సాక్షి, అమరావతి: ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ పరీక్షలను ఈనెల 31వ తేదీ నుంచి ఏప్రిల్ 24వ తేదీవరకు నిర్వహించనున్నారు. ఇందుకోసం ఇంటర్మీడియెట్‌బోర్డు ఏర్పాట్లు పూర్తిచేసింది. ఎంపీసీ స్ట్రీమ్ నుంచి 2,60,012 మంది, బైపీసీ స్ట్రీమ్‌నుంచి 98,462 మంది మొత్తం 3,58,474 మంది హాజరుకానున్నారు. 947 కేంద్రాల్లో ఉదయం (9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు), మధ్యాహ్నం (2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు) సెషన్లలో ఆదివారాల్లో కూడా ఈ పరీక్షలు నిర్వహిస్తారు. విద్యార్థులెవరికీ ఫిజికల్ హాల్ టికెట్లను బోర్డు పంపిణీ చేయటంలేదు. బోర్డు వెబ్‌సైట్ ‘బీఐఈ.ఏపీ.జీవోవీ.ఐఎన్’ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి. ప్రైవేటు జూనియర్ కాలేజీల్లోని పరీక్ష కేంద్రాలకు ప్రభుత్వ, ఎయిడెడ్ జూనియర్ కాలేజీల నుంచి చీఫ్ సూపరింటెండెంట్లను నియమించనున్నారు. అన్ని పరీక్ష కేంద్రాల్లోను బోటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్సు ల్యాబ్స్‌లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు.
ఆన్‌లైన్లో ప్రశ్నపత్రం
ప్రాక్టికల్ పరీక్షలకు ప్రశ్నపత్రాలను ఆన్‌లైన్లో విడుదల చేయనున్నారు. ప్రశ్నపత్రాన్ని వెబ్‌సైట్‌నుంచి డౌన్‌లోడ్ చేసుకున్న తరువాత పరీక్ష సమయానికి ముందు బోర్డు అధికారులు విడుదల చేసే ఓటీపీతో మాత్రమే ఓపెన్ అవుతుంది. సెషన్ల వారీగా పరీక్ష ముగిసిన వెంటనే మూల్యాంకనం పూర్తయిన సమాధాన పత్రాలు, ఒరిజినల్ అవార్డు లిస్టు, డూప్లికేట్ అవార్డు లిస్టు కవర్లో ఉంచి సీల్ చేయాలి. ఈ ప్రక్రియ మొత్తం సీసీ కెమెరాల ముందు నిర్వహించాలి. పరీక్షలలో అక్రమాలు జరిగితే ఆ కేంద్రంలోని పరీక్షల నిర్వాహకులు, విద్యార్థులను బాధ్యులుగా పరిగణిస్తారు. ప్రాక్టికల్ రికార్డు బుక్సును వేరొకరు వినియోగించకుండా ఒకటి రెండుచోట్ల గోటితో చించాలి. ఫలితాలు విడుదలయ్యే వరకు ఈ ప్రాక్టికల్ రికార్డు బుక్సును సెషన్ల వారీగా, బ్యాచీల వారీగా భద్రపరిచి ఉంచాలి. చీఫ్ సూపరింటెండెంటుకు మాత్రమే పరీక్ష కేంద్రాల్లో సెల్‌ఫోను వినియోగించవచ్చు.
కోవిడ్ జాగ్రత్తలతో పరీక్షలు
కోవిడ్–19 వైరస్ దృష్ట్యా ప్రొటోకాల్ నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పకుండా పాటించాలి. మాస్కు ధరించడం తప్పనిసరి. పరీక్ష కేంద్రాలను శానిటైజేషన్ చేయాలి. కోవిడ్–19తో బాధపడుతున్న విద్యార్థులకు వేరుగా ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించాలి. విద్యార్థులు ఒకే దగ్గర గుంపులుగా చేరకుండా ఉండేందుకు వీలుగా బ్యాచ్‌లోని 20 మంది విద్యార్థుల్లో 10 మందిని మాత్రమే ప్రాక్టికల్ రూములోకి అనుమతించాలి. వారి తరువాత మిగతా 10 మందికి పరీక్షలు నిర్వహించాలి.
31 నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్
Published Mon, Mar 29 2021 2:59 AM | Last Updated on Mon, Mar 29 2021 3:00 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment