ఇంటర్‌ మూల్యాంకనం ఎలా? | Lecturers who want to go online for Inter Evaluation | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ మూల్యాంకనం ఎలా?

Published Tue, Apr 21 2020 2:10 AM | Last Updated on Tue, Apr 21 2020 4:15 AM

Lecturers who want to go online for Inter Evaluation - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్మీడియట్‌ జవాబుపత్రాల మూల్యాంకనం గందరగోళంలో పడింది. లాక్‌డౌన్‌ కారణంగా మూల్యాంకనం ప్రారంభించే పరిస్థితి లేకుండాపోయింది. దీంతో ఎంసెట్, జేఈఈ, నీట్‌ వంటి ప్రవేశ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు ఫలితాల కోసం ఎదురుచూపులు తప్పడంలేదు. సాధారణ పరిస్థితుల్లో ఈ సమయానికల్లా ఫలితాలు వెలువడేవి. ఇప్పుడు మూల్యాంకనమే ప్రారంభం కాకపోవడంతో విద్యార్థులు అయోమయంలో పడ్డారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆన్‌లైన్‌లో మూల్యాంకనం చేపట్టాలని అధ్యాపకులు సూచిస్తున్నా బోర్డు అధికారులు ససేమిరా అంటున్నారు. ఆన్‌లైన్‌ మూల్యాంకనానికి అనువైన పరిస్థితుల్లేవని, చిన్న పొరపాటు తలెత్తినా విద్యార్థులు నష్టపోతారని అంటున్నారు. ఇక ఆఫ్‌లైన్‌లో మూల్యాంకనాన్ని వచ్చే నెల 7వరకు చేపట్టలేని పరిస్థితి నెలకొంది. ఆ తరువాతే మూల్యాంకనంలో వేగం పెంచేందుకు అవసరమైన ప్రత్యామ్నాయాలపై బోర్డు అధికారులు దృష్టి పెట్టారు. మొత్తానికి జూన్‌ మొదటి వారంలోగా మూల్యాంకనం పూర్తిచేసి, జూన్‌ రెండో వారంలోగా ఫలితాలను ప్రకటించేలా కసరత్తు చేస్తున్నారు. 

‘ఆన్‌లైన్‌’కు నో.. ‘ఆఫ్‌లైన్‌’కు ఓకే! 
మూల్యాంకనం ఆన్‌లైన్‌లో చేపట్టాలన్న ప్రతిపాదనలు బోర్డు అధికారులకు ఈ నెల మొదట్లోనే వచ్చాయి. అయితే 9.65 లక్షల మంది విద్యార్థుల జవాబుపత్రాలను స్కానింగ్‌ చేయడం, వాటిని అధ్యాపకులకు పంపించడం, వాటిని ఆన్‌లైన్‌లో (ఆన్‌స్క్రీన్‌) మూల్యాంకనం చేయడం ఇబ్బందికరమని బోర్డు అధికారులు భావిస్తున్నారు. పైగా ఇప్పుడు ఫలితాల ప్రాసెస్‌ను మొదటిసారిగా సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ చేయనుంది. ఈ క్రమంలో చిన్న సమస్య తలెత్తినా విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉందని అంటున్నారు. అందుకే ఆఫ్‌లైన్‌లో మూల్యాంకనం చేపడతామని చెబుతున్నారు.  

ప్రత్యామ్నాయాలపై దృష్టి.. 
లాక్‌డౌన్‌ తరువాత మూల్యాంకనంలో వేగం పెంచేందుకు స్పాట్‌ వ్యాల్యుయేషన్‌ కేంద్రాలను పెంచాలని బోర్డు యోచిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 12 స్పాట్‌ వ్యాల్యుయేషన్‌ కేంద్రాలు ఉండగా, వాటిని 40కి పెంచాలని చూస్తోంది. 12 స్పాట్‌ కేంద్రాల్లో ఖమ్మం, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్‌ స్పాట్‌ కేంద్రాలు మినహా మిగతా 9.. నల్లగొండ, వరంగల్‌ అర్బన్, రంగారెడ్డి, నిజమాబాద్, హైదరాబాద్, మేడ్చల్, మెదక్, హైదరాబాద్, హైదరాబాద్‌లోని వొకేషనల్‌ క్యాంపు ప్రాంతాలన్నీ రెడ్‌జోన్‌లోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో రెడ్‌జోన్‌లో లేని ప్రాంతాలతో పాటు పాత జిల్లాల్లోని కొన్ని ప్రధాన కేంద్రాలు, కొత్త జిల్లా కేంద్రాల్లో స్పాట్‌ వ్యాల్యుయేషన్‌ కేంద్రాల ఏర్పాటు ద్వారా వేగంగా మూల్యాంకనం పూర్తి చేయవచ్చని భావిస్తోంది. మరోవైపు అధ్యాపకులు నివాసం ఉండే ప్రాంతాలకు దగ్గరగా ఉండే స్పాట్‌ కేంద్రానికి వెళ్లి మూల్యాంకనంచేసే వెసులుబాటు కల్పించే అంశాన్నీ పరిశీలిస్తోంది. ఏ జిల్లాలో పనిచేసే లెక్చరర్లు అక్కడే మూల్యాంకనం చేసేలా ప్రస్తుతం ఉన్న నిబంధనను సడలించడం ద్వారా అధ్యాపకులు తమ నివాసానికి సమీపంలోని కేంద్రానికి వెళ్లి వచ్చే వెసులుబాటు కల్పిస్తే ఎక్కువ మంది వస్తారని అధ్యాపకులు చెబుతున్నారు. 

జూన్‌ రెండో వారంలో ఫలితాలు? 
కేంద్రాలను పెంచడం, ఎక్కడ వీలైతే అక్కడి స్పాట్‌ కేంద్రాల్లో వ్యాల్యుయేషన్‌కు అవకాశమిస్తే జూన్‌ మొదటి వారానికల్లా మూల్యాంకనం పూర్తి చేయడం, రెండో వారంలో ఫలితాలను విడుదల చేసేలా బోర్డు కసరత్తు చేస్తోంది. మొత్తం కాకపోయినా రెండు మూడు సబ్జెక్టులకు సంబంధించి ఆన్‌లైన్‌లో మూల్యాంకనం చేయిస్తే మే నెలాఖరులోగా ఫలితాలను ఇవ్వవచ్చని అధికారులు అంటున్నారు. కరోనా ప్రభావం మే, జూన్‌లో కూడా ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ముందుగా ద్వితీయ సంవత్సర మూల్యాంకనమే చేపట్టేలా బోర్డు కసరత్తు చేస్తోంది. 4,85,345 మంది విద్యార్థులున్న ద్వితీయ సంవత్సర ఫలితాల ప్రకటన తరువాత 4,80,531 మంది ప్రథమ సంవత్సర విద్యార్థుల జవాబుపత్రాలను మూల్యాంకనం చేయాలని బోర్డు భావిస్తోంది.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement