో 194, రంగారెడ్డి జిల్లాలో 290 పరీక్షాకేంద్రాలను ఏర్పాటు చేశారు. లక్షమందికి పైనే... జంట జిల్లాల నుంచి ఈ ఏడాది ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల సంఖ్య లక్ష దాటింది. ైెహ దరాబాద్ జిల్లాలో 30,055 మంది జనరల్, 6,265 మంది ఒకేషనల్ పరీక్షలకు హాజరవుతున్నారు. రంగారెడ్డి జిల్లా నుంచి 61,473 మంది జనరల్, 5,061 మంది ఒకేషనల్ పరీక్షలకు సిద్ధమయ్యారు. ఒకేషనల్ అభ్యర్థులకు 19 నాన్-పారామెడికల్ కోర్సులకు సంబంధించి ప్రశ్నాపత్రాలను ఇంటర్‌బోర్డు అందజేస్తుంది. పారామెడికల్ కోర్సుల విద్యార్థులకు మాత్రం ఎగ్జామినర్లే ప్రశ్నాపత్రాలను తయారు చేసి ఇస్తారు. అరగంట ముందే చేరుకోవాలి: ప్రతాప్, రంగారెడ్డి జిల్లా ఆర్ఐవో ప్రాక్టికల్ పరీక్షలకు విద్యార్థులు నిర్దేశిత సమయానికంటే అరగంట ముందుగా పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి. పరీక్షకు వెళ్లేపుడు హాల్‌టికెట్, ప్రాక్టికల్ రికార్డ్ బుక్, కాంపాస్ బాక్స్ వెంట తీసికెళ్లాలి. ఎటువంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను అనుమతించేది లేదు. బోర్డు నిబంధనలను ఉల్లంఘిస్తే ఆయా పరీక్షా కేంద్రాల యాజమాన్యాలు, విద్యార్థులపై ఏపీ పబ్లిక్ పరీక్షల చట్టం 1997 ప్రకారం చర్యలు తీసుకుంటాం. -
సమర్థంగా ఇంటర్ ప్రాక్టికల్స్
జిల్లాలో 175 పరీక్షా కేంద్రాల ఏర్పాటు నాలుగు విభాగాలుగా నిర్వహణ ఆర్ఐఓ కె.వెంకట్రామయ్య వెల్లడి విజయవాడ, న్యూస్‌లైన్ : ఈ నెల 12 నుంచి జరగనున్న ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించాలని ఆ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి కె.వెంకట్రామయ్య అన్నారు. పరీక్షలో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్స్ నిర్వహణపై పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ ఆఫీసర్లతో మహాత్మాగాంధీ రోడ్డులోని మాంటిస్సోరి మహిళా కళాశాలలో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఆర్ఐఓ వెంకట్రామయ్య మాట్లాడుతూ ఇంటర్ ప్రాక్టికల్స్‌కు జిల్లా వ్యాప్తంగా 175 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి సిబ్బంది ఎంపిక ప్రక్రియ పూర్తయిందన్నారు. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకు జిల్లాలో 48 వేల 913 మంది విద్యార్థులు హాజరు కానున్నట్లు తెలిపారు. వీరిలో ఎంపీసీ విద్యార్థులు 34 వేల 584 మంది కాగా, బైపీసీ విద్యార్థులు 11 వేల 695 మంది, ఒకేషనల్ అభ్యర్థులు 2,634 మంది ఉన్నట్లు వివరించారు. మొదటి స్పెల్‌లో ఈ నెల 12 నుంచి 16 వరకు, రెండో స్పెల్‌లో 17 నుంచి 22 వరకు, మూడో స్పెల్‌లో 23 నుంచి 28 వరకు, నాలుగో స్పెల్‌లో 29 నుంచి మార్చి 4 వరకు ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతాయని తెలిపారు. పరీక్షల సందర్భంగా ప్రతి కళాశాలా విధిగా లేబరేటరీలలో పరికరాలు ఏర్పాటు చేసుకోవాలని స్పష్టం చేశారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేశామని, వారు నిరంతరం పర్యవేక్షిస్తారని చెప్పారు. థియరీ పరీక్షలకూ ఏర్పాట్లు పూర్తి... ప్రాక్టికల్ పరీక్షల అనంతరం మార్చి 12 నుంచి థియరీ పరీక్షలు జరుగుతాయని ఆర్ఐఓ చెప్పారు. వాటికి కూడా అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసినట్లు తెలిపారు. ఇప్పటికే థియరీ పరీక్షలకు సంబంధించి పరీక్షా కేంద్రాలు ఎంపిక చేశామని, త్వరలో వాటికి సంబంధించి చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ ఆఫీసర్లకు అవగాహన సదస్సు ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. ప్రభుత్వ కళాశాలల అధ్యాపకులు సాల్మన్‌రాజు, ప్రసాదరావులతో పాటు పలు కళాశాలల ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు, చీఫ్ సూపరింటెండెంట్లు పాల్గొన్నారు. -
ఫిబ్రవరి 12నుంచి ఇంటర్ ప్రయోగ పరీక్షలు
నల్లగొండ అర్బన్, న్యూస్‌లైన్ : ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు వచ్చే ఫిబ్రవరి 12నుంచి నిర్వహిస్తారు. నాలుగు విడతలుగా ఐదురోజుల చొప్పున ఇవి జరుగుతాయి. జిల్లా వ్యాప్తంగా 29,202మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. వారిలో 21,133 మంది ఎంపీసీ, 8069 మంది బైపీసీ ద్వితీయ సంవత్సరం విద్యార్థులున్నారు. 154 జూనియర్ కళాశాలల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఏడాది కూడా జంబ్లింగ్ విధానం లేకుండా ప్రయోగ పరీక్షలు జరుగుతాయి. ఉదయం,మధ్యాహ్నం చొప్పున రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తారు. ఎగ్జామినర్ల నియామకం ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణకు ఎగ్జామినర్ల జాబి తాను సిద్ధం చేసి ఇంటర్మీడియట్ బోర్డుకు అధికారులు నివేదించారు. అక్కడి నుంచి నియామక ఉత్తర్వులు రావాల్సి ఉంది. పరీక్షల నిర్వహణ అనంతరం ఏ పూట ప్రశ్నపత్రాలను ఆ పూటే వ్యాల్యుయేషన్ చేసి సీల్‌తో సంబంధిత కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్‌కు అప్పగిస్తారు. జిల్లా పరీక్షల కమిటీ ప్రాక్టికల్ పరీక్షలను సక్రమంగా నిర్వహిం చేం దుకు జిల్లా పరీక్షల కమిటీ (డీఈసీ) బాధ్యతలు చూస్తుంది. ఇందులో ఇద్దరు సీనియర్ ప్రిన్సిపాళ్లు, ఒక సీనియర్ జేఎల్ ఉంటారు. నలుగురు ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేస్తాయి. పరీక్షలు పకడ్బందీగా నిర్వహిస్తాం - ్ర పకాశ్బాబు, ఆర్ఐఓ, నల్లగొండ ‘ప్రాక్టికల్ పరీక్షలను జిల్లాలో పకడ్బందీగా నిర్వహిస్తాం. పరీక్షల నిర్వహణకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. జిల్లాలో విద్యార్థులకు అన్నిరకాల సౌకర్యాలున్న కాలేజీల్లోనే ప్రాక్టికల్ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. ఎగ్జామినర్ల జాబితా బోర్డునుంచి అందాల్సి ఉంది. ’